ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు,ఒక్క నమస్కారం ఓ ప్రేమకథని మార్చేసింది. అదెలా జరిగిందంటే ...ఎదురుగా మహాశక్తిలా మహా సముద్రం. ఆ శక్తికి మచ్చుగా ఎగసిపడుతూ కెరటాలు. వాటిని నిలువరిస్తూ అసంఖ్యాకంగా ఇసుక రేణువులు. వాటికి బీచ్‌ అని పేరెట్టి - మనోహర ప్రకృతికి తోడుగా ఆధునిక సదుపాయాల్ని కల్పించి - విలాసానికీ, వినోదానికీ అనువుగా మార్చిన ఘనత - నగరపు మనిషిది.ఆ బీచ్లో కూర్చున్న అనేకమందిలో ఓ జంట - రాజు, రాణి.

‘‘ఎగసిపడుతున్న ఆ కెరటాలు. మన ప్రేమకు ప్రతిరూపంలా లేవూ!’’ అన్నాడు రాజు.రాణి తల అడ్డంగా ఊపి, ‘‘అవి ఉవ్వెత్తున పొంగి, క్షణమాత్రాన నేలపాలౌతాయి. కానీ మన ప్రేమ లోతైన నడిసంద్రపు జలాల్లా ప్రశాంతమూ, శాశ్వతమూ’’ అంది.‘‘సరే, నువ్వెలాగంటే అలాగే’’ అన్నాడు రాజు నవ్వుతూ. రాణి నవ్వలేదు, ‘‘అలాగని నాకు చెప్పడం కాదు. మీ ఇంట్లో మీ అమ్మానాన్నలకి కూడా చెప్పాలి’’ అంది గంభీరంగా.అంతే - రాజు మొహం గంభీరంగా ఐపోయింది, ‘‘మరి నువ్వు మీ ఇంట్లో చెప్పావా?’’ అన్నాడు.‘‘దాచడానికిదేమైనా రహస్యమా? వాళ్లకి తెలియాలనే కదా, బాహాటంగా కలిసి తిరుగుతున్నాం. తెలియనట్లు వాళ్లు నటిస్తున్నారు కానీ వాళ్లకి తెలిసినట్లే మసలు తున్నాం మనం.

ఐనా శంఖులో పోస్తేనే కదా తీర్థమవుతుందని - మొన్నో రోజున వాళ్లకి మన ప్రేమ విషయం చెప్పేశాను కూడా.’’‘‘ఏమన్నారు మీవాళ్లు?’’ అన్నాడు రాజు ఆత్రుతగా.‘‘మేజర్లం. స్వతంత్రులం. ఏమంటారు మన్ని? కానీ తిట్టాలి కదా అని అమ్మ ఓ సారి తిట్టింది. కోప్పడాలి కదా అని నాన్న ఓసారి కొట్టినంత పని చేశాడు. అన్నయ్యే కాస్త వేరు. అట్నించి నరుక్కొస్తానని దంబాలు కొట్టాడు. అట్నించంటే నీవైపునుంచిట! నరకడమంటే నిజంగా నరకడమేనుట. అదీ వాడి బిల్డప్‌’’ అందామె.రాజు చలించలేదు, ‘‘రమ్మను. ఇక్కడెవరూ గాజులు తొడిగించుకుని కూర్చోలేదు’’ అన్నాడు.‘‘గాజులు తొడిగించుకోకపోవడమే పౌరుషానికి చిహ్నమైతే - నా చేతికీ గాజులు లేవు. కాస్త సామెత మార్చి ఆలోచించు’’ అంది రాణి. అప్పుడు రాజు అప్రయత్నంగా ఆమె చేతుల్ని చూస్తే - ఓ చేతికి వాచీ. ఓ చేతికి ఫ్రెండ్షిప్‌ బాండ్‌. ఏ చేతికీ గాజులు మాత్రం లేవు.