ఆ మధ్యాహ్నం వేళబెలగాం చర్చి వీధి స్త్రీ భక్త సమాజంలో చామర్తి జగన్నాథాచార్యులు పురాణం చెబుతున్నారు. ఎదురుగా వ్యాసపీఠం మీద విరాటపర్వం ఉంది. అది దాదాపు ఆయనకు కంఠోపాఠమే అయినా, ‘‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్..’’అంటూ పుస్తకానికి మస్తకం వంచనిదే పురాణం చెప్పేవారు కాదాయన! దానికి ఓ పద్ధతి ఉందనేవారు.
‘‘పురాణం చెప్పడమంటే ప్రతిపదార్థ, తాత్పర్యాల వివరణ కాదు. పాండిత్యప్రదర్శన కాదు. భక్తి ఉట్టిపడాలి. అప్పుడే భగవంతుడు అక్కడ ఉంటాడు. తులసీదాసుగారు కాశీలో శ్రీరామచరిత మానస చదువుతుంటే హనుమ మారువేషంలో వచ్చి వినేవాడట...’’ అనేవారు ఆచార్యులుగారు. అందుకేనేమో ఆయన విరాటపర్వం చదివితే, ఉత్తర గోగ్రహణ ఘట్టంనాడు తప్పకుండా నేల తడుస్తుందని ఆ రోజుల్లో పార్వతీపురం చుట్టుపక్కల ప్రతీతి. ఓ దఫా ఆ ఘట్టం చదివినరోజు క్షోణీపాతాల వర్షంలో తడుస్తూ ఆచార్యులు రిక్షాలో ఇంటికి చేరుకున్నారట.ఆ మధ్యాహ్నం మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చర్చి వీధి స్త్రీ భక్త సమాజంలో వింటున్నవారు తలలూపుతున్నా వినిపిస్తున్న ఆచార్యులు మాత్రం కథలో లీనంకాలేకపోతున్నారు. తన గొంతుతనకే యాంత్రికంగా వినిపిస్తోంది. కథనం రక్తి కట్టటం లేదనిపిస్తోంది.
ఆయన మనసు మనసులోలేదు. విషయంమీద గురి కుదరటంలేదు. లోలోపల ఏదో బాధ. ఎటూ తేలని సంఘర్షణ. పిడుగుపడ్డ పర్వతం లాగా పిడికెడు గుండెలో పెద్దకుదుపు. ఆచార్యులకు ఎన్నడూ అలా అనిపించలేదు.ఒకప్పటి మాట... పురాణం చెప్పాలంటే ఆయన తర్వాతేనంటూ పార్వతీపురం తాలూకా మొత్తం పరవశించిపోయేది. జగన్నాథాచార్యులు భారతం చెబితే గీతాచార్యుడి విశ్వరూపం కళ్ళకు కట్టేదనేవారు. భాగవతం వివరిస్తుంటే భక్తి పారిజాతాలమాల కట్టినట్లుండేదని చెప్పుకునేవారు. రామాయణం చెప్పినప్పుడల్లా ఆయనలో ఓ గుహుణ్ణీ, ఓ శబరినీ చూశామనేవారు.