ఒకటికి నాలుగుసార్లు చెబితేతప్ప ఏదీ సరిగ్గా అర్థంకాదు. అలాంటి కొడుకును సాకలేక రాజయ్య సన్యాసులలో కలిసిపోవాలనుకున్నాడు. కానీ, కొడుక్కి ఏదైనా దారిచూపించకుండా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి మనస్కరించలేదు. ఆ సమయంలో, ఆ ఊళ్లోనే ఉంటున్న రామదాసు అనే భూస్వామికి పనివాడు కావలసి వచ్చింది. అందుగురించి ఆయన ఊరంతా వాకబు చేస్తూ ఉంటే, ఆ విషయం రాజయ్యకి తెలిసి, తన కొడుకుని ఆయన వద్దకు తీసుకుని వెళ్లి ఇలా చెప్పాడు. ‘‘అయ్యా, దాచకుండా నిజం చెబుతున్నాను. నా కొడుకు కూర్మయ్య అమాయకుడే కానీ బుద్ధిమంతుడు. చెప్పి చేయించుకుంటే ఏ పనైనా చేస్తాడు.
నాకు జీవితంమీద విరక్తి కలిగింది. అందుకే సన్యాసం స్వీకరించాలన్న ఆలోచన వచ్చింది. కాబట్టి, వీణ్ణి మీకు అప్పజెబుతున్నాను. లేకుంటే ఒకరిఇంట్లో పనిచేయవలసినగతి వీడికి పట్టేదికాదు. మీరు పదిసంవత్సరాలపాటు వీడికి తిండీబట్టా పెట్టి, పనిచేయించుకుంటానని పత్రం వ్రాసిస్తే, నేను వీణ్ణి మీకు అప్పజెబుతాను’’.‘‘పది సంవత్సరాలేం కర్మ! పని బాగాచేస్తే నేను వీణ్ణి జీవితాంతం మా ఇంట్లో ఉంచుకుంటాను’’ అన్నాడు రామదాసు సంతోషంగా. ‘‘పది సంవత్సరాలకైనా వీడికి ఏదో జీవనాధారం చూపించకపోతే, నాకు తృప్తిగా ఉండదు. అందుకని అలా చెప్పాను. ఆ తర్వాత, మీ ఇష్టమూ, వాడి ఇష్టమూనూ. నాకు మాత్రం పదిసంవత్సరాలకు పత్రం రాసిస్తే చాలు’’ అన్నాడు రాజయ్య.
పనివాడి అవసరం ఎక్కువగా ఉండడంవల్ల, రామదాసు సరేనని రాజయ్యకి పత్రం రాసిచ్చాడు. రాజయ్య ఆయనతో, ‘‘ఈ పత్రం నాదగ్గర భద్రంగా దాచుకుంటాను. ఎప్పుడైనా మనసుపుడితే మళ్లీ నా కొడుకును కళ్ళారా చూసుకోవడానికి వస్తాను’’ అని చెప్పి వెళ్లిపోయాడు.ఆ విధంగా కూర్మయ్య రామదాసు ఇంట్లో పనికి ప్రవేశించాడు. కానీ రామదాసు పిల్లలకూ, భార్యకూ కూడా వాడి పని బొత్తిగా నచ్చలేదు. వాడు ఎందుకూ పనికిరానివాడని తెలుసుకునేందుకు వాళ్లకు వారంరోజులు కూడా పట్టలేదు. ‘‘కూర్మయ్యవల్ల తిండిదండగతప్ప మరే ప్రయోజనంలేదు. వెంటనే వీణ్ణి పొమ్మనండి’’ అని ఇంటిల్లపాదీ రామదాసుకు చెప్పారు. రామదాసు వాళ్లందరితోటీ, ‘‘నాకు కూర్మయ్య నచ్చాడు. మీకు నచ్చకపోతే మీ పనులు మీరే చేసుకోండి. వాడి పనిలో వంకపెట్టినా, వాణ్ణి పల్లెత్తుమాట అన్నా నన్ను చిన్నబుచ్చినట్లే! ఈ విషయం గుర్తుంచుకుని మసలండి!’’ అని కచ్చితంగా చెప్పేశాడు.