మా నాన్నారు చనిపోయిన విధానం చూసి, ‘చాలా అదృష్టవంతుడు, అనాయాస మరణం పొందాడు’ అని అందరూ వేనోళ్ళ పొగుడుతున్నారు. డెబ్భై ఐదేళ్ళు పైబడినా ఏ చింతలూ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండే మనిషి! ఏమైందో తెలియదుగానీ రాత్రి నిద్రలోనే చనిపోయారు. తెల్లారి లేచి చూసి, ఇంట్లో వాళ్ళందరం ఒక్కసారిగా ఘొల్లుమన్నాం.అందరినీ అదిలిస్తూ, నవ్విస్తూ సందడిగా తిరిగిన మనిషి! నిన్నటివరకూ ఇంటికి పెద్దదిక్కుగా ఉండి అన్నీ తానై నడిపించారు. శాసించారు! ఇంట్లో ఆయన మాటకు అంతటి మన్ననా, గౌరవం ఉండేవి.

జన్మనియ్యకపోయినా ఆయనంటే మాకు ఎనలేని ప్రేమానురాగాలు. ఈ భూమ్మీద మేము పుట్టిపెరిగిన దగ్గరనుంచీ మా ఆలనా పాలనా అన్నీ ఆయనే స్వయంగా చూసుకునేవారు. తన కన్నబిడ్డలతో సమానంగా మమ్మల్ని ఆదరించారు. ప్రేమించారు.ఇంట్లోవాళ్ళు చూసీచూడనట్టు మాపట్ల ఉదాసీనంగా వ్యవహరించినా ఆయన మాత్రం నిండు మనసుతో మమ్మల్ని అక్కున జేర్చుకున్నారు. మాకు ఎప్పుడైనా తేడాలుచేసినా మా చుట్టూ ఓ ఆరోగ్యకవచమై నిలిచి మళ్ళీ మేము అందంగా ఆరోగ్యంగా కనిపించేవరకూ నిద్రపోయే వారుకాదు.

మా బాగోగుల కోసం ఆయన పడుతున్న శ్రమచూసి విలవిల్లాడిపోయే వాళ్ళం! అంత శ్రద్ధ కనపర్చేవారు మేమంటే. మేము పెరిగిపెద్దైన తర్వాత కూడా మాపట్ల అదే ప్రేమ. అదే శ్రద్ధ! ప్రయోజకులమైనందుకు రోజుమొత్తంలో ఒక్కసారన్నా మాకేసి తలపంకిస్తూ గర్వంగా చూసేవారు. ఆ చూపులు మళ్ళీ మళ్ళీ కావాలనిపించేది.ఆయన చూపిస్తున్న వాత్సల్యానికి ప్రతిగా ఒక్కోసారి ‘‘నాన్నారూ’’ అంటూ గట్టిగా పిలవాలనిపించేది. కానీ, పిలవలేకపోయే వాళ్ళం! మాకు ప్రతిబంధకాలు పరిమితులు!నాన్నారి మరణానికి మౌనంగా రోదించటంతప్ప, ఇప్పుడూ అదే పరిస్థితి మాది.