‘‘ఒరే...నాకేమైనా నొప్పిటరా...ఎందుకుపంపనూ!పంపిస్తావా అని అడుక్కుంటావేంరా. పంపించమని ఆర్డర్ వెయ్యరాబాబు...’’ ఏదైనా పంపించమని అడిగినప్పుడు మా కాకరాపల్లి సత్యన్నారాయణమూర్తి సమాధానం ఇలా ఉంటుంది. మూర్తి విశాఖపట్నంబ్రాంచీలో పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఏది అడిగినా ఇలాగే చెబుతుంటాడు. మూర్తి ఇలా మాట్లాడినప్పుడల్లా నాకు కడుపు నిండినట్లవుతుంది. వాడు మాటలతో కడుపునింపుతాడురా బాబూ అని అప్పుడప్పుడూ కొందరంటూ ఉంటారు. బహుశా ఇలాంటివారిని చూసే అలాంటి నానుడి వచ్చి ఉంటుంది. ఈ కారణంచేతే మూర్తి అంటే అందరికీ సదభిప్రాయం ఉంది.
మూర్తి ఐదడుగులనాలుగంగుళాలుంటాడు. కుంచెలాంటిమీసాలు, దట్టంగా ఉండి చిప్పబోర్లించినట్టుండే జుట్టు. అడ్డంగా మూడువిబూదిరేఖలు. మధ్యలో ఎర్రనిబొట్టు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటాడు. బయట టీ, కాఫీలు తాగడు, ఎవ్వరినీ ఏమీ అనడు. ఎవరికీ ఏమీ తినిపించడు. హోటల్‌కువచ్చినా ఏమీ తీసుకోడు. అదొక నియమంలా పాటిస్తాడు. ఉదయం గంట, సాయంత్రం గంట పూజచేస్తాడు. జాతకం చెబుతాడు, ముహూర్తాలూ అవీ పెడుతూ ఉంటాడు. ఠంచన్‌గా సమయానికి ఆఫీసునుండి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో జాతకాలు, ముహూర్తాలతో బిజీ అయిపోతాడు. కాబట్టి మూర్తిని ఎవరూ, ఎక్కడికీ పిలవరు. ఒకవేళ పిలిచినా రాడు.మేం కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఒకానొక కార్పొరేషన్‌లో పనిచేస్తున్నాం. ఇద్దరమూ ఒకేసారి ఉద్యోగంలో చేరాం.
ఢిల్లీలో నిర్వహించిన శిక్షణాశిబిరంలో మొదటసారి కలుసుకున్నాం. అప్పటికే మాకు ముప్ఫైఏళ్ళు దాటాయి. ఇద్దరమూ జీవితంలో ఢక్కాముక్కలుతిని ఈ ఉద్యోగంలో చేరినవాళ్ళమే. మా ఇద్దరి పరిచయం సుమారుపాతికేళ్ళు. అప్పటినుండీ నాకు మూర్తి ఆత్మీయమిత్రుడు. అయితే మూర్తి నన్ను ఆత్మీయమిత్రుడని భావిస్తాడనేందుకు దాఖలాలేమీ లేవు. నేనే కాదు, మా సంస్థలో పనిచేసే చాలామంది కొలీగ్స్ కూడా మూర్తిని ఆత్మీయమిత్రుడని భావిస్తారు. కానీ మూర్తి ఎవరికీ దగ్గరకాదు. ఇది నేను మాత్రమే కనిపెట్టిన సత్యం. తను అందరికీ దగ్గరవాడనే భ్రమ కలిగించటమే మూర్తి ప్రత్యేకత.