ఇంట్లోంచి వెళ్లిపోయిందో వివాహిత.. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది.. కొద్ది రోజులకు ఇల్లు సర్దుతోంటే.. అలమారాల్లో పుస్తకాల్లో ఓ ఉత్తరం కనిపించింది.. ‘నాకు జీవితం మీద విరక్తి కలిగింది.. వృద్ధాశ్రమంలో చేరి వాళ్లకు సేవ చేసుకుంటూ ప్రశాంత జీవనం కొనసాగిస్తాను.. నా కోసం ఎవరూ వెతకవద్దు..’ అని ఆ ఉత్తరంలో రాసి పెట్టి ఉంది.. అయినా ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 ఏళ్ల తర్వాత.. ఆమె కనిపించింది.. అది కూడా మరో వ్యక్తికి భార్యగా.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

***************************

ఈ రోజు ఉదయం నుండి మనసంతా ఎందుకో చాలా చికాకుగా ఉంది.‘ఇది’ అని స్పష్టంగా చెప్పలేని విచిత్ర పరిస్థితి. ఆఫీస్‌కి వెళ్ళానేగానీ, పనిమీద శ్రద్ధపెట్టలేక పోయినాను. పర్మిషన్‌ తీసుకుని ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చాను. ‘కాఫీ తాగితే కాస్త ఫ్రెష్‌గా ఉంటుంది’ అనుకుంటూ, కాఫీ కలుపుకోవటానికి కిచెన్‌లోకి వెళ్ళాను. అదేసమయంలో గేటు చప్పుడైతే ఎవరు వచ్చారా అని బాల్కనీలోకి వచ్చి చూశాను. లలితగారు గేటు తీసుకొని లోపలికి వస్తున్నారు. లలితగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. రెండు వీథుల అవతల వాళ్ళ ఇల్లు.

 

‘‘రండి, రండి!‌’’ అని లోపలికి ఆహ్వానించాను.‘‘బాగున్నారా! ఇప్పుడే ఆఫీసు నుంచి వచ్చినట్లున్నారు. ఇప్పుడు నేను రావటం మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా!’’ అంటూ సోఫాలో కూర్చున్నారు.‘‘అయ్యో! అదేం మాట! భలేవారు. అసలు మీరు రావటమే అరుదు. చెప్పండి. ఎలా ఉన్నారు? అమ్మగారు, నాన్నగారు బాగున్నారా?’’ అని అడిగాను.‘‘ఆఁ అందరూ బాగున్నారు. అమ్మకూడా రోజు మీ గురించి అడుగుతున్నారు. మీరు మా ఇంటికి వచ్చి పదిరోజులు దాటింది కదా! అమ్మ మిమ్మల్ని ఒకటే కలవరిస్తున్నది. ఆఫీసు పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నారేమోలేమ్మా, నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాలే, అని ఇటు వచ్చాను’’ అన్నారు లలితగారు.‘‘ఉండండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం’’ అని కిచెన్‌లోకి వెళ్ళాను.

‘‘కంగారేం లేదులెండి! కాసేపు కూచుంటాను. మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి’’ అన్నారు లలితగారు.కాఫీ కలుపుతూ ఆమె గురించే ఆలోచించడం మొదలుపెట్టాను. ‘సాధారణంగా ఆవిడ ఈ సమయంలో రారు. లలితగారికి ఎన్నో బాధ్యతలు. ఊపిరి సలపనంత పనిఒత్తిడి. దానికి కారణం తన సంసార బాధ్యతలేకాక, కొడుకులులేని ఆమె తల్లితండ్రుల్ని కూడా ఆవిడే బాధ్యతగా చూసుకుంటోంది. వారు కూడా లలితగారి ఇంటి ప్రక్కనే ఉంటారు. తీరికగా కబుర్లుచెప్పే సమయం ఆమెకు ఉండదు. అలాంటి మనిషి ఈ సమయంలో ఎందుకొచ్చారు? ఏమై ఉంటుంది? ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది’.