ఉదయ శేఖర్‌ బీచ్‌కి ఎదురుగా రోడ్డు పక్క గట్టు మీద కూర్చున్నాను. సూర్యుడు కుంగిపోవడానికి ఇంకాస్త సమయం వున్నట్టుంది. డిశంబర్‌ నెల కావడంతో ఆ లేత ఎండ హాయిగానే వుంది. సముద్రతీరం కోలాహలంగా వుంది. మనుషుల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. అది చూడ్డానికి గమ్మత్తుగా అనిపిస్తోంది. నా చుట్టుపక్కలంతా రద్దీ వాతావరణం నెలకొని వుంది. నాకు మాత్రం సమూహంలో ఒంటరిగా వున్నాననే భావన కలుగుతోంది. ఈమధ్య తరచుగా ఎందుకో ఇలానే అన్పిస్తోంది.సూర్యుడు దిగిపోతున్నాడు. ఒంటరితనంలాంటి చీకటి చుట్టూ వేగంగా కమ్ముకుంటోంది. సరిగ్గా అప్పుడే అతడు అకస్మాత్తుగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఎవరితను? బాగా తెలిసిన మొహంలా వుంది. మసక చీకట్లో కూడా ఆ మొహంలో ఏదో వెలుగు కన్పిస్తోంది. అతడెవరో.. పేరేమిటో గుర్తురావడం లేదు. నాకు ఏ విధంగా పరిచయమో కూడా గుర్తు రావట్లేదు. ఎక్కడ చూశాను ఇతణ్ణి? ఏమీ గుర్తురావడం లేదు. కానీ నాకు బాగా తెలిసినవాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంతలో అతడు స్నేహపూర్వకంగా నవ్వాడు. అంతే! మా మధ్య నున్న దూరం చెరిగిపోయింది. అతడు మాట్లాడ్డం ప్రారంభించాడు. ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు! జూల్స్‌ వెర్న్‌ రచనల గురించి మాట్లాడాడు. శ్రీనాథుడి చాటువుల గురించి చెప్పాడు. చార్లీ చాప్లిన్‌ మోడరన్‌ టైమ్స్‌ మూవీ ప్రస్తావించాడు. నేను కూడా ఉత్సాహంగా సంభాషణలో పాల్గొన్నాను. తర్వాత అతడు ఒకదాన్లో నుంచి ఇంకొక దాన్లోకి సులువుగా వెళ్ళిపోతూ ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఇళయరాజా సంగీతంలోని బీజియమ్స్‌ గురించీ, ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసే సీన్ల గురించీ, మార్క్‌ ట్వైన్‌ రచనల్లో శైలిని గురించీ, బాలూమహేంద్ర సినిమాలో ఫొటోగ్రఫీ గురించీ.. ఇలా చాలా వాటి గురించి ఉత్సాహంగా మాట్లాడాడు. నేను అక్కడక్కడా కొన్ని మాటలు చెప్పాను. విచిత్రమేమిటంటే అతడు నా అభిప్రాయాల గురించి ఒక్కసారి కూడా అడగనే లేదు! అంతకంటే విచిత్రమేమంటే అతడు మాట్లాడిన విషయాలన్నీ నాకు చాలా ఆసక్తిని కలిగించేవీ, ఎంతో ఇష్టమైనవీ కూడా! ఇదెలా జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా నా ఒంటరితనమంతా ఎగిరిపోయినట్టు అనిపించింది. తేరుకుని చూసేసరికి అతడెప్పుడు వెళ్ళిపోయాడో మరి.. అక్కడ లేడు!

                                                                 **************************************