నిండు పౌర్ణమి.... మంద్రంగా వీస్తున్న చిరుగాలికి గలగలమని కదులుతున్న కొబ్బరాకులు, తమపై తారాటలాడుతున్న వెన్నెల కిరణాలను పట్టి నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తు న్నాయి.తన బెడ్‌ రూం బయట బాల్కనిలో ఉన్న వాలుకుర్చీలో కూర్చుని, చాలాసేపటి నుండి... మెడలోని పసుపుతాడుకు వ్రేళ్ళాడుతున్న రెండు సూత్రాలను మునివేళ్లతో అపురూపంగా పట్టుకుని.... వాటినే తదేకంగా చూస్తూ ఉన్న సుధేష్ణ, వెనుక నుండి ఎవరో వస్తున్నట్లున్న అడుగుల సవ్వడికి తల తిప్పి చూసింది.

‘‘సుధీ.. ఇంకా పడుకోలేదా...?’’ అంటూ వచ్చాడు అభిరామ్‌. అతడిని చూడగానే... లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వింది. ‘‘ఇప్పటివరకూ నిద్రపోకుండా ఈ చల్లగాలిలో కూర్చుని ఏం చేస్తున్నావ్‌...? రేపే కదా ప్రయాణం... రేపు ఉదయం లేచి తయారై... రెండు గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలి. ఇంత రాత్రి వరకూ మెలకువతో ఉంటే... పొద్దున్నే లేవడం ఆలస్యమైపోదూ.... లే...లే!’’ అన్నాడు ఆమె భుజంపై తడుతూ.తలెత్తి అతని కళ్ళల్లోకి కాస్సేపు అలాగే చూసింది. అతని కళ్ళు నిష్కల్మషంగా నవ్వుతున్నాయి. తన హృదయం పడుతున్న మధనం... తనలో పొంగి పొంగి వస్తున్న దుఃఖం అతనికెందుకు తెలియడం లేదు...? ఆయనకెంతో చెప్పాలని ఉంది. ఏవేవో అడగాలని ఉంది. కానీ, ఆ కళ్ళల్లో కనిపించే... పవిత్రతను, అతని ముఖంలోని అంతులేని ప్రశాంతతను చూస్తుంటే... పెదవి కదపలేక పోతుంది తను.

రెప్పవాల్చకుండా తననే చూస్తున్న సుధేష్ణను చూసి చిన్నగా నవ్వాడతను. కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె పైకి మెల్లిగా వంగి, ఆమె ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని ‘‘ఏంట్రా... భయంగా ఉందా...? ఈ ప్రయత్నం సక్సె్‌స్‌ అవుతుందో లేదో అని టెన్షన్‌ పడుతున్నావా..? చిన్నపిల్లను బుజ్జగిస్తున్నట్లు లాలనగా అడుగుతూ. ఇంకొంచెం వంగి ఆమె నుదుటిపై సున్నితంగా చుంబించాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్ళు చిప్పిల్లాయి. ఆ స్పర్శ.... చిన్నప్పుడు తన తండ్రి తనను ఎత్తుకుని... నుదురుపై ముద్దాడినట్లుంది.‘‘ఏయ్‌.... ఏమిటిది... ఎందుకా కన్నీళ్ళూ...?’’ ఆమె చెంపల పైకి జారుతున్న కన్నీళ్ళను తుడుస్తూ చెప్పాడు. ‘‘పూణేలోని గెలాక్సి కేర్‌ చీఫ్ డాక్టర్‌ మల్హోత్రా అండ్‌ అతని టీమ్‌ ఈ ఆపరేషన్‌ చేయడంలో సిద్ధహస్తులు. ఇప్పటివరకు Absence of Uterus Cases చాలా అటెండ్‌ చేసి, తన ఆపరేషన్స్‌ ద్వారా ఎందరికో స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని ప్రసాదించాడు. వైష్ణవి పంపిన నీ రిపోర్ట్స్‌ చూసి. అవన్నీ పరిక్షించాకే నీకు యూటరస్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు.

ముంబైలోని తన గర్భసంచిని నీకు ఇవ్వడానికి ఒక డోనర్‌ని కూడా డా. సమీర్‌ ఏర్పాటుచేసారు. ఒకవేళ ఇది సక్సె్‌స్‌ కాకపోయినా.... ప్రాబ్లెమ్‌ లేదు. నీకు కాబోయే భర్త సమీర్‌ చాలా మంచివాడు. వాస్తవానికి నువ్వు పిల్లలను కనాలనే నిబంధనలేమీ అతను పెట్టలేదు. నీ పరిస్థితి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే.... నిన్ను పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే, ఇదంతా కేవలం నీ సంతృప్తికోసమే... నువ్వు కోరు కున్నదే... నువ్వు బీడు నేలగా మిగిలిపోకూడదు. అందరాడవాళ్ళలా సుక్షేత్రమవ్వాలి...!’’