బెంగళూరు విమానాశ్రయంలో బాంబే విమానం కోసం నిరీక్షణ. గడచిన సంవత్సరం ఇదే చోట జనం. పండగరోజుల్లో బస్సుస్టేషన్‌ కన్న రద్దీ. కుర్చీలు ఖాళీ లేక మెట్లమీద కూర్చొన్నారు. ఇప్పుడు? పలచగా ఉన్నారు. అయినా మనిషి మనిషిని పోలిక పట్టలేని స్థితి. ముఖాలకి మాస్కులు దానిమీద షీల్డూ. గ్రహాంతరవాసుల్లా ఉన్నారు. చికాకు చికాకుగా ఉంది. విమానం ఎక్కేకైనా ఇవి తీయనిస్తారో లేదో.. భయం.. భయం.. జబ్బు భయం కన్న శాసన భయం. నువ్వు చస్తే పోయిందేంలేదు.. నీవల్ల మరొకరు చావకూడదు.. నైతికసూక్తులు.

‘‘సర్‌..’’ ఆలోచనలను చెదిరిస్తూ ఎవరిదో స్వరం.. రెండు చేతులూ జోడించి నమస్కారం. కళ్లు తెరిచాడు మూర్తి. పక్కసీటులో ఉన్నాయన. తననే అని స్పష్టం చేసుకున్నాక - పరకాయించి చూశాడు. మామూలుగానే మనుషులు గుర్తుండి చచ్చే వయసు కాదు.. ఇహ.. ఈ ముసుగులొకటి.. ఇవుండగానే గుర్తు పట్టాడంటే ఎవడో దగ్గరాడే అయుంటాడు. ఎవడబ్బా? అనుకుంటూ -ప్రతి నమస్కారం చేశాడు. ‘‘గుర్తు పట్టలేదుకదా మూర్తీ సాబ్‌’’ హిందీలో అంటూ తన ముసుగు షీల్డ్‌ లాగి ముఖం చూపించాడు. రవి వసిల్కర్‌.. మరాటీ. ఎక్కడా స్ట్రయిక్‌ అవలేదు. ‘‘నేనూ..’’ సాగదీశాడు తన పేరుచెప్పటానికి. ‘‘మీరు .. కైవల్యమూర్తి.. మీ టికెట్‌ మీద చూశాను. మనం కలిసినపుడు మీరు జోక్‌ చేశారు. ‘రవీ! ఎనీబడీ కెన్‌ ఫర్గెట్‌ మి బట్‌ నాట్‌ మై నేమ్‌’ మూర్తిగారూ’’ గారూ హిందీ యాసలో చేర్చాడు. గుర్తు చేస్తుంటే గుర్తొస్తోంది. పాతికేళ్ల క్రితం.. ఉద్యోగం చేసే రోజుల్లో.. సునందిని హఠాత్తుగా గుర్తు.

స్టేషన్లో దిగేసరికి కంపార్టుమెంట్‌ దగ్గర కాసుకుని ఉన్నాడు రవి. ఇన్‌స్పెక్షన్‌కి వచ్చిన తనను ఫ్యాక్టరీకి తీసుకుపోటానికి వచ్చాడు. ‘‘మీరు రావద్దన్నానే’’ కాస్త కరకుగా అన్నాడు. చేతిలో బ్యాగ్‌ అందుకోబోతుంటే ఇవ్వలేదు. విసురుగా బైటకి వచ్చేసరికి ఎక్కడా ఒక్క టాక్సీ కూడాలేదు. అక్కడ దిగిన వాళ్లు ఒకరిద్దరే. మధ్యాహ్నం పన్నెండు. ఎండ. ‘‘సర్‌.. ఇక్కడ మా ఫ్యాక్టరీ వాళ్లే దిగుతారు. స్థానికులు ముందే వెహికల్‌ ఏర్పాటు చేసుకుంటారు. ఇదో అడవి’’ అంటూ చేతిలోని నీళ్ల సీసా అందించాడు. తటపటాయించి.. జేబులోంచి డబ్బు తీసి రవి చేతిలో పెట్టబోయాడు. ‘నో సర్‌ మీరు మా కస్టమర్‌’ అంటుంటే.. ‘‘నేను లంచం తీసుకోను’’ అన్నాడు తను. ఇచ్చిన డబ్బు రవి కోటు జేబులో పెట్టు కున్నాకనే సీసా తీసుకున్నాడు. గడగడాతాగేడు. ‘‘నాకు టిఏ, డిఏ గవర్నమెంటు ఇస్తుంది. నేను కంపెనీ కారు ఎక్కను. నా దగ్గర డబ్బులు తీసుకుంటేనే..’’ అని ఖరాఖండీగా చెప్పాడు. రవి ‘‘మీ ప్రిన్సిపుల్స్‌ నాకు తెలుసు.

మీ యిష్టం.. సార్‌’’ అంటూ ఒడంబడటంతో కారు ఎక్కాడు. కదిలింది. దాదాపు రెండు గంటల ప్రయాణం. కారు కి.మీ. రీడింగ్‌ నోట్‌ చేసుకున్నాడు. లోపల కూర్చున్నాక చల్లదనానికి ప్రాణం తెరిపిన పడ్డట్టయింది. రవి పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌. మరాటీ. కర్నాటకలోని మారుమూల ప్రాంతంలో ఉంది కర్మాగారం. రవి డ్రైవరు పక్క సీటులో కూర్చోవటం తనకి తృప్తి కలిగించింది. రవి వెనక్కి తిరిగి మాట్లాడుతున్నపుడు తన పక్కకి రమ్మందామా అనిపించింది - అనలేదు. రవి మాటల్లోకి దించగలిగాడు. మాటాడితే తను అతనికిలొంగినట్టు అవుతుందేమోనన్న బిగింపు కాస్త సడలింది. తెలుగు సాహిత్యం గురించి కబుర్లు. శ్రీశ్రీ, చలం ప్రపంచంలోనే గొప్పవారన్నాడు. అదో మత్తు కలిగించింది. తనకి వారి లైంగిక నీతి పట్ల కాస్త క్రిటికల్‌ ఆలోచనలు ఉన్నాయి. ఒక పరాయి భాషస్తుని ముందు అవి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ మత్తు దిగాక ఒక ప్రశ్న కలిగింది. తను కవిత్వం గిలుకుతాననితెలుసా?