ఏలియన్ అంటే పరాయి గ్రహం నుండి వచ్చిన జీవి కాదు. అది అతని ఫేస్‌బుక్ అకౌంట్ పేరు. అసలు పేరు ఏడుకొండల లక్ష్మీనారాయణ. ఇంటిపేరులోని ‘ఏ’, లక్ష్మీలోని ‘ఎల్’, నారాయణ నుండి ‘ఎన్’ తీసుకొని ‘ఏలియన్’ అని పెట్టుకున్నాడు. అలా .. సోషల్ మీడియాలో ‘ఏలియన్’గా పరిచయమయ్యాడు.
పాతికేళ్ల వయసు. పాతికవేల పైనే జీతం. లైఫ్ సాదా సీదాగా గడుస్తూనే ఉంది. అయితే, చాలామందికి ఉన్నట్టే ఏలియన్‌కీ ఓ జబ్బుంది. అదే సోషల్ మీడియా అడిక్షన్.ఒక్క క్షణం ఖాళీగా ఉండడు. నిద్రలేస్తూనే సెల్ చేతిలోకి తీసుకొని, రాత్రి పెట్టిన పోస్టుకి ఎన్ని లైకులొచ్చాయో, ఎన్ని కామెంట్లు వచ్చాయో లెక్క చూసుకున్న తరువాతే ఏ పనైనా మొదలెడతాడు. తెలిసిన వాళ్లకీ, తెలియని వాళ్లకీ గుడ్‌మార్నింగ్ మెసేజ్‌లు పంపడంతో ఏలియన్ దినచర్య మొదలవుతుంది.రావణకాష్ఠంలా ఫేస్‌బుక్, వాట్సాప్ నిరంతరం ఆన్‌లో ఉండాల్సిందే. ఆఫీసుకు వెళ్లగానే డాటా ఆఫ్ చేసి, ఆఫీసు వైఫైని కనెక్ట్ చేసి పెట్టుకుంటాడు. ఏ లైకు నోటిఫికేషన్ సౌండో వినపడిందా .. ఆ లైక్ కొట్టింది ఎవరో చూసుకునే వరకు వేరే పని చెయ్యడు.ఇదంతా గమనించిన బాస్ ఓ రోజు గట్టిగా క్లాస్ పీకాడు. దాంతో ఏలియన్‌కి కోపమొచ్చింది.
అతడ్ని తన ఫ్రెండ్స్ లిస్ట్ నుండి అన్‌ఫ్రెండ్ చేసి ప్రశాంతంగా ఫీలయ్యాడు.ఇక వీకెండ్ డేస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనువూ, మనసూ పూర్తిగా కేంద్రీకరించి, మరింత భక్తి శ్రద్ధలలో సోషల్ మీడియాలోనే మునిగిపోతాడు. ఇంట్లోవాళ్లు ‘వీడికి సెలవెందుకు వచ్చిందిరా దేవుడా’ అని తల బాదుకుంటారు.ఒక్కోసారి తన పోస్టుకు రావాల్సినన్ని లైకులు, కామెంట్లు రాకపోతే, ఒక్కొక్కరికీ వరసగా ఫోన్ చేసి ‘‘ఒక కామెంట్ పెట్టొచ్చుగా, కనీసం లైక్ కొట్టుచ్చుగా .. ప్లీజ్ .. ప్లీజ్ ..’’ అని దేబిరిస్తాడు.పొద్దున్నే నిద్రలేస్తూ ఒక సెల్ఫీ, బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఒకటి, టీ తాగుతూ ఒకటి, ఆఫీసులో ఒకటి, ఆఫీసు నుంచి వస్తూ ఒకటి - రోజుకు పదుల సంఖ్యలో పిచ్చపిచ్చగా ఫోటోలు దిగి, ఫేస్‌బుక్‌లో పెట్టే వరకు నిద్రపోడు. బర్త్ డే వస్తే చెప్పాల్సిన పనేలేదు. తన ఫోటోల్లో అందమైన పాత ఫోటో ఒకటి తీసి, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి, ‘‘ఫెండ్స్ .. ఇవాళే నేను ఈ భూమి మీదికొచ్చిన రోజు, ఆశీర్వదించండి’’ అని బతిమిలాడుకుంటాడు.