‘‘సరితా!’’ వ్యాసమూర్తి కూతుర్ని పిలిచాడు.‘‘వస్తున్నాను నాన్న!’’ అంటూ వచ్చింది సరిత.‘‘అలసిపోయి వచ్చావు. కూర్చో’’‘‘కూర్చో అని చెప్పడానికా పిలిచారు? ఆఫీస్‌లో అలసిపోయేంత సీనేం లేదులే నాన్నా!’’ అంది సరిత నవ్వుతూ నిలుచునే.‘‘ఒక్క నిముషం కూర్చో తల్లీ!’’ అన్నాడు వ్యాసమూర్తి ప్రేమగా.
‘‘సరే! చెప్పండి’’ అంటూ తండ్రి ప్రక్కనే సోఫాలో కూర్చుంది సరిత.‘‘ఏంలేదూ.... అసలు నువ్వేమనుకుంటున్నావ్? నీ మనసులో ఏముందో చెప్పరా?’’ అన్నాడు వ్యాసమూర్తి.ఆశ్చర్యంగా చూసింది సరిత.‘‘ఏం విషయం నాన్నా?’’ అంది.‘‘ఎన్ని విషాలున్నాయి మనకు? మనకు సమస్యగానీ సమస్య ఒక్కటే. అదే నీ పెళ్ళి’’.‘‘కొత్తగా చెప్పేదేముంది? గత రెండేళ్ళుగా నడుస్తున్నదేగా?’’ అంది సరిత.‘‘సాఫ్ట్వేర్ వాడు వద్దంటావు. అమెరికా సంబంధం వద్దంటావు, పోనీ, నీ మనస్సులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లీ’’.‘‘ఉంటే తప్పకుండా చెబుతాను నాన్నా! కానీ, అటువంటి వెర్రిమెర్రి ఆలోచన్లు ఏమీ నాకు లేవు. ముందుముందు రావు. పెళ్ళికి ముందు ప్రేమలు మీద నాకు నమ్మకం లేదు. ఆకర్షణకు అందమైన పేరు ప్రేమ. నాన్సెన్స్. నాకిష్టం లేదు’’ అంది సరిత కాస్త చిరాగ్గా.
‘‘మరి ఎలాంటివాడు కావాలో.... ఏం ఉదోగ్యం చెయ్యాలో చెప్పరా!’’‘‘స్త్రీ అంటే గౌరవం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు, పెళ్ళాన్ని ప్రేమించేవాడు పోషించేవాడు, చెడు అలవాట్లు లేని సంస్కారవంతుడై ఉండాలి, వాడు ఆఫీసరే కానక్కరలేదు. అటెండర్ అయినా ఫర్వాలేదు’’.‘‘పెళ్ళిసంబంధాలు చూసే పేరిశాస్త్రి ఆదివారం వస్తానన్నాడు. ఎవరో కుర్రాడు హైదరాబాద్‌లో బ్యాంక్‌లో ఆఫీసరట. అబ్బాయి బాగుంటాడని చెప్పాడు’’ అన్నాడు వ్యాసమూర్తి. సరిత మొహంలో భావాలను చదవడాన్కి ప్రయత్నిస్తూ.
‘‘తగిలిన షాక్‌నుంచి మనం ఇంకా తేరుకోకముందే, అప్పుడే నా పెళ్ళి సంబంధాలు చూడటం అంత అర్జంట్ నాన్న?’’‘‘నీకు అర్జంటు లేదు తల్లీ! పెద్ద వాళ్ళమయ్యాము కదా! మాకు అర్జంటే’’ అన్నాడు.సరిత నిర్లిప్తంగా మాట్లాడలేదు.‘‘పెదనాన్నలు కూడా వస్తానన్నారు. నువ్వు ఊ అంటే ముందుకు వెళ్తాం’’.‘‘కాస్త నన్ను ఆలోచించుకోనీయండి నాన్నా!’’ అంది సరిత నిర్వికారంగా.గత అనుభవం సరితకు ఓ పీడకలలా ఉంది. మగవాళ్ళంతా ఇంతేనా అనిపిస్తుంది.‘‘నీ ఇష్టం తల్లీ! నువ్వేం నిర్ణయం తీసుకున్నా ఆలోచించే చేస్తావన్న నమ్మకం నాకుంది’’ అన్నాడు వ్యాసమూర్తి.