స్వంత ఊరు మీద మమకారం చంపుకోలేక ఉద్యోగ విరమణ చేశాక అక్కడే స్థిరపడాలనే ఉద్దేశ్యంతో స్వంత ఊళ్ళోనే చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఊరుకి దూరంగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో చేరి రెండువారాలైంది.ఇప్పటిదాకా ఎప్పుడు రిటైరవుతానా, ఆపైన అన్నీ సెలవులే కదా అనుకునేవాణ్ణి. కానీ ప్రస్తుతం కాలక్షేపం ఎలారా భగవంతుడా అనిపిస్తోంది.
రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి నడవడం అలవాటు చేసుకున్నాను. రోడ్డుప్రక్కగా ఓ యాభై గుడిసెలు, మధ్యలో అక్కడక్కడ పెంకుటిళ్ళు ఉన్న వాడ ఉంది. ఎప్పటిలానే ఉదయం రోడ్డుమీద నడుస్తూ ఉండగా ఆవాడలోనుంచి మంద్రస్థాయిలో త్యాగరాజ కీర్తన వినపడింది. పాట చెవులకి సోకుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ విరుపులు – సంగతులు వింటూ ఉంటే ఆరితేరిన సంగీత విద్వాంసుడు పాడినట్లే ఉంది. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీత పాఠాలు గుర్తుకువచ్చాయి. అలా ప్రతిరోజు పురందరదాసు, శ్యామశాస్త్రి, రామదాసు...ఎవరిదో ఒకరిది, ఏదో ఒక కీర్తన ఆ సమయంలో వినపడుతూనే ఉంది. మధ్యలో ఆ గొంతుతో మరోగొంతు జతకలుస్తూ ఉండేది.తెల్లవారు ఝామున అక్కడక్కడ వృక్షాల ఆకుల గలగలలు, పక్షుల కిలకిలా రావాలు, తూరుపు ఉదయగాలుల మధ్య మంద్రస్థాయిలో వీనులవిందుగా ఆ పాట వింటూ అలౌకిక ఆనందం పొందేవాణ్ణి.
అలా పదిహేనురోజులు గడిచాయి. రోజులు గడిచేకొద్దీ ఆ గాయకుణ్ణి చూడాలనే కోరిక బలపడసాగింది. ఆ వ్యక్తిని కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో, ఉదయం ఆ స్వరం వినిపించే ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. గుడిసెలమధ్య పెంకుటింట్లో నుంచి పాట వినపడుతూ ఉంది.గుమ్మం ముందు ఆగాను.తలుపు ఓరగా తెరచివుంది.‘‘లోపలికి రావచ్చా...’’ అడిగాను.లోపలివ్యక్తి పాడేపాట ఆపుచేసి, ‘‘నిరభ్యంతరంగా రావచ్చు’’ అన్నాడు. లోపలికి అడుగుపెట్టాను. గోడకు దగ్గరగా చేర్చివున్న నులకమంచంమీద ఒకవ్యక్తి కూర్చొని ఉన్నాడు. సుమారు అరవైసంవత్సరాలు పైనే ఉంటుంది వయసు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నవాడిలా ఉన్నాడు మొహం నిర్లిప్తంగా ఉంది. ఈ వ్యక్తేనా పాట పాడింది అనిపించింది.