రెండు బస్సులు మారి, చున్నీతో, మొహానికి, మెడకి, పట్టిన చెమట తుడుచుకుంటూ హాస్పిటల్‌లో తండ్రి జగ్గన్న ఉన్న వార్డుకెళ్ళింది మాధవి.మాధవిని చూడగానే, అంతవరకూ మంచంమీద కూర్చుని, పక్కన బెడ్‌మీద పేషెంటుతో కబుర్లు చెబుతున్న జగ్గన్న లేచి నుంచున్నాడు.‘‘ఏవిటీ ఇంతాలీసం చేశావ్‌! పన్నెండు దాటుతోంది. కడుపు ఆకలితో మండిపోతోంది. గంటనుంచి నీకోసం చూస్తున్నా, ఎప్పటికీ రావాయె...ఇంతాలీసం అయిందేం?’’ అంటూ నిలదీస్తున్న తండ్రికి జవాబివ్వాలనిపించలేదు.

ఆలస్యానికి కారణాలు చాలా ఉన్నాయి.పొద్దున్నే లేవలేకపోయింది. తమ్ముళ్ళిద్దరూ స్కూలుకి తయారవుతూంటే, వాళ్ళకి తినడానికి ఏమీ లేదని గుర్తొచ్చింది. వెంటనే బయటికెళ్ళి, బన్నులు తీసుకొచ్చి, వాళ్ళకి పెట్టింది. వంట చేశాక, టిఫిన్‌ స్కూలుకి తెచ్చి ఇస్తానని చెప్పి పంపింది. మంచంపట్టిన తల్లి అవసరాలన్నీ తీర్చి, వంట మొదలుపెట్టబోతుంటే తమ్ముళ్ళిద్దరూ ఏడుస్తూ వచ్చారు. ఫీజు కట్టలేదని పంపించేశారని అంటే, స్కూలుకి వెళ్ళి, మేడమ్‌ని బతిమాలింది. ఎలాగైనా ఓ రెండు రోజుల్లో ఫీజు కడతాననీ, పిల్లల్ని, క్లాసులో కూచోనివ్వమనీ వేడుకుని, వాళ్ళని క్లాసులో కూర్చోబెట్టి ఇంటికొచ్చి వంట చేసింది.

ఒళ్ళు పచ్చి పుండులా ఉంది. ఒక్కొక్క పని చేస్తూంటే నొప్పి ఇంకా ఎక్కువవుతోంది. క్రోసిన్‌ వేసుకుంది. తగ్గలేదు అయినా ఇది మామూలు నొప్పా! మెట్ల మీద నుంచి దొర్లడంవల్ల వచ్చిననొప్పి! ఒక సారా, రెండుసార్లా! ఏకంగా నాలుగుసార్లు...ఐదోసారికి టేకు ఓ.కే. అయింది. నిజానికి ఆ హిందీ హీరోయిన్‌ మెట్లమీదనుంచి కింద పడిపోవాలి. హీరో, హీరోయిన్లు దెబ్బలాడుకుంటూ, అతగాడు ఆమెని తోసేస్తాడు. తోసేముందు ఆమె మొహంలో మార్పులు రావాలి. ఆ తర్వాత ఆమె పడుతున్నట్లుగా నటించాలి. ఆ తర్వాత ఆమె స్థానంలో డూప్‌...మాధవి మెట్లమీదనుంచి పడాలి.