‘నాయనా! రమేష్‌ మధ్యాహ్నం మన ఊరి నుండి రమణాచారిగారు ఫోను చేసారు. పెదనాన్నకి పక్షవాతం వచ్చి కాలూ చెయ్యి పడిపోయిందట’ ఆఫీసు నుండి వచ్చిన కొడుకు రమేష్‌తో బాధగా చెప్పాడు శంకరం.‘ఏంటి పక్షవాతమా!’ సోఫాలో కూర్చుని కాలిబూట్లు విప్పుకుంటూ చాలా క్యాజువల్‌గా అన్నాడు రమేష్‌.

‘ఆ పక్షవాతమేనట. ఏమిటోరా ఈ మధ్యన మీ పెదనాన్న కుటుంబానికి ఏదో శని పట్టినట్లుంది. ముందర మీ దొడ్డమ్మ పోయింది. ఆ తర్వాత ఆరు నెలలకే నీ తోటి వాడైన కృష్ణ వాడి భార్య స్కూటరు ఏక్సిడెంటులో పోయారు. అదిగో అప్పటినుండే పెదనాన్న ఆరోగ్యం కూడా దెబ్బ తినేసింది. అవునులే కళ్ళముందే కట్టుకున్న భార్య, చెట్టంత కొడుకు పోతే ఎవరు మాత్రం తట్టుకో గలరు’ అని అన్నాడు శంకరం.‘అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటారు. పెదనాన్న వైద్యానికి డబ్బులు పంపుతాను అంటారు. అవునా?’ తండ్రి ఔదార్యం తెలిసిన రమేష్‌ ఎంతో వ్యంగ్యంగా అన్నాడు.‘అదేంటిరా అలా మాట్లాడుతున్నావు. మనం ఏదో కాస్త డబ్బు పంపినంత మాత్రాన వాడికొచ్చిన కష్టం తీరుతుందా?’‘తీరనప్పుడు మరి రమణాచారిగారితో ఫోను ఎందుకు చేయించినట్లు?’‘ఎందుకేమిటిరా, కష్టం వచ్చినప్పుడు అయినవారికి కాక ఇంకెవరికి చెప్పుకుంటారు?’ఇంతదూరంలో ఉన్న మనకి చెప్పి మాత్రం ఏం ప్రయోజనం.

అయినా మొన్ననే కదా పద్మక్క పురిటికి వచ్చిందని పెదనాన్న ఫోను చేస్తే మాకు తెలియకుండా అమ్మగాజులు మా ఫ్రెండు దగ్గర తాకట్టుపెట్టి మరీ వాళ్ళకు డబ్బులు పంపించారు. మీరేమో మాకేమీ తెలియ వనుకున్నారు. కానీ మా ఫ్రెండు నాకు అన్ని విషయాలు పూర్తిగా చెప్పాడు. ఇలా చెయ్యడం మీకేమైన బాగుందా? వాడు నా గురించి ఏమనుకుంటాడో ఏనాడైనా ఆలోచించారా?’ అయినా ఇప్పుడు వాళ్ళకు అమ్మ గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు నెలలోనే కదా ఆంధ్రాలో వరదలు వచ్చి పంట మొత్తం పాడైపోయిదంటే లక్ష రూపాయలు పంపించాను. అయినా ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా?’ ఎంతో వ్యంగ్యంగా అన్నాడు రమేష్‌.