సాయంత్రం ఐదుగంటల సమయం.‘శ్యామలాంబ నగరపాలక సంస్థ పార్కు’లో అడుగుపెట్టిన పెళ్లికాని జంట జైరాజ్‌-శైలజ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ‘ఇంట్లో చెప్పేవచ్చారా?’ అన్న కేక ఎటువైపునుంచి వచ్చిందా అని చూస్తే గేటు పక్కన చెక్క కాబిన్‌లో కౌబాయ్‌ డ్రెస్‌లో ఉన్న ఓ మధ్య వయస్కుడి స్వరం అది.ఇద్దరి చేతులు విడిపోయాయి. కొంచెం ఎడంగా నిలబడి అతనివంక ప్రశ్నార్థకంగా చూసారు. ‘అదేం ప్రశ్న’ అన్నట్టు. ఎవరన్నా కారుకి అడ్డం పడి యాక్సిడెంట్‌ తప్పించుకుంటే డ్రైవర్‌ మండి పడతాడు. ‘ఇంట్లో చెప్పే వచ్చారా?’ అని. అలావుంది అతని ధోరణి.

అతను జీన్‌పాంటుమీద టైట్‌ టీ షర్టు నెత్తిన కాప్‌తో పాత కుర్చీలో ఏటవాలుగా నిర్లక్ష్యంగా కూర్చుని కళ్లు ఎగరేసారు... ‘మాట్లాడరేం’ అని కాబోలు. యూనిఫాం లేదు గాబట్టి అతను సెక్యూరిటీ గార్డు కాదు. పార్కులకి గార్డులుండరు తోటమాలి తప్ప. తోటమాలి అంటే నీరు కావి పంచె... చిరుగుల చొక్కా మాసిన గడ్డంతో గడ్డి పీక్కుంటూ ‘ఎందుకొచ్చిన జీవితంరా బాబూ’ అని నిరాశగా కనిపించాలి. కానీ అతను ‘గార్డెన్‌ ఫ్రెష్‌’గా ఉన్నాడు.మేకపోతు గాంభీర్యం వదలి కాప్‌ తీసి కొక్కేనికి తగిలించి నిటారుగా నిలబడి జంట ముందుకొచ్చాడు... చిరునవ్వుతో.‘‘ఏమిటిబాబూ... ఏం తల్లీ... మీరిద్దరూ మా పార్కుకి రావడం మొదటిసారి గాబట్టి ప్రశ్నించాల్సి వచ్చింది’’ అన్నాడు. వాళ్లిద్దరూ తేరుకున్నారు.మెల్లగా రిలాక్స్‌ అయ్యారు.‘‘బైది బై. నా పేరు లోవరాజు. గార్డెనర్‌ని.... మీరూ...’’ లోవరాజుకి నలభై అయిదేళ్ళుంటాయి. కొద్దో గొప్పో చదువుకున్నవాడు.

పార్కు తన సొంతంలా ప్రైవేట్‌ ఓనర్‌లా మాట్లాడతాడు.జైరాజ్‌ ‘‘మేం ఎన్నో పార్కులు తిరిగాం. నగరంలో ఉన్న ఈపార్కు మిస్సయ్యాం. ఇది కూడా చూడాలని వస్తే నీ స్వాగత సత్కారం బాగుంది. భయపడి చచ్చాం కదయ్యా’’ అన్నాడు ఊపిరి పీల్చుకుని. ఆమె కూడా తేలిగ్గా నిట్టూర్చింది.లోవరాజు ‘‘ఎందుకు భయం? నేను నిగ్గదీసానా?’’ ఊరికే ప్రశ్నించాను.‘‘మీరెవరని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు’’ అన్నాడు.,లోవరాజు వట్టి తోటమాలి అనుకుంటే పొరబాటు. మొక్కల్ని పెంచడంతోబాటు... సందర్శకుల్ని ముఖ్యంగా యువతీ యువకుల్ని అందులో పెళ్లికాని జంటల్ని ఓ కంట కనిపెడుతుంటాడు. ఇలా స్ర్కీనింగ్‌ చేస్తుంటాడు. ఎక్స్‌ట్రార్డినరీ డ్యూటీ చేస్తున్నట్టు కనిపిస్తాడు.