అసుర సంధ్యవేళ. ఆకాశం మేఘావృతమైవుంది. గుడిసెలో నుండి నడవలేక, కష్టపడుతూ నెమ్మదిగా బయటకువచ్చి తూలి పడబోయాడు రామారావు.‘‘అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా? ఎంతైనా నీ మొండితనం నీదే. వయసుమీరుతోంది. మనస్సు ఎంత కుర్రతనంగా ఆలోచించినా, శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది గుర్తుంచుకో! అయినా పైన మబ్బులు క్రమ్ముతూ ఉంటే ఆరుబయట కూర్చోవలసిన అవసరం ఉందా?’’ అంటూ నులకమంచం తెచ్చి బయట ఖాళీ స్థలంలో వేసింది లక్ష్మి.‘‘ఈ మబ్బులకే భయపడితే ఎలా లక్ష్మీ! మన జీవితంలోని మబ్బులకంటే ఎక్కువా ఏమిటి, కాస్తవర్షం కురిస్తే అవి పోతాయి, కానీ ఎప్పటికైనా మన జీవితాలలో మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా?’’

‘‘మబ్బులు పోవటం...’’ అని వ్యంగ్యంగా నవ్వి ‘‘ఆశకు అంతు ఉండాలి’’ అంటూ గుడిశెలోకి వెళ్ళిపోయింది లక్ష్మి.కాస్త ప్రయాసతో నులకమంచం మీద కూర్చున్నాడు రామారావు.రామారావు, లక్ష్మి చదువుకున్నది పదో తరగతే కానీ ఆ తరువాత వారిని వీరిని అడిగి ఎన్నో పుస్తకాలు చదివారు. జన్మకు తల్లిదండ్రులు పునాది వేస్తే, అనుభవాలు జీవితానికి పునాది వేశాయి. ఎవరు ఏం చెప్పినా వినేవారు, నేర్చుకునేవారు.అసురసంధ్యని చీకటి క్రమ్ముకుంటోంది. మేఘాలు పలచనపడి ఆకాశంలో నదీప్రవాహంలా మరో మజిలీవైపు సాగిపోతున్నాయి. అక్కడక్కడ నీలాకాశం తొంగి చూస్తోంది.‘‘ఏం రామయ్యా! ఎలా ఉన్నావు? ఈ మధ్య నీకు ఒంట్లో బాగోలేదని తెలిసింది. కులాసాగా ఉన్నావా?’’ అడిగాడు వేణుగోపాల్రావ్‌.

ఆయన గుడిసె ప్రక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లో ఉంటాడు వేణుగోపాల్రావ్‌.‘‘ఫర్లేదు బాబయ్యా! మీ అందరి ఆశీస్సులూ ఉన్నాయి కదా!’’‘‘పిల్లలు వచ్చారా? చూడటానికి’’ అడిగాడు.‘‘రేపో మాపో వస్తారనే అనుకుంటున్నాను’’ అన్నాడు రామయ్య పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక. వేణుగోపాల్రావు నిష్క్రమించగానే వారిద్దరి సంభాషణ విన్న లక్ష్మి గుడిసెలోంచి బయటకు వచ్చి ‘‘ఆయనతో ఏం చెపుతున్నావ్‌? పిల్లలు వస్తారనా! పిల్లలు వస్తారనీ, వాళ్ళు నిన్ను ఉద్దరిస్తారనీ ఇంకా అనుకుంటున్నావా? అడ్డాలనాడు బిడ్డలుగానీ గెడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలా!’’ అంది అసహనంగా.