గుమ్మంలోంచి అడుగు బయట పెట్టబోతూ చూశాను... అల్లంత దూరం నుంచి చెయ్యి ఊపుతూ ఉత్సాహంగా వస్తున్న అతన్ని చూసి ప్రతిస్పందనగా తనూ చెయ్యి ఊపింది నా భార్య. తన కళ్ళల్లోని మెరుపు నా కళ్ళని దాటి పోలేదు.అడుగు ముందుకు పడలేదు. లోపలే ఉండిపోయాను. వరండాలోని తన పక్కన మరో కుర్చీలో కూచున్నాడు అతను. అతని వెన్నంటే వచ్చిన డాల్మేషన్‌ పక్కనే కూచుంది.

తలుపు పక్కనే ఉన్న కిటికీలోంచి వాళ్ళిద్దరినీ తరచి చూశాను. చాలా రిలాక్స్‌డ్‌గా కూర్చునున్నారిద్దరూ. తన పట్ల అతను చూపిస్తున్న ఆపేక్ష నాకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. తన పట్ల అతను చూపే ఆరాధన నాకు ఈర్ష్య కలిగించింది.ఆరడుగులకు రెండంగుళాలు తక్కువే ఉన్నా... మంచి ఫిజిక్‌ మెయింటెయిన్‌ చేస్తుండడం వలన ఇంకాస్త పొడుగ్గా కనిపిస్తాడు అతను. రిటైర్మెంటుకి నాలుగేళ్ళ దూరంలో ఉన్నా అలా అసలు కనిపించడు.మిలట్రీలో మంచి హోదాలో ఉన్నప్పుడే భార్య అనారోగ్యం అతన్ని వాలంటరీ తీసుకునేలా చేసింది. తరువాత యు.ఎస్‌. కాన్సులేట్‌లో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా జాయినయ్యి అప్పుడే దాదాపుగా పదేళ్ళు దాటింది. భార్య శాశ్వతంగా దూరమయ్యి మూడేళ్ళు. తోడు దూరమై ఏర్పరచిన ఖాళీని దుఃఖంతో పూరించి ఎండుటాకులా మారే క్రమంలో నా స్నేహం, నా భార్య చూపిన వాత్సల్యం క్రమంగా ఊపిరులూది పచ్చని అరిటాకులా మారేట్టు చేసిందని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడు అతను.

పిల్లలకి రెక్కలొచ్చి వెళ్ళిపోయాక గానీ ఈ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాముఖ్యత మరింతగా తెలిసొచ్చిందని చెప్పడంలో అతను గానీ, మేము గానీ ఏమాత్రం సందేహించం.రెండు మూడేళ్ళ అంతరం ఉన్నా.. నాలుగయిదిళ్ళ అవతలున్నా మా మధ్య స్నేహం మరింతగా బలపడడానికి కారణం మా వేవ్‌ లెంగ్త్‌ కలవడమేనన్నది నా నమ్మకం.కానీ, నా నమ్మకం నమ్మకం కాదనీ, అది కేవలం అపోహేనని నాకు తెలియడం మొదలైంది ఈ ఆర్నెల్ల కాలంలోనే.మందు ఇద్దరికీ అలవాటే, రెగ్యులరే. కానీ... అతను తాగేటప్పుడూ... తాగాక కూడా కంట్రోల్‌గా ఉండేవాడు. మిలటరీ క్రమశిక్షణ ఇందులో కూడానా అని గేలి చేసేవాడ్ని. అలవాట్లలో ఇద్దరం ఒకటే అయినా అవలంబించడంలో విరుద్ధం.