సమయం సాయంత్రం ఐదుగంటలు. సినిమాకు వెళదామన్న ఉద్దేశంతో తొందరగా వంటచేసి తయారవసాగింది అందమైన మాలతి. ఇంతలో ఇంటిముందు స్కూటరు ఆగిన శబ్దం విని బయటకొచ్చింది. భర్తకు ఎదురువెళ్లి, నవ్వుతూ దర్శనమిచ్చింది. సుధీర్, లోపలకు రావటముతోనే, భార్యవంక నఖశిఖ పర్యంతం వీక్షించి చిన్నగా కన్నుగీటుతూ ‘హాయ్ డార్లింగ్! బ్యూటీఫుల్’ అంటూనే, ఆమె వారిస్తున్నా వినకుండా మాలతి మెడచుట్టూ చేతులువేసి, అమాంతం తన కౌగిలిలో బంధించసాగాడు. తన అధరాలతో ఆమె గులాబిరంగు చెక్కిళ్లపై ముద్దులవర్షం కురిపించసాగాడు. ఇక, మాలతి అయితే భర్త బాహుబంధనాల్లోంచి మెల్లగా విడివడుతూనే, ‘అయ్యా మహాశయా! ఇదేమన్నా బాగుందా! సినిమాకు వెళదామనిచెప్పి మీరు చేస్తున్న ఈ చిలిపిపని ఏమిటి!’ చిరుకోపంతో అంది.
‘మాలా! ఎంజాయ్ చేయవలసిన సమయంలో సరదాగా ఉండకపోతే ఎలా చెప్పు! ఆఁ ఇప్పుడే ఓ పది నిమిషాల్లో తయారై వస్తా అంటూ బాతరూమ్‌కి వెళ్లబోతున్నవాడల్లా మరల వెనక్కి తిరిగి వచ్యాడు. ఆమె మేనును తమకంలో స్పర్శిస్తూ ‘మాలా!’ అంటూ గోముగా పిలువసాగాడు. మాలతి ఒకింత సిగ్గుపడి వెంటనే తేరుకుంటోందేగానీ, భర్త కొంటె చూపులకు ఆమె వదనం ఎర్రబారసాగింది. ఇంతలో ఆరేళ్ల ఉష అక్కడకు వచ్చి ‘డాడీ!’ అని పిలిచింది. సుధీర్ చటుక్కు భార్యకు దూరం జరిగాడు. నవ్వుతూ కూతురిని పలుకరించి లోపలకెళ్ళాడు. మొత్తానికి వారు ఆ రోజు సినిమాకు వెళ్లారనే చెప్పాలి.ఆరోజు రాత్రి మాలతి పడుకున్నదన్నమాటేగానీ, ఆమె ఆలోచనలనిండా సుధీరే. అతడు చేసే చిలిపిచేష్టలు ఆమెను మనసును గిలిగింతలు పెట్టసాగాయి. ఆమె హృదయంలో భర్త రూపమే నిండి ఉంది. సుధీర్‌కు కూడా భార్యంటే చాలా ప్రేమ.