చాలా ఏళ్ల తర్వాత అమెరికా నుంచి ఓ చిన్న పాపతో వచ్చిందా కూతురు.. గుమ్మం ముందు నిలబడిన కూతురిపైనే నిందలు వేశాడా తండ్రి.. పెళ్లి కాకున్నా.. ఆ పిల్ల ఎక్కడిదంటూ ఆగ్రహించాడు. ‘చదువుకుంటానని అమెరికాకు వెళ్లి ఇంత పనిచేస్తావా.. ఇప్పటికే నీ గురించి అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లను కూడా చూశాక.. ఊళ్లో మా పరువేం కావాలి..?..’ అని దుర్భాషలాడాడు.. అసలేం జరిగింది....?
***********************
గుమ్మం దగ్గర నిలబడిన నీలవేణిని చూసి సంభ్రమాశ్చర్యాలకి లోనైంది రాగిణి.ఆమె నోట మాట రాలేదు. కొన్ని క్షణాలు అలా చూస్తూనే ఉండిపోయి, తేరుకుంది.‘‘నీలూ..! నువ్వా?’’ ఎన్నేళ్ళైందే నిన్ను చూసి’’ అని ఒక్కఅంగలో ఆమెనుచేరి ఒళ్ళు తెలియని ఆనందతో కౌగలించుకుంది రాగిణి.ఆ ఉద్విగ్నంనుంచి తేరుకుని,‘‘గుర్తుపట్టకుండా ఇలా తయారయ్యావేమిటే? ఏమిటా జుట్టు’’? చనువుగా అంటూ తన వెనుకే నిలబడిన పనిమనిషి సుజాతకు బ్యాగు, సూట్‌కేసు లోపలికి తీసుకురమ్మని పురమాయించింది.ఒకచేత్తో నీలవేణి చేయి పట్టుకుని, రెండో చేత్తో పాపచేతిని పట్టుకుని లోనికి తీసుకువెళ్ళింది రాగిణి.
‘‘నువ్వు కాఫీ తాగి స్నానం చేద్దువుగానీ, ముందు పాపకు తినడానికేమైనా పెట్టమంటావా?’’ అని, నీలు సమాధానంకోసం ఎదురుచూడకుండానే. ‘‘సుజాతా, ఆ సూట్‌కేస్, బ్యాగు గెస్ట్ బెడ్రూములోపెట్టి గీజర్ వెయ్. అమ్మకు బాత్రూం చూపించి రా’’ అంటూ కిచెన్లోకి నడిచింది. క్షణాల్లో నీలవేణికి కాఫీ, పాపకు పాలు పంపించి వంటకు ఉపక్రమించింది.కాఫీ తాగలేదు నీలవేణి. పది నిముషాల్లో స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి, ‘‘ఇప్పుడు వంటేమీ చేయకు రాగిణీ, నాకు ఆకలి లేదు’’ అంది ఆమెను వారిస్తూ.‘‘నీకు లేదు సరే, మరి ఆ చంటిపిల్లకు కూడా ఆకలి లేదంటావా?’’ వాత్సల్యంగా అడిగింది రాగిణి.‘‘ఇంతకీ, ఎక్కడనుంచి వస్తున్నావు? యశ్వంత్ వాళ్ళు రాలేదా? ఆ పిల్ల ఎవరు?’’ నీలవేణి వంక చూడకుండానే పోపులో బెండకాయ ముక్కలువేస్తూ అడిగింది రాగిణి.‘‘యశ్వంత్ వాళ్ళెవరూ ఇప్పుడు నాతో లేరు. నేను అన్నవరంలో ఒక స్నేహితుడి పెళ్ళికి వెళ్ళొస్తున్నాను. ఉదయమే ఇక్కడ విజయవాడలో దిగాను. నిన్న కలుసుకుని, కనకదుర్గమ్మవారి దర్శనం చేసుకుని వెళదాం అనుకుని నీ దగ్గరకు వచ్చాను’’.