మిలానో కాఫీహౌ‍స్‌. ఓమూల టేబుల్‌వెనుక కుషన్‌చైర్లో చేరగిలబడి మౌనంగా కూర్చునుందామె. ఎదురుగా కప్పులో ఆమెకిష్టమైన కెఫేలాటే. చాలాసేపటిగా పట్టించుకోకుండా ఉండిపోయింది. బహుశా ఆ కాఫీ చల్లారిపోయి చురుకుదనం కలిగించే లక్షణం కోల్పోయి చిక్కబడిపోతోంది.

ఆమె మౌనంగా కిటికీ అద్దాల్లోంచి చూస్తోంది. బయట జనం లెక్కకుమిక్కిలిగా, ఎవరి హడావిడిలో వాళ్ళు, నెట్టుకుంటూ, విసురుకుంటూ, ఎవరో సైంటిస్ట్‌ సెట్‌ చేసిన రోబోల్లా కదలిపోతున్నారు.ఎదురుగా చౌరాస్తా. అప్పుడే గ్రీన్‌సిగ్నల్‌ పడింది. సహనానికి పరీక్షపెడుతూ అప్పటివరకు నిలబడిఉన్న వాహనాలు ఒక్కసారిగా, అవాంతరానికి చెల్లాచెదురైన చీమలగుంపుల్లా పరుగులు తీస్తున్నాయి.పైన మొగులుమీద మబ్బులు గుమిగూడుతున్నాయి. చంకలోపిల్లాడు అరచేతులతో తల్లిముఖం నిమిరినట్టు, అంతవరకు తెల్లతెల్లగా తారట్లాడిన మేఘాలు అకస్మాత్తుగా తీరు మార్చుకున్నాయి. కడుపులో గుట్టుదాచుకుని మంతనాలు జరుపుతున్నట్టు నీలిరంగులో చిక్కబడుతున్నాయి.

ఉన్నట్టుండి చల్లటిగాలి మొదలైంది. వెంటనే కాకపోయినా వానపడటం ఖాయం అనుకుంది ప్రియాంక. అసహనంగా కుర్చీలో కొద్దిగా కదిలి సర్దుకుని కూర్చుంది.‘‘అతడు త్వరగా వస్తే బాగుండును’’ అనుకుంది మరోసారి.దాదాపు రెండేళ్లుగా కనుమరుగైన ముఖం. గతంలో తానెంతో ఇష్టంగా చూడాలనుకునే ముఖం. అతికష్టంమీద మరచిపోవాలనుకుంటున్న ముఖం. ఇప్పుడిలా హఠాత్తుగా తెరమీదకు. ఎందుకోసం? దేన్ని ఆశించి? ఇంకా తమ మధ్య ఏం మిగిలివుందని?ఫోన్‌ చేశాడు వస్తున్నట్టు. తనను కలుసుకోవాలన్నాడు.

కుదరదని చెప్పాలనుకుందిగానీ ఏదో జారవిడుచుకుని వెతుక్కుంటున్న వాడిలా అతని గొంతు ఆమెను ప్రాధేయపడింది.ఏమిటది? పశ్చాత్తాపమా? పట్టువిడుపా? అతనిలో మార్పువచ్చిందా? అది చెప్పేందుకే వస్తున్నాడా? తను నమ్మగలదా?అతడట్లా రావడం ఆమెకిష్టంలేదు. నిజానికి అతన్ని కలుసుకునేందుకుకూడా ఆమె రావాలనుకోలేదు. అతన్ని మళ్ళీ చూడాలనుకోలేదు. కానీ వచ్చింది. ఎందుకొచ్చిందో, ఎట్లా రావాలనిపించిందో తెలియదు.