మూలకథ: ‘ఆన్‌ ది ఉడెన్‌ పార్క్‌ బెంచ్‌’రచన: జోహా - అల్‌ హర్తి (ఒమన్‌ రచయిత్రి)అనువాదం: ఎ.యం.అయోధ్యారెడ్డిపార్కు మధ్యలోవున్న సిమెంటు బెంచీ మీద మేం కూర్చుని ఉన్నాం.కుడివైపు చివరన నేను, ఎడమవైపు అంచున అతడు, మేమట్లా దూరదూరం కూర్చుంటే తప్ప బెంచీ బ్యాలెన్స్‌ కాదన్నట్టు.అది చాలా పెద్ద పార్కు. చుట్టూ ఎత్తయిన చెట్లు. నేలమీద చిక్కటి గడ్డి తడితడిగాఉన్నది.సంధ్యా సమయపు నారింజ రంగు సూర్యుని గోరువెచ్చదనం ఉద్యానవనాన్ని స్పర్శిస్తున్నది. అతడు నాతో అన్నాడు:‘‘నేను ఒంటరివాణ్ని. స్నేహితులెవరూ లేరు. అయినా ఇలా ఒంటరిగా ఉండటం నాకు సంతోషంగానే ఉన్నది.’’‘‘నేనూ ఒంటరిదాన్నే. స్నేహితుల్లేరు. అయితే అందువల్ల సంతోషంగా లేను. బాధగా ఉన్నది’’ బదులుగా నేను చెప్పాను.బాగా చీకటిపడింది. నేను గదికి తిరిగొచ్చాను. భోజనం తర్వాత నా హోంవర్క్‌ పూర్తిచేసి పడుకున్నాను.మరుసటి రోజు మేము పార్కులో అదే బెంచీపైన కూర్చున్నాం. మాకు దగ్గర్లోనే పిల్లలు బంతితో ఆటలు ఆడుతున్న శబ్దాలు.‘‘నాకు స్నేహితులంటే ఇష్టం ఉండదు. ప్రతి స్నేహం చిట్టచివరికి ద్రోహానికే దారి తీస్తుంది’’ అతడన్నాడు.‘‘నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. అందుకే నాకలాంటివేవీ అనుభవంలో లేవు’’నేనన్నాను.చూట్టూ ఆడుకుంటున్న పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోయినట్టున్నారు. శబ్దాలు వినిపించడం లేదు. అతడు కూడా లేచి వెళ్ళిపోయాడు.నేనూ నాగదికి తిరిగొస్తూ మూలమలుపులో ఉన్న దుకాణంలో పాలు, రొట్టె కొని తెచ్చుకున్నాను.ఆరోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. అందువల్ల పార్కుకు వెళ్ళలేకపోయాను. మరునాడు అతడు అన్నాడు:‘‘నిన్న మీకోసం చాలాసేపు వేచి చూశాను.’’‘‘వర్షం వల్ల రాలేకపోయాను’’ అని చెప్పి ‘‘మీరు నా కోసం ఎందుకు ఎదురుచూశారు? మనమేమైనా స్నేహితులమా?’’ ప్రశ్నించాను.‘‘మీకు ముందే చెప్పాను. నేను స్నేహాన్ని నమ్మను. ముఖ్యంగా స్త్రీపురుషుల స్నేహం. ప్రేమను ఎదుర్కోవడానికి అదో పిరికి మార్గం.’’సమాధానంగా నేనేమీ అనలేదు. ఆకాశంలో నీలిరంగు మబ్బులు దట్టంగా కమ్ముతున్నాయి. ఏక్షణమైనా వాన రావొచ్చు.అకస్మాత్తుగా వర్షం మొదలైంది. కంగారు పడుతూ వేగంగా గదికి తిరిగొచ్చాను. రాత్రి చాలాసేపు టీవీ చూసి తర్వాత నిద్రపోయాను.పార్కు మధ్యలో సిమెంటు బెంచీ మీద మేము కూర్చునున్నాం.

                                                *********************************************