విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, నీకు మేలిరత్నమిచ్చాడని ఒక భిక్షువుకి సాయపడేందుకు ఈ అపరాత్రివేళ ఇక్కడికొచ్చావు. మహావీరుడివే కాకుండా ఎంతో వివేకవంతుడివి. ఇంతకంటే మంచిపనులుచేసి పేరు తెచ్చుకోవచ్చని నీకు అనిపించలేదా? లేదా ప్రకాశం అనే పండితుడిలా నీ జీవితమే నీది కాదనుకున్నావా? శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.
పీఠపురానికి చెందినవాడు ప్రకాశం. అతడు కవి, పండితుడు మాత్రమేకాదు, జ్ఞాని, వేదాంతి కూడా. ఒకరోజు రవి, వేణు అనే ఇద్దరు యువకులు ఆయన్ని కలుసుకుని ఆయన గొప్పతనాన్ని పొగిడి తమకి కవిత్వం నేర్పమని అడిగారు.‘‘మీరు నా గొప్పతనంమీద కాదు, నేను చెప్పే చదువుమీద దృష్టి పెట్టాలి’’ అని హెచ్చరించి వాళ్లను శిష్యులుగా చేర్చుకున్నాడాయన. వాళ్లు చురుకైనవాళ్లు కావడంతో ఏడాది తిరక్కుండా కవిత్వంలో నిష్ణాతులయ్యారు.‘‘మా కవిత్వాన్ని ఊరూరా ప్రదర్శించి, మీ అంతటి మహాకవులమన్న పేరు తెచ్చుకుని మా జీవితాల్ని సార్థకం చేసుకుంటాం’’ అని వాళ్లు గురువుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రకాశంవాళ్లతో, ‘‘మహాకవులుగా పేరు తెచ్చుకోవాలన్న కాంక్ష మీకుంటే, అందుకు కవన ప్రతిభ ఒక్కటీ సరిపోదు. అందుకు లోకజ్ఞానం కూడా కావాలి. నేనిప్పుడు దేశసంచారానికి వెడుతున్నాను. మీరూ నాతో రండి. లోకజ్ఞానం పెరిగి, మీ విద్య మరింత సార్థకమౌతుంది’’ అన్నాడు.అలా వాళ్లు బయల్దేరి ముందుగా వాణీపురం చేరుకుని, ఆ గ్రామాధికారి చదువులయ్య ఇంట బసచేశారు.