ఆ చిట్టితల్లికి తాతయ్యంటే పంచప్రాణాలు. తాతయ్యకి కూడా అంతే. చిట్టితల్లి దాదాపు తాతయ్య కనుసన్నల్లోనే పెరిగింది. కానీ పదో తరగతి పరీక్ష తప్పింది. తాతయ్య గారాబం వల్లనే తన కూతురు పరీక్ష తప్పిందని ఆగ్రహించింది ఆమె తల్లి. తాతయ్యతో మాట్లాడటం మానేసింది. తాతయ్య మనవరాలు విడిపోయారు. కానీ అది ఎన్నటికీ వీడనిబంధం అని ఓ సంఘటన రుజువు చేసింది! ఏమిటది?

‘‘తాతయ్యా....!’’ఆ పిలుపులో ప్రేమ ఉంది. అభిమానం ఉంది. చనువు ఉంది. భయం ఉంది.అమ్మానాన్నలకన్నా నేను ఎక్కువగా ఇష్టపడేది తాతయ్యనే.తాతయ్యకు నేనంటే కేవలం ఇష్టమే కాదు, ప్రాణం.నా చిన్నప్పుడు ‘‘తాత... తాత’’అని పలికేదాన్నట. ఆ పలుకులకే తాతయ్య ఎంతగానో మురిసిపోయేవారట.నెలల పిల్ల దగ్గర్నుంచే తాతయ్యకు నేను చేరువయ్యాను అంటారు. అందుకు కారణాలు చాలా చెప్పారు. నాన్న ఉద్యోగరీత్యా తరచూ క్యాంపులకి వెళ్ళడం, అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం, దానికితోడు చాలామంది పిల్లల్లాగే రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్నట. పాపం తాతయ్య నన్ను ఎత్తుకుని తిప్పేవారంట. ఎప్పుడో ఏ అర్ధరాత్రో తాతయ్య గుండెలమీద నిద్రపోయే దాన్నట.ఆకలివేస్తే తాతయ్య పాలుపట్టేవారు. ఏడిస్తే ఎత్తుకుతిప్పేవారు.

నేను నిద్రపోవాలంటే తన రెండు చేతుల్ని ఊయలుగా చేసి నిద్రపుచ్చేవారు.అలా అలా తాతయ్య లాలనలో ముద్దుగా, ముచ్చటగా పెరిగాను. ‘‘తాతయ్యా! నేనంటే నీకెందుకు అంత ఇష్టం?’’ అని తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి అడిగితే, తాతయ్య నా చిన్నిచేతుల్ని తన చేతిలోకి తీసుకుని చిన్నగా ముద్దాడి ‘‘ఇష్టం కాదమ్మా, ప్రాణం’’ అనేవారు. అంతేకాదు నేను తన అమ్మనట, తాతయ్య నన్ను పేరుపెట్టి పిలవడం అరుదు, ‘‘అమ్మా’’ అని పిలిచేవారు.తాతయ్యకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమంట. తాతయ్య పదవ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందట. నేను అచ్చు వాళ్ళ అమ్మలానే ఉంటానట. అందుకే నేనంటే అంత ఇష్టమట. ఇవన్నీ మమ్మీ చెప్పింది.తాతయ్య నా స్కూలు యూనిఫామ్‌ ఇస్త్రీ చేసేవారు. నా షూ పాలిష్‌ చేసేవారు. నన్ను నీట్‌గా తయారుచేసి కాన్వెంట్‌కి పంపేవారు. అప్పుడప్పుడు కాన్వెంట్‌కి వచ్చి టీచర్స్‌ని నా గురించి అడిగి తెలుసుకునేవారు.