పూర్వం ఒకానొక గ్రామంలో వీర్రాజు అనే మొహమాటస్థుడు ఉండేవాడు. మంచితనంవల్ల కొంతా, మొహమాటంవల్ల కొంతా అతడు ఎందరికో సహాయపడుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక వైద్యుడికి ప్రపంచమంటే విరక్తిపుట్టి ఊరికి బాగా దూరంగా ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. మనుషులకు దూరంగా ఉంటున్నప్పటికీ, తనవద్దకి వచ్చినవారికి వైద్యం చేస్తూనే ఉన్నాడు. తన వైద్యవిద్య వృథా పోకూడదని అతడి ఆశయం.
సృష్టిలో అతడు నయం చేయలేని జబ్బులేదని అంతా చెప్పుకుంటారు. ఎటొచ్చీ చికిత్స విషయంలో అతడు విధించే ఆహార నియమాలు కఠినంగా ఉంటాయి. ఒకరోజు వీర్రాజు ఇంటికి వెంకటయ్య అనే స్నేహితుడు తన కొడుకు నకులుణ్ణి తీసుకు వచ్చాడు. నకులుడికి ఏదో తెలియని జబ్బుచేసింది. అందువల్ల ప్రతిరోజూ ఏదో సమయంలో ఉన్నట్లుండి స్పృహ తప్పుతూ ఉంటుంది. స్పృహ తప్పినప్పుడు, అతడు ఒళ్లు తెలియకుండా పడి ఉంటాడు. ఎన్ని ఉపచారాలు చేసినా, తెలివిరాదు. చివరికి తనంతట తనే లేచి కూర్చుని మామూలు మనిషవుతాడు.
నకులుడి రోగం కుదర్చడం ఏ వైద్యుడివల్లా కాకపోవడంతో వెంకటయ్య వాణ్ణి వైద్యుడి ఆశ్రమానికి తీసుకువెళ్లాలని వీర్రాజు ఇంటికి వచ్చాడు. వీర్రాజు, వెంకటయ్య కలిసి నకులుణ్ణి తీసుకుని రెండెడ్లబండిలో వైద్యుడి ఆశ్రమానికి వెళ్లారు. వైద్యుడు నకులుణ్ణి పరీక్షించి, ‘‘ఈ జబ్బు నయం కావడానికి ఏడాది పడుతుంది. అంతకాలం ఇతణ్ణిక్కడే ఆశ్రమంలో విడిచిపెట్టాలి. అయిన వాళ్లెవరూ దగ్గరుండకూడదు. నేను చెప్పే ఆహారనియమాల్ని ఇతగాడు ఖచ్చితంగా పాటించాలి. ఇందుకు అంగీకారమైతే నేను చికిత్స మొదలు పెడతాను’’ అన్నాడు.