ఊరూ ఏరూ ఏకమైనప్పుడు, అందరూ ఒక్కచోటే తలదాచుకోవాల్సి వచ్చినప్పుడు మనిషిపెట్టుకున్న కులగోత్రాలు, మడిదడిలాంటి ఆచారాలకు తావెక్కడిది? ఆ తరహాలోనే ఆ ఇంట్లో కుటుంబపెద్దకి పెద్ద కష్టం వచ్చిపడింది. అనారోగ్యం చేసింది. ఇప్పుడు ఉన్న కర్తవ్యం ఒక్కటే. ‘ఆయన్ని’ తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చెయ్యడం. సరిగ్గా అలాంటి సమయంలోనే మాలచ్చి వాళ్లింట్లోకి ప్రవేశించింది. మాలచ్చి ఎవరు? ఆమె ఎందుకు ఆ ఇంటి కొచ్చిందీ అంటే..
సన్నగా వర్షం పడుతోంది.వానకన్నా గాలి ఎక్కువగా ఉండి, వాతావరణం ఎంతో హాయిగా ఉంది. పొలం గట్టున ఆ ఇంట్లో ఉన్నారు శివరాం, మాలచ్చి. చల్లటి ఆ వాతావరణంలో ఒకరి నగ్నదేహం మరొకరికి వెచ్చగా చిరుసెగలాగ ఉత్సాహంగా ఉంది.కరణం శివరాంకి ఆ ఖాతా ఉందని ఊళ్ళో చాలామందికి తెలుసు. పొలం గట్టునున్న పాక పడగొట్టి, అక్కడే రెండుగదుల డాబా వేసి మాలచ్చిమితో కాపురం పర్మనెంట్ చేశాడు శివరాం. భార్యాభర్తలు కాకపోయినా అంతకుమించిన కాపురమే చేశారు ఇద్దరూ.ఇద్దరూ విడివడ్డారు. మంచం దిగి బట్టలు కట్టుకుంది మాలచ్చి. శివరాం కూడా లుంగీ చుట్టబెట్టుకున్నాడు. శివరాంకి యాభై నాలుగు, మాలచ్చికి నలభై నాలుగేళ్ళ వయసు. చిన్న వయసేం కాదు. కానీ మాలచ్చిని చూస్తూ ఎంతో ముచ్చటపడిపోతాడు శివరాం.
‘ఇలాంటి చల్లటి వాతావరణంలో మందు తాగుతూ, కారం జీడిపప్పు నంజుకుంటూ, జీడిపిక్కలాంటి నీతో గడపటంకన్నా స్వర్గం ఏముంటుంది మాలచ్చీ అంటుంటాడు. ఇప్పుడూ అదే అన్నాడు.‘‘ఊరుకుందూ. ఎప్పుడూ అదే రంది’’ అంది మురిపెంగా మాలచ్చి. అరగంట గడిచేలోపే, మళ్ళీ పిలిచి మాలచ్చిని పక్కలో దగ్గరగా కూచోపెట్టుకున్నాడు శివరాం. తాగుతూనే ఉన్నాడు.‘‘నీకీ మధ్య తాగటం ఎక్కువైపోయింది’’ అంది మాలచ్చి.‘‘ఊ....’’ అన్నాడు శివరాం మాలచ్చి నడుంమీద చెయ్యేస్తూ.‘‘యిదీ ఎక్కువైంది’’ అంది.శివరాం ఏం మాట్లాడలేదు. మధ్యవయస్సులో సెకండ్ యూత్ వస్తుందని విన్నాడు.
అయినా, ఇప్పుడు నష్టమేముంది అనుకున్నాడు.అలా అనుకుంటూనే మాలచ్చిని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. శరీరంలో కొంత ఉద్రేకం ఉంది. మరింతగా ఉద్రేక భావనని కావాలనే ప్రేరేపించుకుంటున్నాడు. జీవితాన్ని మరింతగా అనుభవించేయాలన్న లాలస.అలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు మాలచ్చి. తన కళ్ళెదురుగానే, అదీ తన కౌగలిలోనే శివరాం ఏదో తాడులాగా మెలికలు తిరిగిపోయాడు. ఎడంకాలు, ఎడంచెయ్యి మెలిక తిరిగి లాక్కుపోయాయి. మూతి వంకరపోయింది. నోట్లోంచి నురగలు.