‘‘ఒక మంచి కథ రాయకూడదూ’’ అన్నాడు కంఠు.‘‘దేనిమీద ఇంతసేపూ నువ్వు చెప్పిన దానిమీదేనా?’’ తిరిగి ప్రశ్నించింది శశి.నీలకంఠు శశికి దూరపుబంధువు. వరసకి తమ్ముడౌతాడు. ఇద్దరూ ఇంచుమించు సమవయ స్కులు కావటం ఇద్దరికీ సాహిత్యాభిరుచి ఉండటం వల్ల నీలకంఠు తనకు సెలవులు ఉన్నప్పుడల్లా శశి వాళ్ళింటికి వెళ్తుంటాడు.
శశి కొత్తగా ఒక ప్రైవేటు కాలేజీలో పార్టుటైమ్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. కాలేజీలో, యూని వర్సిటీలో చదువుతున్నప్పటి నుండీ స్త్రీ చైతన్య సంస్థలతో గల అనుబంధం వల్ల అప్పుడప్పుడు ర్యాలీలకు, మీటిగులకు కూడా హాజరౌతూ ఉంటుండేది.శశీ, కంఠూ కలుసుకున్నప్పుడల్లా సాహిత్యచర్చలే కాకుండా తరుచూ సమాజంలో జరుగు తున్న వివక్షలు, అన్యాయాలు గురించి వాదోపవాదాలు చేసుకోవటం అలవాటే. కంఠూ ఒక్కో సారి ఒక్కోరకంగా అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటాడు. శశిని ముప్పుతిప్పలు పెట్టటానికి ప్రయత్నిస్తూ చర్చలు లేవదీసాడు. ఇద్దరూ కూడా అప్పుడప్పుడు రచనలు చేస్తూ ఒకరికొకరు వినిపించుకొని విశ్లేషించుకుంటారు. అయితే ఇటీవల పరిశోధన కోసం యూనివర్సిటీలో చేరటంతో రాక పోకలు తగ్గాయి.
నాల్రోజులు సెలవులు వచ్చాయని ఊర్లోకి వచ్చాడేమో శశి వాళ్ళ ఇంటికి వచ్చాడు.కంఠూ వాళ్ళ మేనమామ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల మందులు తేడా చేసాయో, బలహీనత వల్లనో తెలియదు కానీ తరుచూ బేలన్సు చేసుకోలేక చటుక్కున కూలబడిపోతున్నాడు. దాంతో తుంటె ఎముక విరిగి మంచం పట్టాడట. అతని భార్యా, కొడుకూ కోడలు అతన్ని లేవదీయటం, పడుకోబెట్టటం అతని పనులు చేయటం కష్టమైపోతుందని చెప్పి ఒక వృద్ధాశ్రమంలో చేర్చారట.ఆ విషయాలన్నీ చెప్పి వాళ్ళ అత్తని తెగతిట్టాడు కంఠూ. ‘‘నువ్వు స్త్రీ పక్షపాతిగా మాట్లాడు తావు కదా? మరి ఇప్పుడు చెప్పు.
అందరూ ఉండి ఇలా అనాధగా వృద్ధాశ్రమ పాలు చేయటం అన్యాయం కాదా? మామయ్య తన కొడుకు చదువుకోసం చిన్నప్పటీ నుండీ ఎంత శ్రమపడ్డాడో నీకూ తెలుసు. కొడుకు పరీక్షల సమయంలో ఆఫీసుకు సెలవుపెట్టి మరీ పక్కన కూర్చుని చదివించేవాడు. అట్లాగే భార్యకి ఆఫీసు దూరంగా ఉందని తానే లోనుపెట్టి కారు కొని ఇచ్చి, అతను మాత్రం బస్సుల్లోనే తిరిగేవాడు. స్నేహితులూ, బంధువులూ వెక్కిరించినా పట్టించుకోకుండా, తాను కష్టపడినా, భార్యాపిల్లలకీ ఏ కష్టం కలగకుండా చూసుకోవాలను కునే మనిషి. అటువంటి వాణ్ణి ఈ చివరిదశలో అలా వృద్ధాశ్రమానికి చేర్చేసారు’’ కంఠూ కంఠంలో కోపమూ, బాధగా తొంగి చూస్తున్నాయి.