‘మీ నాన్న నాలుగు రోజుల కంటే ఎక్కువ బతకరు..’ అని డాక్టర్ తేల్చేయడంతో ఆ కొడుక్కు కన్నీళ్లాగలేదు.. ఐసీయూలో బంధీలా ఉంచేకన్నా.. కుటుంబ సభ్యుల మధ్య... ప్రేమాభిమానాల మధ్య తండ్రిని ఆనందంగా సాగనంపడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు.. డాక్టర్‌కు చెప్పి ఐసీయూ నుంచి ఓ ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. ఆఖరి క్షణాల్లో.. మరణించబోయే ముందు కొడుక్కు ఓ కవర్‌ ఇచ్చాడా తండ్రి.. ఆ కవర్‌లో ఓ ఫొటోతోపాటు ఓ లేఖ కూడా ఉంది.. ఆ ఫొటోను చూసి.. ఆ లేఖను చదివిన ఆ కొడుక్కు...

************************* 

‘‘వెంటిలేటర్‌ పెట్టమంటారా!’’ మళ్ళీ అడుగుతున్నారు డాక్టర్‌.‘‘ఆయన పరిస్థితి చూశారుగా! మీకన్నీ చెప్పాను. నాలుగు రోజులు, అంతకంటే ఎక్కువ చెప్పలేను...’’వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు ఆగడం లేదు. సంభాళించుకుని డాక్టర్‌తో అన్నాను ‘‘ఈ వెంటిలేటర్‌ వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కదా’’.‘‘మీ నాన్న మొదట నా స్నేహితుడు. నీ కంటే నాకే ఎక్కువ. వెంటిలేటర్‌వల్ల ఇంకోరోజు మహా అయితే... కానీ...’’ చెప్తూ తనను తాను కంట్రోల్‌ చేసుకోడానికి ఆగారు డాక్టర్‌ వంశీ.

‘‘పర్లేదు డాక్టర్‌...ఎంత ఖర్చయినా పర్వాలేదు’’. నా భుజం తట్టి లోపలికెళ్ళారాయన.లివర్‌ కేన్సర్‌. రెండునెలలనుంచీ నాన్నహాస్పిటల్‌లో ఉన్నారు. సమస్యను గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. థర్ట్‌ స్టేజ్‌. పరిస్థితి చేయి దాటుతోంది.చివరిరోజులని డాక్టర్లు తేల్చి చెప్పారు.నాలుగురోజులనుంచీ నాన్న ఐ.సి.యులోనే ఉన్నారు. మధ్యమధ్యలో ఒక్కొక్కరిగా మాత్రమే కొంతసేపు లోపలికి వెళ్ళనిస్తున్నారు. మిగతా సమయం మేమంతా ఐ.సి.యు బయటే.నాన్నా ఒక్కడే ఒంటరిగా లోపల. నా చిన్నప్పుడు నాన్నను ఎప్పుడూ వదిలి ఉండలేదు.ఎవరన్నా సిబ్బంది బయటకు వస్తుంటే, ‘‘నాన్న ఎలా ఉన్నారు?’’ అనే మాట అడగడానికి అలవాటుపడిపోయా. ‘‘మీరేం భయపడొద్దు. డాక్టర్లున్నారుకదా, జాగ్రత్తగా చూస్తున్నారు’’ అది కూడా వాళ్ళనోటి వెంట అలవాటైన భరోసా.

************************

‘‘ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌ పెడితే, ఈ చివరి సమయంలో మీ నాన్న ఒక్కడినే ఒంటరిగా ఉంచాలి’’ అన్నారు డాక్టర్‌ వంశీ. ఈ మహానగరంలో సొంతగా హాస్పిటల్‌పెట్టి మంచి డాక్టర్‌గా పెద్దపేరు సంపాదించారు. నాన్నకు చిన్ననాటి స్నేహితుడు. ఆయన డాక్టరైతే, నాన్న రైతు. ఒకరు ఆరోగ్యదాత, మరొకరు అన్నదాత. వ్యవసాయం మీద ఎంతో గౌరవం ఉన్న వైద్యుడు డాక్టర్‌ వంశీ. నాన్నంటే అందుకే ఆయనకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే నాన్నను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారాయన.