అతను గొప్పింటి బిడ్డ. కాలు కిందపెట్టే రకం కాదు. ఆమె అట్టడుగు మనిషి. ఏరికోరి ఆమెను పెళ్ళాడాడు. పెళ్ళయ్యాకే ధనవంతుల ప్రపంచం ఆమెకు అనుభవంలోకి వచ్చింది. ఆశ్చర్యంగా గమనిస్తోందామె. అత్తారింట్లో ఆమెను ఆమెగా అందరూ రిసీవ్‌ చేసుకున్నారు. ధనికుల ఇళ్ళల్లో వ్యవహారాల గురించి విన్న చాలా మాటలు అబద్ధాలనిపించాయామెకు. కానీ ఓ పెద్ద లోపం కనిపించింది. సరిదిద్దాలనుకుంది. సరిదిద్దిగలిగిందా?....

తను ఎవరికైనా నచ్చుతుందనీ, తనకు ఎవరైనా ప్రపోజ్‌ చేస్తారని సుమ అస్సలు అనుకోలేదు.దానికి కారణం ఉంది.సుమ అందంగా ఉంటుంది. కానీ ఫ్యాషన్‌ డ్రస్సులు వేసుకోదు. మేకప్‌ చేసుకోదు. పార్టీల్లో, పబ్బుల్లో కనపడదు.నిజానికి ఆ వయసు ఆడపిల్లలు కనిపించే ఏ ప్రదేశాల్లోనూ ఆమె కనపడదు.పండుగ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే, అక్కడ రోగులకు పండ్లుపంచుతూ కనిపిస్తుంది సుమ. క్రిస్‌మస్‌రోజు అనాథ శరణాలయాలకు వెళ్ళిచూస్తే, అక్కడి పిల్లలకు బట్టలు పంచుతూ కనిపిస్తుంది సుమ.

 

‘చెత్తకుండీలో అనాథశవం’ అనే వార్త మీరు ఉదయం పేపర్లోచదివే సమయానికి సుమ ఆ పాప దగ్గరకు చేరుకుని, ఆ పసిబిడ్డను ఎక్కడికి చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.అలాంటి డల్‌ లైఫ్‌ గడిపే సుమ దగ్గరకి ఎంతోమంది సహాయంకోసం వస్తుంటారు. కొంతమంది సహాయం చెయ్యటానికి కూడా వస్తుంటారు. కానీ ఇంతవరకు ఎవరూ ప్రపోజ్‌ చెయ్యటానికి రాలేదు.కానీ ఆ రోజు ఒక కుర్రాడు ఆమెకు ‘ఐ లవ్‌ యు’ చెప్పాడు.అతని పేరు విష్ణు.కొందరు బంగారపు స్పూను నోట్లో పెట్టుకుని పుడతారంటారు. అలాంటివ్యక్తుల ఉదాహరణ చెప్పవలసివస్తే ముందు కనిపించేది అతనే! ఒకపెద్ద వ్యాపారకుటుంబంలో లేక లేక పుట్టిన ఏకైక వారసుడు విష్ణు.విష్ణు ప్రపోజ్‌చేసే సమయానికి అతన్ని అంతకుముందు ఎప్పుడూ చూసిన గుర్తులేదు సుమకు. అదే అతనితో అంది.‘‘నో ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నావుగా..’’ అన్నాడతను.‘‘నీ గురించి నాకు ఏమి తెలుసని ఒప్పుకోవాలి?’’ అడిగింది ఆమె.ఒక్కనిమిషం ఆలోచించాడు విష్ణు. ‘‘జస్ట్‌ ట్రస్ట్‌ మి. నా మీద నమ్మకం ఉంచు. నన్ను నమ్మినవాళ్లు బాధపడే అవసరం ఎప్పటికీ రానివ్వను..’’ అన్నాడతను.