ఇప్పుడు అందరూ ఎక్కువగా ప్రతీదానికీ ఉపయోగించే పదం కమ్యూనికేషన్ గ్యాప్! సరిగా అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట. కొంతమందిని కొందరు ఎన్ని సంవత్సరాలైనా అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో గ్రహించలేరు. ఈ కథలో కూడా తండ్రీకొడుకుల మధ్య ఇలాగే జరిగింది. కొడుకు ప్రశ్నకు తండ్రి మాత్రమే పశ్చాత్తాపపడ్డాడుతప్ప కొడుకు రియలైజ్ కాలేదు. ఎందుకని? ఇంతకీ క్లైమాక్స్‌లో ఏమైంది?
సంధ్య తన కిరణాలను హుస్సేన్‌సాగర్ నీళ్ళపై పరచి చేనేత వస్త్రంలో కొత్త డిజైన్ తయారు చేస్తున్నట్టు ఆరెంజ్ రంగు అద్దుతోంది. బుద్ధభగవానుడు నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నాడు.‘నాన్నని అలా అని ఉండాల్సింది కాదు...’ అప్పటికి ఎన్నిసార్లు అనుకున్నాడో! తనలో తను చాలాసార్లు అనుకుంటూ మథనపడిపోతున్నాడు రాఘవ.చిన్నప్పట్నించి తండ్రి తనకేంచెయ్యలేదన్న ఉక్రోషం. ఒక్కమాటతో బైటపడిపోయాడు. ఆయన దగ్గరున్న లక్ష రూపాయల్లోంచి యాభై వేలు తీసి ఇవ్వలేదన్న కోపంతో నోరు జారాడు.‘‘నువ్వు నాకు ఎప్పుడు ఏం చేశావని? నా కెలాగూ ఏమి చెయ్యలేదు, ఇప్పుడు నా కొడుక్కి నేను అన్ని చేస్తున్నానని కుళ్ళుకుంటున్నావు. పోతూపోతూ డబ్బు నీతోపాటు పట్టుకుపోలేవు కదా!’’ అనేశాడు తను.
ఆ క్షణంలో ఆయన ముఖంలోని భావాలను తను అర్థం చేసుకోలేదు కానీ, నాన్నగొంతులోంచి ‘సారి’ అన్న రెండక్షరాలు ఎంతభారంగా వచ్చాయో వినిపించింది. ఆయన తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ట్యాంక్‌బండ్ మీద కొచ్చి నిలుచున్నాడు అచ్చు బుద్ధభగవానుడిలాగే.చీకట్లు ముసురుకున్నాయి. మేమొచ్చాశాం అంటూ వెలుగులైట్లు మిలమిల్లాడుతున్నా అతను అలాగే శిలలా నిలబడి తనలో తను మథనపడుతున్నాడు.
చాలామంది చాలా హ్యాపీగా ఉన్నట్టు అటు ఇటూ తిరుగుతూ, ఫొటోస్ తీసుకుంటూ, తినుబండారాలు నెమరేస్తూ, బోటుషికారుకు వెళుతూ కేరింతల కొడుతూ చాలా ఉల్లాసంగా ఉన్నారు.చాలాసార్లు అతని ఫోన్ రింగ్ అయింది. మెసేజెస్ వచ్చినట్టు తెలుస్తోంది. అతను పట్టించుకోలేదు. ఇంటి దగ్గర నాన్న పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు రాఘవ.‘‘బాబూ! నువ్వెంత సేపు నిలబడినా ఆ బుద్ధదేవుడు కదిలి రాలేడు. ఆయల్నాగే నీకూ కాళ్ళు లాగడం లేదేంటి బాబూ!’’ అడిగాడు పల్లీలు అమ్ముకునే యాదగిరి.