సొంత ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా బతికారు ఆ భార్యాభర్తా. వయసు ఉడిగిపోయాక కొడుకు ఇంటికి పట్నానికి వెళ్ళారు. ఆవిడకు మధ్యాహ్నంపూట దొడ్లో చెట్టుకింద మంచం వేసుకుని పడుకోవడం అలవాటు. ఉదయం సాయంత్రం మొక్కలు పెంచే పని అంటే ఇష్టం. వాళ్ళూళ్ళో ఇంటి చుట్టూ పక్షులు తీర్ధం చేసినట్టుండేవి. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రకృతిలో మమేకమై జీవించిన ఆ భార్యాభర్తా ఇప్పుడు పట్నం వచ్చి ఏం చేశారంటే...

**********************

మొత్తానికి ప్రకాశంగారు, సుబ్బమ్మ జగ్గాపురం గ్రామం వదిలి, పట్నంలో కొడుకు దగ్గరకు వచ్చేశారు. ‘‘మీ ఒంట్లో శక్తి ఉన్నంతవరకు ఆ ఊళ్ళో కష్టపడ్డారు, అక్కడే ఉన్నారు. ఇప్పుడిక మీరు ఈ వయ‍సులో ఆ పల్లెటూర్లో ఒంటరిగా ఉండటం అంత మంచిదికాదు. నేనా ఉద్యోగం వదిలి రాలేను! నా మాటవిని నా దగ్గరకు వచ్చేయండి!’’ అంటూ ప్రకాశంగారబ్బాయి రామేశం ఏడాదికాలంగా పోరుపెట్టగా, పెట్టగా చివరికి పరిస్థితులవల్ల వాళ్ళు ఒప్పుకోకతప్పలేదు.ఆ మధ్య ప్రకాశంగారికి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు బాగానే తగ్గింది. తన పనులు తను చేసుకుంటున్నారు. కానీ, ఎనభైయేళ్ళ వయసులో శరీరం ఆయనకి పూర్తిగా సహకరించటంలేదు. దానికితోడు ఆ పల్లెటూర్లో కనీసం నాటువైద్యుడు కూడా లేదు. మళ్లీ ఒంటికి ఏమైనావస్తే ఇబ్బందే. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, ఇక ఆ ఊరొదిలి పట్నం రాకతప్పలేదు. అయితే ఆయన భార్య సుబ్బమ్మకి ససేమిరా ఇష్టం లేదు.‘‘ఆ దిక్కుమాలిన పట్టణాలలో శుచి, శుభ్రత ఉండిచావదు. అక్కడ పనిమనిషులు అంట్లు కూడా సరిగ్గా తోమరు.

బట్టలుతికేవాళ్ళు బట్టలు తెల్లగా ఉతకరు. పాలవాడు పాలలో నీళ్ళు కలిపేస్తాడు. ఇరుకుఇళ్ళు, ఇరుకు మనుషులు! నా వల్లకాదు బాబు!! అక్కడ నేనుండలేను!’’ అంటూ కొట్టి పారేసేది.తనింట్లో అయితే, సుబ్బమ్మ ఉదయం మడి తడి అంటూ వెనకవాసలో ఉన్న వంటింటిగుమ్మం దాటి వచ్చేది కాదు. పూజా, పునస్కారాలు ముగించి, కట్టెలపొయ్యిలో వంట మొదలెట్టేది. ఇత్తడిగిన్నెలకి మట్టిపూసి, వాటితో నలుగురికి సరిపోయే వంట వండేది. రెండుపూటలా నాలుగురకాల వంటకాలు ఉండవలసిందే. భార్యాభర్తలు తినగా మిగిలిన వాటిని పనివాళ్ళకి పెట్టేది. ఇంట్లో ఇరవైనాలుగ్గంటలు ఇద్దరు పనివాళ్ళుండేవారు. ఆ పనీ, ఈ పనీచేస్తూ ముందు వసారా ఇంట్లోనే వాళ్ళూ ఉండేవారు. మధ్యాహ్నం భోజనాలయ్యేటంతవరకూ సుబ్బమ్మ మడితడి అంటుందని, వాళ్ళు వెనక వసారా ఇంట్లోకి అడుగుపెట్టే వారు కాదు. తమ భోజనాల తర్వాత, పనివాళ్ళిద్దరికీ కొసరి కొసరి వడ్డించేది.