ఒకానొకప్పుడు కళింగరాజధానికి సమీపగ్రామంలో విద్యాధరుడనే యువకుడు ఉండేవాడు. యుద్ధవిద్యల్లో ఆరితేరి, రాజుకొలువులో సైనికుడిగా చేరాలని అతడికి మహాకోరికగా ఉండేది. అందుకని ఉన్న ఊళ్లో అంతోఇంతో యుద్ధవిద్యలు తెలిసిన వారందరికీ శుశ్రూషచేస్తూ వారునేర్పింది నేర్చుకోసాగాడు. అలా కొన్నాళ్లయ్యాక, అతడికి విద్యనేర్పే వారంతా, ‘‘మాకు వచ్చింది నీకు నేర్పాం. సైన్యంలో చేరాలంటే ఇది చాలదు. రాజధానికి వెళ్లి నేర్చుకో’’ అన్నారు.
రాజధానిలో యుద్ధవిద్యలు నేర్పేవాళ్లు శిష్యులనుంచి దండిగా డబ్బు తీసుకుంటారనీ, శుశ్రూషలు చేసినంతమాత్రాన విద్యనేర్పరనీ అతడికి తెలుసు. అతడికి డబ్బులేదు. ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగా, అతడికో విశేషం తెలిసింది.శూరసేనుడనే మహావీరుడు వేటకోసం సమీపంలోని అరణ్యానికొచ్చి గుడారంవేసుకున్నాడు. అడవిమార్గాన పయనించే గ్రామస్థులొకరిద్దరు అతణ్ణి చూశారు. శూరసేనుడు వారిని పలకరించి, ‘‘మీలో ఎవరికైనా యుద్ధవిద్యలు నేర్చుకోవాలనుంటే నాకు ఇక్కడ తోడుగా ఉండండి. నా అంతటివాణ్ణి చేస్తాను’’ అన్నాడుట. వాళ్లకి అలాంటి ఆసక్తిలేదు. కానీ విద్యాధరుడి ఆశయం తెలుసుకాబట్టి విషయం అతడికి చెప్పారు. వెంటనే విద్యాధరుడు హుటాహుటిన అడవికివెళ్లాడు.
కొంత శ్రమపడ్డాక, అక్కడ అతడికి శూరసేనుడి గుడారం కనబడింది. విద్యాధరుడు శూరసేనుడికి నమస్కరించి తన ఆశయం చెప్పుకున్నాడు.‘‘యుద్ధవిద్యలపట్ల నీకున్న ఆసక్తిచూసి మెచ్చుకుంటున్నాను విద్యాధరా! కానీ, నీ ఆశయం నాకు నచ్చలేదు. వీరుడైనవాడు పరులపంచనకాక స్వతంత్రంగా బ్రతకాలి. రాచకొలువులో చేరాలనుంటే, సైన్యాధికారి కావాలితప్ప, సైనికుడు కావాలనుకోకూడదు. నేను యుద్ధవిద్యలన్నీ క్షుణ్ణంగా అభ్యసించాను. ఈ దేశంలో నన్నుమించిన వీరుడులేడు.
ప్రతిఏటా రాజు నిర్వహించే వీరులపోటీల్లో పాల్గొని అందర్నీ ఓడిస్తూంటాను. అయితే, మనదేశ సైన్యాధికారి వీరసింహుణ్ణి మాత్రం నేను ఓడించలేకపోతున్నాను. ముఖాముఖి పోరాటంలో మా ఇద్దరిలో నేనే మెరుగు. కానీ, గుఱ్ఱంమీద ఎక్కి పోరాడినపుడు మాత్రం, ఆయన నన్ను చిత్తుగా ఓడించేస్తున్నాడు. దేశానికి సైన్యాధికారిని కావాలని నా కోరిక. అందుకే రాజు ఉపసైన్యాధికారిపదవి ఇస్తానన్నా అంగీకరించలేదు’’ అన్నాడు శూరసేనుడు.