నేనూ మా నాన్న పెద్దయ్య ఇంటికెళ్ళినప్పుడు అందరూ అన్నాలు తింటున్నారు. తీసికెల్లిన కూరగాయల్ని అరుగుమీద దించి ఆడే నిలబడ్డాం. కొంతమంది అడుక్కునే వోళ్లు, ముసలోళ్లు ఆడే నిలబడి ఉన్నారు. రోజూ ఆ ఏలప్పుడొత్తారు వాళ్లు.పెద్దయ్య చెరో చేత్తో అన్నం కూరగిన్నెలతో అక్కడికొచ్చాడు. మమ్మల్నిచూసి ‘‘ఇక్కడే నిల బడ్డారే? లోనికి పోయి మీరు తినండి’’ అన్నాడు.

ఇంటిలోపలి కెళ్ళి అమ్మగారికి కూరగాయలిచ్చాం.పెదబాబు ఎంగిలిస్తరాకుతో బావిదగ్గరకెల్తుంటే ‘‘దీనికి మీరెందుకయ్యా? మేము లేమా?’’ అని ఆయన చేతిలోని ఇస్తరాకు తీసుకోబోయాడు నాన్న.‘‘ఎవరు తిన్నవిస్తళ్లు వారే తీస్తారే గానీ మీరుపోయి బావి దగ్గర కాళ్ళూ చేతులూ కడుక్కు రండి’’ అంది అమ్మగారు.బాసింపట్టేసుకుని వంచిన తలెత్తకుండా తింటున్నాను. నా డొక్కలో గడికొక్క పాలిపుర చేత్తో పొడుత్తా’’ పెద్దోళ్ల ముందు జాగరతగా తినాల్రా’’ అంటున్నాడు నాన్న.తిండియావలో పడితే నా బండికి బ్రేకులుండవు. కడుపునిండా తిని లేచాం. బూరెల గారెలు పూర్ణాలు మూట కట్టిచ్చింది పెద్దమ్మగారు. పండగలనీ, వ్రతాలనీ, పుట్టిన రోజులునీ ఏదో వంకన మా అందరి కడుపులు నింపుతా ఉంటాడు పెద్దయ్య. అదే మాకు కిస్‌మిస్‌ పండగ!పెద్దయ్య దబ్బపండులాగా ఉంటాడని అంతా ఎర్రాచారిగారని పిలుత్తారు. కొంతమంది పెద్దయ్యా అంటారు.

పొద్దున్నే సైకిలేసుకుని ఊరంతా తిరిగి జ్వరాలు, దగ్గులు, విరోచనాలు, సర్పి, పసికర్లు, వాంతులకి గోళీలిత్తాడు. చుట్టుపక్కల ఊరులనుంచి జనం వత్తారు. పాము కరిచినా, తేలుకుట్టినా ఇంకేమన్నా అయితే. వాళ్లంతా పెద్ద డాక్టరు గారూ అంటారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు. కూరగాయలు, మినుములు, పెసలిత్తే తీసుకుంటాడు. ఆకు కూరలంటే బలే ఇష్టం.పెద్దయ్యకి ముగ్గురు కొడుకులు. వాళ్లకి బెజవాడ, గుంటూరు, ఒంగోల్లో పెద్దపెద్ద ఉజ్జోగాలు. అన్నాలు తిన్నాక వాళ్లు వచ్చి చావిట్లో చాపలమీద కూకున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు.మేము అక్కడే తలుపువారగా నిలబడ్డాం.

నేను వాళ్లు చెప్పుకునే కబుర్లు ఆలకిత్తా ఉండాను.పెద్దయ్య అన్నం తినేసి వచ్చి ఉయ్యాల మీద కూకున్నాడు. పెద్దమ్మగారొచ్చి తాంబూళం పెట్టి ఇచ్చింది. తమలపాకులకు సున్నం రాసుకుంటూ ఏదో కూనిరాగం తీత్తున్నాడు. పిల్లలంతా ఆయన చుట్టూచేరారు. ఆకుల్లోకి యాలక్కాయాలు, వక్కలు, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, ఎండు కొబ్బరి ముక్కలు కలిపి ఉండలా చుట్టి నోట్లో వేసుకున్నాడు.