అతను గోడ బీరువాకి ఉన్న చెక్క తలుపుతీసి లోపల ఉంచిన నీలం రంగు అట్ట ఉన్న ఫైల్ బయటికి తీస్తున్నప్పుడు ఆమె వంటగదిలో టీ కోసం నీళ్ళు మరిగిస్తోంది.
ఇద్దరిదీ చెరొకరకం టీ.ఆమె పాల కోసం ఫ్రిజ్ తెరిచేలోపు అతను గబుక్కున వచ్చి ఫ్రిజ్ తలుపు మూసేశాడు. అప్పటికే లోపల పెట్టిన మల్లెపూల వాసన బయటికి ఉరకబోయి ఉనికిని చెప్పేసింది. కానీ ఆమె గమనించలేదు. గమనించేలా లేదు కూడా.‘పాలు ఇవతలే ఉన్నాయి, చూడు’ అంటూ వంట గట్టు మీది మరో గిన్నె మూత తీసి చూపించాడు. ఆమెకు పాలతోనూ, అతనికి బ్లాక్ గానూ టీ.గాజు కప్పులు అతనికి ఇష్టం. రెండు రంగుల్లోనూ పైకి కనిపిస్తూ రెండు టీలూ.ఆమె చేతిలో కప్పు లాక్కుని ఒక సిప్ చేసి కుడిచేత్తో చెంప లాంటి ఆమె బుగ్గ గిల్లి, నవ్వి మళ్ళీ ఇచ్చేశాడు.ఆమె కోపంగా చూసి టీ కప్పు గట్టు మీద పెట్టేసింది.‘‘పోనీ ఇది తాగు’’ అని తన బ్లాక్ టీ తనే ఆమె పెదాలకు తాకించి ఆమె పెట్టిన చేదుమొహం చూసి పకపకా నవ్వేసి - ‘‘అక్కడ కూచుందాం రా.. నీకో విశేషం చూపిస్తాను ఇవాళ’’ అంటూ బెడ్ రూం వేపు నడిచాడు.
ఆమెకు టీ చాలా వేడిగా ఇష్టం. ఎంత వేడిగా అంటే చివరి చుక్క కూడా అంతే వేడిగా తాగాలి. అలా ఉండేలా కప్పు నింపుకుంటుంది.ఈ గొడవలో టీ కాస్తా చల్లారింది. ఆమె మనసు కుదురుగా లేదు. టీ వెచ్చపెట్టుకోవాలనిపించలేదు. ఓ నిమిషం సింక్‌లో పారబోసేద్దామా అనుకుంది. కానీ మనస్కరించలేదు. అలాగే కప్పు పట్టుకుని బెడ్ రూంలోకి వెళ్ళింది.ఒకే ఒక ఒంటరి మంచం. ఇంగ్లిష్ చేస్తే సింగిల్ కాట్. మూడు దిళ్ళు వెనకగానూ, రెండు పక్కన వేసి పెట్టాడు, జారబడి కూచునేందుకు రెడీగా. తాను పక్కనే ఉన్న ఊగే కుర్చీలో కూచున్నాడు ఆమె కోసం చూస్తూ.‘‘నువ్వు మంచం మీద కూర్చో, నేను ఇక్కడ కూచుంటాను’’ అంది కుర్చీ చూపించి.