‘‘అయ్యా! చూసుకోనొచ్చానయ్యా! ఎర్రగా బుర్రగా బలెగుంది.’’ వీధి వసారాలో ఒంటరిగా కూర్చున్న పీతాంబరంతో చెప్పాడు సిమ్మయ్య.‘‘ముహూర్తం ఎప్పుడు పెట్టావంట? వస్తుందా... నే వెళ్ళాలా? పర్వాలేదా?’’ పళ్ళలో పుల్లతో కెలుక్కుంటూ అడిగాడు.‘‘తమరేం వెల్లక్కర్లేదు. ఇయాలే దాన్ని పన్లో ఎడతాను. అయినా మీకెదురేంటి? ఎందర్ని సూడ్నేదు. దీన్ని వాడుకోడవే!’’ తతిమ్మా ఏర్పాట్లు చూడ్డానికి వెళ్తున్నట్లు చెప్పి పిట్టని తేవడానికి బయటకెళ్ళాడు సిమ్మయ్య.
అదే సమయంలో లోపలినుండి మూడేళ్ళ బుడతడు ‘‘తాతా!’’ అంటూ పీతాంబరం ఒళ్ళోకి వచ్చి మెడ చుట్టేసాడు.‘‘ఏంటి కావాలి? బుజ్జికొండా. చాక్లెట్లా? బిస్కత్తులా?’’ మనవడు శౌర్యను గుండెలకు హత్తుకుంటూ అడిగాడు పీతాంబరం. ‘‘లాలీపాప్...’’ ముద్దుగా చెప్పి మరింత కరుచుకుపోయాడు.ఇంట్లోంచి గబగబ వచ్చిన అపర్ణ ‘‘నాన్నా! మీరు వాడికి చాక్లెట్లు, బిస్కట్లు తినిపించద్దంటే వినరు కదా! పళ్ళు పాడైపోతాయి. మరో నెలరోజుల్లో మీ మనవడిని బళ్ళో వేసేస్తే కుదురు వస్తుంది. ఆటల మీద ధ్యాస తగ్గుతుంది.’’ అని పిల్లాడి దగ్గరున్న లాలీపాప్ లాక్కుని జామకాయ ముక్క చేతిలో పెట్టింది.‘‘ఈ కసుగాయని అప్పుడే చదువు పేరుతో కష్టాలపాలు చేస్తావా తల్లీ! మరో రెండేళ్ళాగితే నేనే వాడిని ఖరీదైన స్కూల్లో వేస్తా! నా డబ్బు ఎవరు తినాలి కనుక? నా తదనంతరం మీకే కదా!’’ దర్పంగా పలికాడు పీతాంబరం.
పీతాంబరానికి ఒక్కతే కూతురు. అపర్ణను ఇంజనీరు విక్రమ్‌కిచ్చి చేశాడు. ఒకేబిడ్డ వాళ్ళకి. ముద్దులు మూటలుగట్టే మనవడు శౌర్యంటే అంతులేని ప్రేమ అభిమానమూనూ... వాడే అతనికి అన్నీను. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు రెండు నెలలకోసారి పల్లెటూర్లో ఉన్న పీతాంబరం దగ్గరకొచ్చి నాల్రోజుల పాటుంటారు. ఈసారి మాత్రం అల్లుడు విక్రమ్ ప్రాజెక్టు చేయడానికి కంపెనీ పనిమీద దూరంగా వెళ్ళడంతో ఇరవైరోజులై ఇక్కడే ఉన్నారు.శౌర్య వీపు మీదెక్కి ఏనుగాట ఆడుతున్నాడు. కొంతసేపు పాటలు పద్యాలతో హుషారెత్తించాడు మనవడిని. ఓ గంట తర్వాత ప్రత్యక్షమైనాడు సిమ్మయ్య.‘‘అయ్యా! ఇట్లా రండి..’’ సైగ చేసి బయటకు పిలిచాడు. మనవడిని వీపుమీంచి దించేసి లోపలికి కేకేసి కూతురికి అప్పగించి పెరట్లోకి నడిచి ‘‘ఏరా! ఏమైంది?’’ కుతూహలంగా అడిగాడు పీతాంబరం.