ఈ మధ్య చంద్రమ్మ బొత్తిగా కనబడటం లేదు! నిజానికి చంద్రమ్మ అసలు పేరు నాకు తెలియదు. ఎప్పుడో ... పదిహేనేళ్ల క్రితం మొదటిసారి చూశాను. అప్పట్లో చేతిలో పుస్తకాలతో స్కూలుకి వెళ్తుండేది. పాపం.. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. బట్టలు బాగా మాసిపోయి, నలిగిపోయి ఉండేవి. పుస్తకాలు పెట్టుకోడానికి సంచి కూడా ఉండేది కాదు. ఓ భుజం మీద పుస్తకాలు దొంతరగా పెట్టుకుని, అవి పడకుండా శ్రద్ధగా చేత్తో పట్టుకుని నడుచుకుంటూ నా ముందు నుంచే వెళ్లేది.కాస్త ఛాయ తక్కువగా ఉన్నా.. పెద్ద కళ్ళు, గుండ్రటి మొహం, రెండు జడలతో.. చాలా కళగా కనబడేది. పిల్లని చూస్తే బాగా పేద కుటుంబం అని తెలుస్తూనే ఉంది. స్కూలు ఉన్న రోజుల్లో ఉదయం స్కూలుకి వెళ్తూ, సాయంత్రం ఇంటికి వెళ్తూ నా వైపు బుర్ర తిప్పి, ఓ చేత్తో నమస్కారం పెట్టేది!అదే పరిచయం. అంతకంటే నాకా పిల్ల గురించి ఇంకేం తెలియదు!ఆ పిల్ల పేరు తెలియక పోవడంతో ‘చంద్రమ్మ’ అని పేరు పెట్టుకున్నా. నిజానికి రోజూ కనబడే మనుషుల పేర్లు కూడా నాకు తెలియవు. నా దగ్గర నిలబడి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేర్లు తెలిసేవి. మధ్య మధ్యలో నా పేరు కూడా వాళ్ళ నోటంట వినబడేది. కాని వాళ్ళల్లో నాకు నచ్చినవాళ్ళు ఎవరూ కనబడలేదు. ఒకరిద్దరు కనబడినా వాళ్లు మళ్ళీ కనబడలేదు!చాలామంది పిల్లలు కూడా నా ముందు నుంచి వెళ్తుంటారు, కాని నా వైపు చూడనే చూడరు! బహుశా అందుకేనేమో... వాళ్ళందరిలో చంద్రమ్మ నాకు బాగా నచ్చింది. అంటే ఆ పిల్ల మొహం కళగా ఉందని నచ్చడం కాదు, ఆ మొహంలో ఉన్న అమాయకత్వం వల్ల కాబోలు! లేదా, చదువు పట్ల ఆ పిల్లకున్న శ్రద్ధవల్ల కామోసు!అలా నాకు చంద్రమ్మ బాగా పరిచయం అయింది. ఇంతకీ... చంద్రమ్మకి నేనేవరో తెలుసో తెలియదో, నాకు తెలియదు. మా మధ్య వంద ఏళ్లకు పైగా తేడా ఉంటుంది. అయితేనేం... నాకు చంద్రమ్మ బాగా అలవాటైపోయింది!

                                        **************************************************