‘‘చిత్తూ, చిత్తూల బొమ్మ... 

    శివునీ ముద్దులగుమ్మ
 బంగారుబొమ్మ దొరకెనమ్మో 
    ఈ వాడలోన ....’’
రాత్రి పూట డీజే సౌండ్‌ బాక్స్‌ లోంచి పెద్ద శబ్దం చేస్తూ వస్తున్న బతుకమ్మ పాట ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. 
సూర్యాపేట టౌన్‌ శివార్లలో ఉన్న కాలనీ అది. ఆ రోజు బతుకమ్మ పండుగ మొదటి రోజు. 
రాత్రి ఏడు గంటల సమయంలో వీధిలైట్ల వెలుతురు కింద గుండ్రంగా పేర్చిన తంగేడు బతుకమ్మలు... బంగారం ముద్దల్లెక్క ధగధగ మెరిసిపోతున్నయి. ఆ చీకట్లో ఆడబిడ్డల కళ్ల నిండా వెలుగుతున్న బతుకమ్మలు... వేగు చుక్కల్లాగా కనిపిస్తున్నయి. 
బతుకమ్మ ఆడుతున్న ఆడబిడ్డలంతా తాము భూమి మీద కాకుండా, ఏ స్వర్గలోకంలోనో ఆడుకుంటున్నంత సంబరంగా ఉన్నరు. అందరు ఆడబిడ్డలు అంత సంతోషంగా బతుకమ్మ ఆడుతుంటే, ఆ కాలనీలోనే ఉంటున్న పూలమ్మ మాత్రం ఇంట్లో ఒక్కతే కుమిలికుమిలి ఏడుస్తున్నది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. 
బతుకమ్మ పండగ అంటే ఏ ఆడబిడ్డకైనా పట్టలేని సంబరం. ఎప్పుడెప్పుడు తల్లిగారింటికి పోదామా... పుట్టిన మట్టిని, తన ఊరి మనుషులను పలకరిద్దామా అని ఆరాట పడతరు. పూలమ్మ కూడా తన పుట్టింటికి పోయి బతుకమ్మ పండగ అట్లనే చేసుకోవాలని కలలు కన్నది. కానీ ఈ ఏడాది ఆ అదృష్టం దక్కలేదు.
ముప్పయ్యేళ్ల ఈడున్న పూలమ్మ బతుకమ్మ పండక్కి పుట్టింట్లో లేకపోవడం ఇదే తొలిసారి. తను పుట్టింటికి పోకపోవడానికి కారణం పుట్టినిల్లు లేక కాదు. తోడబుట్టిన అన్నకు చెల్లెలు మీద ప్రేమ లేకా కాదు. వాళ్ల అన్న గోపాల్‌కి చెల్లెలు పూలమ్మ అంటే ప్రాణం. అందరూ ఉన్నా అడివిలో మోదుగు లెక్కనైంది పూలమ్మ బతుకు.

********* 

‘‘ఇగో.. నీకు ఇదే ఆఖరుసారి చెపుతున్న. మీ చెల్లెలు పూలమ్మ ఈ గడప తొక్కితే నేను ఉరిపెట్టుకొని సచ్చిపోత. ఇంతకాలం చెల్లె, చెల్లె అని ఉన్నదంతా  ఊడ్చి పెట్టినవు. ఇప్పుడు సూడు ఏం చేసిందో? ఎకరం జాగ కోసం మన పరువు బజార్లకు గుంజింది. పదిమందిల ఇజ్జత్‌ తీసింది. ఇంక ఏం మొకం పెట్టుకుని సెల్లే.. అంటున్నవు’’ పూలమ్మ వదిన నెత్తి నోరు కొట్టుకుంటోంది. 

ఊహ తెలిసినప్పటి నుంచి బతుకమ్మ పండగ అంటే చెల్లెలే గుర్తుకు వస్తది గోపాల్‌కి. బతుకమ్మ పండక్కి చెల్లెలు లేని ఇల్లు.. చెట్లు లేని అడివిలాగనే అనిపించింది. గత రెండు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కళ్లముందు మెదులుతున్నయి. 

ఒక్కగానొక్క చెల్లెలు పూలమ్మ. తనకంటే రెండేండ్లు చిన్నది. గోపాల్‌ తల్లిదండ్రులు మేకలు కాసేవాళ్లు. వాళ్ల నాయన పొద్దున్నే ఊరి పక్కనే ఉన్న అడివిలకు మేకలమందని తోలుకుని పోయేవాడు. తల్లి బువ్వకూర వండి సద్దిమూట కట్టి గోపాల్‌కి ఇచ్చి కూలి పనికి పోయేది. అడివిలో ఉన్న తండ్రికి సద్ది మూట ఇచ్చి పగటేళ్లకు ఇంటికి వచ్చేటోడు.పూలమ్మతో కలిసి గొర్లకొట్టం సుబ్బరంగా ఊడ్చేవాడు. చెల్లెలంటే చాలా పావురం. అమ్మనాయన పక్షుల మాదిరిగా పొట్టతిప్పలకు ఎగిరిపోతే... గోపాలే చెల్లెలిని తల్లిలాగా సాకిండు. 

ఇంట్లె పని ఐపోయినంక చెల్లికి పొద్దూకాల స్నానం చేయించేవాడు. రంగు రంగుల గౌను తొడిగి, పౌడరు పూసి, తిలకం పెట్టి, రెండు జడలు వేసి బతుకమ్మని పేర్చినట్టు అందంగా తీర్చిదిద్దేటోడు. గోపాల్‌ పదేండ్ల వయసులో నాయన అడివిలో మేకల కోసం తుమ్మచెట్టు కొమ్మ కొడుతూ పైనుంచి జారిపడి చనిపోయిండు. తల్లి చేసి తెచ్చిన కూలి డబ్బులతో ఇల్లు గడవలేదు. అందుకే చిన్న వయసులోనే తాపీ పనిలో ఇటుకలు మోయడానికి పోయిండు. తను సదువకున్నా చెల్లెలు పూలమ్మని మాత్రం సదివించిండు. కొత్త పుస్తకాలు, పెన్నులు.. చెల్లెలు చదువుకు ఏ లోటు రాకుండా చూసుకున్నడు. 

అటు తను చేస్తున్న తాపీ పనిలో పగలు రాత్రి కష్టపడి సొంతంగా మేస్త్రీగా ఎదిగిండు. నిజాయతీపరుడని, మంచి పనిమంతుడని పేరు తెచ్చుకున్నడు. చుట్టు పట్టు ఊళ్లల్లో ఎవరు కొత్త ఇల్లు కట్టాలనుకున్నా గోపాల్‌కే అడ్వాన్స్‌ ఇచ్చేవాళ్లు. అట్ల గోపాల్‌ పగలు, రాత్రి కష్టపడి తండ్రి లేని ఇల్లును ఎనుగర్రలాగా తన కష్టంతో నిలబెట్టిండు. ఐదెకరాల భూమి కొన్నడు. 

పగలు రాత్రి అన్న పడే కష్టం చూసిన పూలమ్మ కూడా శ్రద్ధగా చదివేది. పదో తరగతి ఫస్టు క్లాసుల పాసయ్యింది. ‘‘చెల్లెలుని ఇంకా పై చదువులు చదివిస్తా..’’ అని ఇంటర్‌ హాస్టల్‌లో పెట్టి చదివించిండు. ‘నువ్వు డాక్టర్‌ కావాలె చెల్లెలా...’ అని ఎమ్సెట్‌ పరీక్ష కోసం కోచింగు పంపించిండు. కానీ మంచి ర్యాంకు రాలేదు. అన్న ఇంత కష్టపడి సదివించినా తాను చదవలేక పోయానని, అన్న మాట దక్కలేదనే దిగులుతోని బలవంతంగా చావాలనుకుని ఉరిబెట్టుకోబోయింది. ఈ లోపే వాళ్ల అమ్మ కనిపెట్టింది. ఈ సంగతి తెలిసి గోపాల్‌ గుండెలు బాదుకున్నడు. 

‘నువ్వు డాక్టర్‌ కాకపోయినా ఫర్వాలేదు చెల్లె, మా కండ్లముందల సల్లగ బతికితే చాలు... ఇంకెప్పుడు అట్ల చేయొద్ద’ని తన మీద ఒట్టు వేయించుకున్నడు. చదువంటే డాక్టరే కాదు, ఇంక చాలా చదువులున్నయి అని అండగ నిలబడ్డడు. 

అన్న మాటలతో ధైర్యం కూడదీసుకుని మళ్లీ కష్టపడి చదివింది. పూలమ్మ కాలేజీలో చదువుతుంటే మగ పిల్లలు రకరకాలుగా పుకార్లు పుట్టించినరు. కాలేజీలో ఎవరినో ప్రేమిస్తోంది అని చెడు ప్రచారం చేసినరు. ఈ మాటలు విని తల్లి చాలా భయపడింది.

‘‘నా మాట ఇనురా నాయనా... ఆడపిల్లను ఒక అయ్యచేతిలో పెడితే మన బరువు తీరుతది’’ అని చాలాసార్లు పట్టుపట్టింది. తన చెల్లెలు గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా గోపాల్‌ పట్టించుకోలేదు. చెల్లి చుట్టూ కోటగోడలాగా అండగా నిలబడ్డడు. అందుకనే అన్న అంటే దేవుని లెక్క చూసుకుంటది పూలమ్మ. 

అన్న నమ్మకం నిలబెట్టింది పూలమ్మ. కష్టపడి చదివి గవర్నమెంట్‌ టీచర్‌ అయింది. గోపాల్‌ సంతోషంతో ఊళ్లో గడప గడపకూ తన చెల్లెలు గవుర్మెంట్‌ టీచర్‌ జాబ్‌ అయిందని గర్వంగా చెప్పుకున్నడు. పదేళ్ల క్రితం వాళ్ల ఇండ్లల్లో ఆడపిల్లలు చదవు కోవడమే గగనం. ఇంగ గవర్నమెంట్‌ జాబ్‌ అంటే అసలే అరుదు. అందుకనే పూలమ్మకి జాబ్‌ రాంగనే మంచి సంబంధం వచ్చింది. కట్నం ఇవ్వకున్నా చేసుకుంటం అన్నరు. 

పెళ్లి కొడుకు వాళ్లు కట్నం వద్దని స్పష్టంగా చెప్పినా తనకున్న భూమిలో ఎకరం జాగ ఇస్తనని ఒప్పుకున్నడు గోపాల్‌. పెట్టిపోతలు మంచిగ పెట్టి ఉన్నంతల ఘనంగనే పెళ్లి చేసిండు. తండ్రి చనిపోయిన తర్వాత పుట్టెడు కష్టంతో ఇల్లు నిలబెట్టిన కొడుకును చూసి ఎంతగానో పొంగిపోయింది తల్లి. 

పెళ్లై అత్తగారింటికి పోయేటపుడు పూలమ్మ దుఃఖం ఆపడం ఎవలతరం కాలేదు. చెల్లెలు కాపురానికి పోతుంటే తల్లిని వదిలిపోలేక ఏడ్చే పసిబిడ్డలా గోపాల్‌ పొగిలి పొగిలి ఏడ్చిండు. అప్పటి దాకా చెల్లెలే లోకంగా బతికిన గోపాల్‌కు ఆమె లేని ఇల్లు వెలితిగా అనిపించేది. అందుకే వారానికోసారి చెల్లెలు ఇంటికి పోయేటోడు. ప్రతి పండగకూ చెల్లెలు కోరుకున్న చీర పెట్టేవాడు.
పెళ్లైన ఏడాది తర్వాత చెల్లెలుకు కట్నం కింద ఇస్తానన్న ఎకరం భూమిని బావ పరమేశ్‌కి చూపించాడు. ఆ ఏడు వానలు లేక ఏ పంట వేయలేదు. కంపచెట్లు మొలిచి, పెద్ద అడివి ఉన్నట్టు ఉన్న భూమి చూడంగనే మొఖం మాడిపోయింది పూలమ్మ భర్తకి. 

‘‘ఈ కంపచెట్ల భూమి నాకొద్దు... దాని ఖరీదు ఎంతైతదో.. అంత డబ్బులు ఇవ్వ’’మని అడిగిండు. ఆ ప్రకారమే యాభైవేలు ముట్ట చెప్పిండు గోపాల్‌. ఆ డబ్బులతో సూర్యాపేట టౌన్‌ పక్కనే వంద గజాల ప్లాట్‌ తీసుకున్నడు.

ఆ తర్వాత ఏడాదికి తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో ఒంటరి అయిపోయాడు గోపాల్‌. అన్న కోసం పూలమ్మ చాలా సంబంధాలు చూసింది. దూరపు చుట్టాల అమ్మాయి గౌరితో పెళ్లి ఖాయం చేసింది. అన్న పెండ్లిలో సందడి మొత్తం పూలమ్మదే. అన్నని పెళ్లి కొడుకును చేస్తూ చిన్నపిల్లలాగా సంబరపడ్డది. మొత్తానికి ఎవరి కాపురం వాళ్లకు అయింది. పూలమ్మకు ఒక పాప, బాబు పుట్టినరు. గోపాల్‌ దంపతులకి సంతానం దక్కలేదు. 

పదేండ్లు గడిచినయి. పరిస్థితులు మారిపోయినయి. వాళ్ల ఊరు పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అయింది. ఒక్క సారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చినయి. టౌనుకు దగ్గరగా ఉన్న గోపాల్‌ భూమికి కూడా డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వచ్చి ఎకరం యాభై లక్షలు పెట్టి కొంటామని అడిగినరు. లక్షలు, కోట్లు అనంగ వినడమే తప్ప తమ భూములకు కూడా అంత ఖరీదు వస్తదని కలలో కూడా అనుకోలేదు గోపాల్‌.

పదేళ్ల కిందట భూమి కొన్నపుడు గోపాల్‌ వాళ్ల అమ్మ పేరుతోని రిజిస్ట్రేషన్‌ చేయించినరు. ఇప్పుడు అది అమ్మాల్నంటే చెల్లెలు పూలమ్మ కూడా సంతకం పెట్టాల్సిందే అన్నరు భూమి కొనెటోళ్లు. తనను కష్టపడి చదివించి, పెంచి పెద్ద చేసిన అన్న కోసం సంతకం పెట్టడానికి పూలమ్మ సిద్ధమైనా ఆమె భర్త ఒప్పుకోలేదు. 

‘చట్టప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో ఆడబిడ్డకు కూడా సగం రావాలి. అంతకాక పోయినా.. ఐదెకరాల భూమిలో కనీసం ఒక ఎకరం ఖరీదు... యాభై లక్షలు ఐనా ఇవ్వాల్సిందేనని, లేదంటే తన భార్యని సంతకం పెట్టనీయన’ని అడ్డుపడ్డడు బావ. యాభై లక్షలు ఇస్తెనే చెల్లెలు మీ గడప తొక్కుతుంది... లేదంటే నీకు మాకు సంబంధమే లేదని తేల్చిచెప్పిండు. అంతేకాదు.. ఊరిలో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టి తమ వాటా ఇప్పించాలని గొడవ చేశాడు. పెళ్లి సంబంధం కోసం వచ్చినపుడు ‘పిల్లనిస్తే చాలు, కట్నం వద్దు’ అన్న బావ పదేండ్లు గడచిన తర్వాత తన ఆస్తిలో వాటా అడగడం, అదీ యాభై లక్షలు అడగడం ఆశ్చర్యం అనిపించింది గోపాల్‌కి.  

ఇంతకాలం తనతో ప్రేమగా ఉన్న మనిషి... బంధుత్వం కంటే డబ్బులకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధ అనిపించింది. అన్నిటికన్నా తన చెల్లెలు పూలమ్మ కూడా భర్తవైపే ఉండడం, తనకు మద్దతుగా ఒక్కమాట ధైర్యంగా మాటాడకపోవడం గోపాల్‌కి మింగుడు పడలేదు. పెద్దమనుషుల దగ్గర పంచాయతీ అలాగే ఎటూ తేలకుండా ఉంది. రెండు నెలల నుంచీ గొడవ జరుగుతోంది.  

ప్రతి ఏటా బతుకమ్మ పండక్కి రెండు రోజుల ముందుగానే పిల్లలతో పుట్టింటికి వచ్చే పూలమ్మ... ఆ గొడవ కారణంగా ఈ సారి రాలేదు. గోపాల్‌ కూడా రమ్మని పిలవలేదు. 

ఒక్క తమ ఇంట్లోనే కాదు, భూముల ధరలు పెరిగి లక్షలు వచ్చిన తర్వాత  కుటుంబాల్లో సంతోషం కంటే గొడవలు పెరిగినయి. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, పాలోళ్లు, తల్లిదండ్రులు, సొంత బిడ్డల మధ్యల కూడా కొట్లాటలు మొదలయినయి. ఒకప్పుడు తినడానికి తిండి లేక అనేక కష్టాలు పడ్డరు జనం. ఆ రోజుల్లో కారం మెతుకులే ఐనా కుటుంబం అంతా కలిసి తిన్నరు. సంతోషంగా బతికినరు. కానీ ఇప్పుడు డబ్బులు తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు. భూములకు విలువ పెరిగితే.... మనుషుల విలువ తగ్గిపోతుందా!? అనిపించింది గోపాల్‌కి.

ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఐతే మూడు రోజుల ముందే ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకునే వారు. ఇంటి నిండా ఆడబిడ్డలు, పిల్లాపాపల సందడితో మట్టిగోడలు కొత్తపానం పోసుకునేవి. చిన్ననాటి దోస్తులను పలకరించడానికి ఇల్లిల్లూ తిరిగే ఆడపిల్లలతో ప్రతి ఇంటికీ కొత్త వెలుగు వచ్చేది. 

పొద్దున్నే తెల్లవారక ముందే నిదుర లేచి... ఎర్రమట్టి, పేడతో కలిపి ఇల్లంతా అలికి, ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసిన తర్వాత, వరండాలో చాపలు పరిచి అడివి నుంచి తెచ్చిన తంగేడు, గునుగు పూలను కుప్పలుగా పోసేవాళ్లు. ఆ పూల రాశిలోంచి ఒక్కోపూవును తీసి పొందికగా మెట్లు మెట్లుగా అందమైన బతుకమ్మలను పేర్చే ఆడబిడ్డల చేతులు రాలిపోయిన పూలకు మళ్లీ ప్రాణం పోసేవి. 

రాకరాక పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలకు కోరిన పిండివంటలు కడుపు నిండా పెట్టాలనే ఆరాటంతో కట్టెల పొయ్యిముందు తిప్పలు పడే తల్లులు, ఆడబిడ్డకు కొత్తచీర పెట్టడానికి అప్పు కోసం ఇల్లిల్లూ తిరిగే తండ్రులు, అన్నలు .. ఇట్ల ఒక్క ఇల్లని కాదు, ఊరు నిండా ఏదో కనపడని అనుబంధం కమ్ముకుని ఉండేది. చేతిలో పైసా లేకున్నా ప్రతి మనిషి గుండెలో ప్రేమ ఉప్పొంగేది. ఇప్పుడు జేబుల నిండా డబ్బులున్నా గుండెల్లో ఖాళీతనం. ఆడబిడ్డల జాడ లేక ప్రతి ఇల్లూ పడావు పడ్డట్టు ఉంది. చిన్ననాటి బతుకమ్మ పండగ జ్ఞాపకాలు కళ్లముందు మెదిలి కండ్లళ్ల నీటి పొరలు కమ్ముకున్నయి గోపాల్‌కి. 

*******

ఆ రోజు అర్థరాత్రి సమయంలో ఊళ్లో అంతా నిద్దరపోతున్నారు. ఒక్కసారిగా గోపాల్‌ వాళ్ల బజారులో ఏదో గొడవ, కలకలం. ఈ యాలప్పుడు ఏం జరిగిందో అనుకుంటూ బజారులోకి వచ్చాడు. అప్పటికే బజారులో చాలామంది గుమికూడినరు. 

గోపాల్‌ ఇంటికి రెండు ఇండ్ల అవతల ఉన్న మల్లేశం, వీరన్న అన్నదమ్ములు. వాళ్లకు కూడా భూమి పంపకాల దగ్గర గొడవలు అవుతున్నాయి. ‘‘భూమి పంపకాలు సరిగ జరగలేదని మళ్లీ పంచుకుందాం’’ అని తమ్ముడు వీరన్న రోజూ అన్న మల్లేశం ఇంటి ముందు వచ్చి గొడవ చేసేవాడు. ‘‘ఎప్పుడో పంచుకున్నం కద, మళ్లీ కొత్తగా ఎట్ల పంచు కుంటం?’’ అని అన్న ఒప్పుకునేవాడు కాదు. 

మళ్లీ ఇవాళ కూడా అదే గొడవ కావచ్చు అనుకున్నాడు గోపాల్‌. అక్కడ పోలీసు జీపు వచ్చి ఆగి ఉంది. రోజూ వచ్చినట్టే తాగి వచ్చిన తమ్ముడు ఆవేశంలో అన్నను గొడ్డలితోని నరికి చంపాడట. పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిండట. మల్లేశం ఇంటిలోపలికి పోయి చూసిండు గోపాల్‌. మెడమీద నరకడంతో రక్తం మడుగులో పడిపోయి ఉన్నడు మల్లేశం. ఆ దృశ్యం చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టినయి. గబగబా ఇంటికి వచ్చాడు. చెంబెడు నీళ్లు గటగటా తాగేశాడు. గోపాల్‌ భార్య కూడా బజారులోకి పోయి చూసి వచ్చింది. 

‘‘భూమికి ధరలు లేనపుడు అన్నదమ్ములు ఎవని బతుకు వాడు సక్కగ బతికినరు. ఇప్పుడు భూమి విలువ కోట్లకు పెరిగినంక సుఖంగా ఉండలేకపోయినరు. ఒక్క తల్లిబిడ్డలు .. అన్న, తమ్ముని చేతిలో చచ్చిపోయిండు. అన్నను చంపిన తమ్ముడు జైలుపాలయ్యిండు. ఏం సాధించినట్టు?’’ అనుకున్నడు గోపాల్‌. రాత్రంతా నిదర పట్టలేదు. ఒక వేళ తన చెల్లెలు పూలమ్మ తమ్ముడు అయి ఉంటే కూడా తమ మధ్య ఇలాంటి గొడవే అయ్యేది కదా అనిపించింది. ఆ మాటే భార్యతో అన్నాడు. ఆమె ఆలోచనలో పడింది. 

******

 ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండక్కి తీసుకుపోవడానికి వచ్చే మామయ్య ఈసారి ఎందుకు రాలేదో అర్థం కాలేదు పూలమ్మ పిల్లలకు. ‘‘మామయ్య ఇంటికి పోదాం...’’ అని అడిగే పిల్లలకు ఏం చెప్పాలో తెలియలేదు పూలమ్మకు.  

అప్పటి దాకా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌తో ఫోన్‌లో మాటాడిన పూలమ్మ భర్త ఫోన్‌ కట్‌ చేసి ‘‘ఏమోయ్‌ గుడ్‌ న్యూస్‌. మన ప్లాట్‌కి దగ్గరలోనే కలెక్టర్‌ ఆఫీస్‌ వస్తోందట. మన ప్లాట్‌ వాల్యూ ధర చాలా పెరిగింది. ఇప్పుడు యాభై లక్షలకు తక్కువ ఉండదు’’ తట్టుకోలేని సంతోషంతో చెపుతున్నడు.

ఆ ప్లాట్‌ తన అన్న ఇచ్చిన యాభైవేలతో కొన్నదే. ఆ రోజు యాభై వేలు.... ఇప్పుడు యాభై లక్షలు అయింది. అయినా తన భర్తకి డబ్బు ఆశ తీరలేదు. భర్తకోసం... అన్న ఆస్తిలో వాటా కావాలని గొడవ చేయడం, కన్నతల్లిలా పెంచిన అన్నను దూరం చేసుకోవడం తెలివి తక్కువ పని అనిపించింది పూలమ్మకు. బతుకమ్మ పండగ పూట.. పుట్టింటికి దూరమై బాధపడుతున్న పూలమ్మకు భర్త మాటలతో అప్పటిదాకా కడుపు లోపల మరుగుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధ్థలయింది. 

‘‘మీ భూములకో దండం, మీ లక్షలకో దండం... ఆడపిల్లకు పుట్టినిల్లు దూరమైనంక.. ఎన్ని లక్షలు ఉన్నా ఏం లాభం. నాకు డబ్బులు కాదు. మా అన్న కావాలి. పుట్టిల్లు కావాలి. నేను మా పుట్టింటికి పోతున్న’’ అంటూ గబ గబా బ్యాగులో బట్టలు సర్దుకుంది పూలమ్మ. తమ ప్లాట్‌ ధర పెరిగినందుకు భార్య సంతోషిస్తుంది అనుకుంటే, తనకు పుట్టిల్లే కావాలని అడగడం పరమేశ్‌కి షాక్‌ కొట్టినట్టు అనిపించింది. వారం రోజులుగా పూలమ్మ తనతో ఎందుకు ముభావంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది.  

మరోవైపు పూలమ్మ ఏదో ఆవేశంలో భర్తతోని పుట్టింటికి పోతాను అని వాదించింది కానీ ‘‘వాటా కోసం పదిమందిలో పంచాయితీ పెట్టిన నన్ను అన్న క్షమిస్తాడా? ఇంటి లోపలకు రానిస్తాడా?’’ రకరకాలుగా ఆలోచిస్తోంది పూలమ్మ. 

ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘ఈ టైంలో ఎవరూ?’ అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా అన్న గోపాల్‌. పక్కనే వదిన. 

చెల్లెలిని చూడగానే, ‘‘తప్పంతా నాదే చెల్లె. నీ వాటా నీకు ఇస్తా. మన ఇంటికి పోదాం పద’’ అని పూలమ్మ చేతిలో భూమి కాగితాలు పెట్టి భోరుమన్నాడు గోపాల్‌. అన్నా, వదినల్ని చూడగానే దుఃఖం ఆగలేదు పూలమ్మకు. ఇద్దరిని గట్టిగా పట్టుకుని చంటిపాపలా వలవలా ఏడ్చింది.

‘‘నాకు ఏ భూమి వద్దు, కాగితాలు వద్దు అన్న. మీరు తోడుగ ఉంటే చాలు’’ అంటూ ఆ కాగితాలు ఎటో విసిరేసింది. ఇంటికి వచ్చిన మామయ్యని సంతోషంతో అల్లుకుని పోయారు పూలమ్మ పిల్లలు.                   

*******

మరునాడు సాయంత్రం గోపాల్‌ ఊళ్లో బతుకమ్మ పండుగ ఊరేగింపు మొదలైంది. మనుషుల జీవితాల్లోని కష్టాలు, సుఖాలు, ప్రేమలు, కన్నీళ్లు.. అన్నింటిని నింపుకున్న బతుకమ్మలు చెరువు వైపు తరలిపోతున్నాయి. పూలమ్మ పేర్చిన పెద్ద బతుకమ్మ నిండా అల్లుకుని పోయిన తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలు.. ఎప్పటికీ విడిపోని అన్నాచెల్లెల్లా తళతళా మెరిసిపోతున్నాయి.
 
 ***********

చందు తులసి

9985583022