నలుగురులోనూ భిన్నంగా ఉంటూ, ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే, ‘వీడికి వేపకాయంత వెర్రి ఉంది’ అంటారు. కానీ నాకున్నది వేపకాయంత కాదు, పుచ్చకాయంత వెర్రి! ఎంత వెర్రి కాకపోతే చిన్నప్పుడు చందమామ కథల పుస్తకాల్లో చదివిన, ‘అనగనగా ఓ రాజుగారు..ఆయనగారికి ఏడుగురు కొడుకులు, ఆ రాజుగారు కొడుకుల కోసం ఏడు రాజ్యాలు జయించి వాటితోపాటు ఏడుగురు రాజకుమార్తెలను తెచ్చి కొడుకులకిచ్చాడు...’ లాంటి కథలు చదివీ, చదివీ, నాక్కూడా ఏడుగురు పిల్లలు కావాలి, వాళ్ళకి వెయ్యేసి ఎకరాల్లో బ్రహ్మాండమైన ఏడుకోటలు కట్టించివ్వాలి అని పగటి కలలు కంటాను!!

పగటి కలలు కనడం అంటే, బతకడం చేతకానివాడి వెర్రితనం కావచ్చునేమోగానీ, పగటి కలలు కనడంలో మాత్రం ఒక గొప్ప ఆనందమూ, ఓ సౌలభ్యమూ ఉన్నాయి. అవేమిటంటే...పగటి కలలు కనడానికి పైసా ఖర్చు లేదు. ఎవరి అనుమతీ అవసరం లేదు. దరిద్ర జీవితం ప్రసాదించే అష్టకష్టాలూ దుఃఖాన్ని కాసేపైనా మరచిపోయి, మనకు నచ్చినవిధంగా ఊహాస్వర్గంలో ఆనందంగా విహరించడానికి ఏమీ కష్టపడనవసరం లేదు. అందుకే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరే ప్రయత్నం చేసినట్టు నాలాంటి బడుగుజీవి కాస్తో కూస్తో సంతోషంగా బతకడానికి పగటి కలలు కనడంకన్నా మరేం చేయగలడు. నాలాంటివాడికి పగటి కలలు హుషారునిచ్చే టానిక్‌. అందుకనే నా పగటి కలల ఊహాప్రపంచంలో నేనొక మహారాజుగారిని! పుట్టుకతోనే నాకు నెత్తిన కిరీటాలూ, ఒంటి మీద మెరిసే సిల్కు వస్త్రాలతో పుట్టిన నలుగురు కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళూ వెరసి ఏడుగురు సంతానం.

నలుగురు కొడుకులు ఎందుకంటే నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిన నలుగురు మహానుభావుల పేర్లు పెట్టుకోడానికి! యువరాజైన నా పెద్ద కొడుకు పేరేమిటో తెలుసా? శిల్ప చిత్రకళారంగాల్లోనే కాక, అనాటమీ, ఇంజనీరింగ్‌, వైజ్ఞానిక రంగాల్లోనూ, మరెన్నెన్నో విషయాల్లోనూ మధ్యయుగాల్లోనే కాక నేటికీ బహుముఖ ప్రజ్ఞావంతుడుగా, అఖండమేధావిగా పేరుగన్న లియోనార్డో డావిన్సి! సృజనాత్మక శిల్ప–చిత్రకళలంటే పడిచచ్చే నాకు ఆ రంగాల్లో అత్యంత ప్రసిద్ధులైన రాఫేల్‌, మైకెల్‌ ఏంజిలోలతోపాటు, నాకెంతో స్ఫూర్తినిచ్చిన గొప్ప భారతీయ చరిత్ర పరిశోధకుడూ, బహుభాషా పండితుడూ, మేధావీ, రచయితా అయిన ఓ పెద్దాయన పేరు మిగిలిన ముగ్గురు కొడుకులకీ పెట్టుకోవాలని ఆశ.