స్నేహితుడి ప్రతిపాదన అతడికి నచ్చలేదు. ఛీ..దీన్ని కూడా వదిలిపెట్టవా? అని మొదట వ్యతిరేకించాడు. ఆవేదన చెందాడు. కానీ ఆ వెంచర్ పూర్తయ్యేసరికి జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి అతడు విస్తుపోయాడు. జనం కోరికలు విని నోరెళ్ళబెట్టాడు. స్నేహితుడి వ్యాపారదృష్టికి ఆశ్చర్యపోయాడు. తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఇంతకీ ఆ స్నేహితుడు చేసిందేమిటి? ఇతడు అనుకున్నదేమిటి?
పదోతరగతి చదువుతున్న మా అమ్మాయి అన్వయికి సాహిత్యంమీద ఆసక్తి ఎక్కువ. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్‌లో వచ్చే పత్రికల్ని కూడా వదలకుండా చదువుతుంది. ఆదివారం ఉదయం అల్పాహారం తిన్నాక దినపత్రికలో మునిగిపోయి ఉన్న సమయంలో అన్వయి ‘‘నాన్నా... ఈ వాక్యానికి అర్థం చెప్పరా?’’ అంటూ వచ్చింది.పేపర్లోంచి తలెత్తి ‘‘ఏంటి తల్లీ అది?’’ అని అడిగాను.‘‘డెత్ ఈజ్ ద గ్రేట్ ఈక్వలైజర్ అంటే ఏమిటి నాన్నా?’’ అని అడిగింది.అంత చిన్నపిల్లకు మరణం గురించి చెప్పాలా, వద్దా? అని కొన్ని క్షణాలు ఆలోచించి, చెప్పడానికే నిర్ణయించుకున్నాను. ‘‘కటిక దరిద్రుడైనా, కోట్లకు పడగలెత్తిన కుబేరుడైనా మృత్యువు తన శీతలహస్తాలతో ఆలింగనం చేసుకోవటంలో ఎటువంటి భేదభావం చూపించదు తల్లీ. ఎవ్వరికైనా చావు అనివార్యం. అందుకే మృత్యుదేవతని ఈక్వలైజర్ అంటారు. దాన్ని మించిన సమతావాది ఎక్కడా ఉండరు.
అంతేకాదు. దానికి కొనసాగింపుగా నేనో విషయం చెప్తాను. ఎవ్వరైనా సరే మరణించాక మట్టిలో కలిసిపోవాల్సిందే. అక్కడా బీదా, గొప్పా తేడాలు ఉండవు.’’అన్వయి అర్థం కాలేదన్నట్టు మొహం బ్లాంక్‌గా పెట్టింది. నాలుగేళ్ళక్రితం చనిపోయిన మా నాన్నగురించి చెప్తే తనకు బాగా అర్థమౌతుందని ‘‘నీకు తాతగారు గుర్తున్నారుగా’’ అన్నాను.‘‘నాకు తాతగారంటే చాలా ఇష్టంకదా నాన్నా... ఆయన్నెలా మర్చిపోతాను?’’ అంది. నాన్నకు అన్వయి అంటే ప్రాణం. దానిమీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. బాగా ముద్దు చేసేవాడు. చిన్నపిల్లాడికి మల్లే మారిపోయి దాంతోపాటు ఆటలాడేవాడు.
నాన్న చనిపోయినప్పుడు అన్వయిని సముదాయించడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఆయన ప్రస్తావన రాగానే దాని కళ్ళల్లో తడి మెరిసింది.‘‘తాతగారు వ్యవసాయకూలీగా పనిచేస్తూ నన్ను చదివించారన్న విషయం నీకు తెల్సుకదా. నా ఆర్థిక స్థాయి కూడా అంతంతమాత్రమే. ఓ చిన్నసంస్థలో చిరుద్యోగిని. నీకు నా స్నేహితుడు వినాయక్ గురించి చెప్పాగా. అమెరికాలో పదిహేనేళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి రెండేళ్ళక్రితం ఈ ఊరొచ్చి బిజినెస్‌లోకి దిగాడు. వాడు పుట్టుకతో ధనవంతుడు. వాళ్ళనాన్న పొగాకు వ్యాపారంలో లక్షలు సంపాయించాడు’’