గుజరాతీ మూలం: మీనల్ దవే
ఆంగ్లానువాదం: రీటా కొఠారి
తెలుగు: ఓల్గా
***************
నా వేళ్ళు కంప్యూటర్ కీ బోర్డు మీద కదులుతున్నాయి గానీ నా కళ్ళు గడియారం వంక చూస్తున్నాయి. ఇవాళ ఎట్టి పరిస్థితులలోనూ రైలుని అందుకోలేను. మిసెస్ రావు నన్ను చంపేస్తోంది. ఇంటికి వెళ్ళే టైముకి, అదీ చివరి క్షణంలో గానీ నాకు ఈ పని అప్పగించాలనే ఆలోచన ఆమెకు రాలేదు.నిజమే, ఆఫీసు పది పన్నెండు రోజుల తర్వాత ఇవాళే తెరిచారు. కానీ ప్రియమైన మిసెస్ రావు గారూ, మీరు మీ ఆయన స్కూటర్ మీద రాగానే ఎంచక్కా వెనకాల ఎక్కి ఇంటికి వెళ్ళి వేడివేడిగా ఇడ్లీ సాంబారూ లాగించేస్తారు.కానీ నేనో?ఆ రైలు గనక తప్పిపోయిందంటే మరో గంటసేపు ఆ స్టేషన్లో పడిగాపులు కాసి మరో రెండుగంటలు ప్రయాణం చేసి ఇంకో నగరానికి వెళ్ళాలి. తల్చుకుంటేనే భయం. నేనెక్కే కంపార్టుమెంట్‌లో నేను తప్ప ఎవరూ లేకపోతే ఏమవుతుందనే ఆలోచన వణికిస్తోంది. కానీ అది నీకర్థమవుతుందా?అమ్మయ్యా - అయిపోయింది.భగవంతుడా - అదుగో ఆటో వుందక్కడ.అరే .... భయ్యా - తొందరగా పోనివ్వు. చాలా రోజుల తర్వాత కర్ఫ్యూ తీసేశారు. బోనుల్లో పెట్టిన జంతువులు తలుపు తెరవగానే బైటికి ఉరికినట్లు జనం ఇళ్ళల్లో నుండి బైటికి ఉరుకుతున్నారు.
బొత్తిగా బుద్ధిలేని జనం. కార్లు, స్కూటర్లు అప్పుడే బైటికి తీశారు. ఇప్పుడెవరైనా ఒక టపాకాయ కాల్చారా నిమిషంలో ఇళ్ళల్లో దూరి తలుపులేసుకుంటారు.అయ్యో దేవుడా - ఈ రెడ్‌లైట్ ఇప్పుడే పడాలా?దురదృష్టవంతులకు చిల్లిబొచ్చే దొరుకుతుందట!సరిగ్గా ఏడు రూపాయలున్నాయి, చిల్లర కోసం వెతుక్కోనక్కర్లేకుండా. అమ్మో జనమంతా స్టేషన్‌నుంచి బైటికొస్తున్నారు - లోపలికి వెళ్ళేవారికి కూడా దారి వదులుతారా లేదా - మేము రైళ్ళు పట్టుకోవాలి. ఈ రైల్వేవాళ్ళున్నారే వాళ్ళంత మూర్ఖులింకొకరు ఉండరు. ఇంత పొడువైన ప్లాట్‌ఫాంకు ఆ చివరన మెట్లు పెడతారు. నేను ఎక్కాల్సిన రైలు నాలుగో నంబరు ప్లాట్‌ఫాం మీద కదలటానికి సిద్ధంగా ఉంది.అమ్మో ... పరిగెత్తాలి ... ఇంకొక రెండంగలు వేస్తే చాలు.. అదుగో అందుకుంటాను - అరరే .... వెళ్ళిపోయింది.