అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని అంతా అనుకున్నారు. కానీ పెళ్లయిన ఏడాదికే ‘నాకు విడాకులు కావాలి.. నా భర్తతో ఇక నేను కలిసి ఉండలేను..’ అని తేల్చిచెప్పిందా భార్య.. కారణమేంటని కుటుంబ సభ్యులు అడిగితే.. ఆమె చెప్పిన కారణం విని..
********************

‘‘అదేంటొసేవ్‌!! పెట్టుకుందామంటే, ఏడువారాల నగలూ లేవు, కట్టుకుందామంటే పట్టుచీనాంబరాలూ లేవు, అయినా ఏమిటే నీ ముస్తాబు ఎప్పటికీ తెమలదు? మనం పెళ్ళి చూడ్డానికి మాత్రమే వెళ్తున్నాం! నువ్వే పెళ్ళికూతురిలా గంటలు గంటలు అద్దంముందు కూలబడితే ఎలాగొసేవ్‌?’’గంటనించీ, అద్దాన్ని అంటిపెట్టుకుని కూర్చున్న మనవరాలు సుందరిని చూస్తూ రాజేశ్వరమ్మగారు, సుందరి అమ్మమ్మ, సహనం ఇక సహవాసం చేయడానికి మొరాయిస్తే అన్నారు. ‘‘మధ్యకొంచెం ఆగు అమ్మమ్మా! ఒకోసారి, పాపిడి సరిగాకుదరక ఇలానే ఉంటుంది. అదేదో, ప్రతిసారీ ఇంతే అన్నట్టు సాధిస్తావేంటీ’’ అమ్మమ్మ సహనానికి సెలవివ్వలేదు మనవరాలి వైనం.

 

‘‘పెళ్ళికి వెళ్ళడం అంటే, మొదటినించీ అన్ని వేడుకలూ చూడాలి, వాటిల్లో పాలుపంచుకోవాలి, అంతేగానీ, సగంసినిమా అయ్యాక, తడుముకుంటూ లోపలికెళ్ళి సీటులో కుదబడినట్టుండ కూడదే. ఏదో హోటల్‌కివెళ్ళి భోజనం చేసినట్టు బోయినాలకోసం వెళ్ళినట్టు అస్సలుండకూడదు’’.సుందరి అద్దంలోంచి చూపు మరల్చకుండా, తనపని తాను చేసుకుపోతోంది. అమ్మమ్మగారూ అంతే. ‘‘తోట సంబరం, కాశీయాత్ర, గౌరిబుట్టలో, లక్కపిడతలా ఉన్నా పెళ్ళికూతుర్ని, మేనమామలు తీసుకొస్తుంటే, ఆ వైభవం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయిటే?’’ అంటున్న అమ్మమ్మ పదఝరి ఆనకట్టలేకుండా సాగుతోంది.‘‘జీలకర్ర బెల్లం, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అప్పగింతలూ ఇలా ఆసాంతం చూస్తేనే, మనం ఫలానా పెళ్ళికెళ్ళాం అని గర్వంగా చెప్పుకోగలం.

అంతేగానీ, తూతూమంత్రంలా, ఉదయం పదింటికి ముహూర్తమైతే, పనిపాటా చేసుకుని, అటుఇటుగా, బోయినాలవేళకి, పెళ్ళిమండపంలో అడుగుపెట్టి, చల్లని ఏసీ హాల్‌లో, కాస్త చల్లనిడ్రింక్‌ ఆస్వాదించి, అదయ్యాకా, ప్రాణం తెప్పరిల్లేకా, ఇహ హాలు అలంకరణ ఎలాఉందీ, ఏర్పాట్లెలా ఉన్నాయి? అని అటుఇటు పరికించి, ఎవరెవరొచ్చారు, ఎవరు ఎలాంటి గిప్టులు ఇస్తున్నారు, ఎవరెవరు ఏమేమీ నగలు పెట్టుకున్నారు, అని చూసి హమ్మయ్య, మన పరిశీలన అయింది, సేదదీరడమూ అయింది....అని అందరితో పాటు క్యూలో నిల్చొని‍ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మొహాలమీద నాలుగు అక్షింతలు వేసేసి, మనకెవరో, ఏదో ఫంక్షన్‌లో ఇచ్చిన పాతగిఫ్టుల్లో ఓదాన్ని, శుభ్రంగా తుడిచి, పక్కనున్న ఫ్యాన్సీషాపులో అందమైన గిఫ్టు్‌ కాగితంతో దాన్నలంకరింపజేసి, దాన్ని ఆ కొత్త దంపతుల చేతిలో పడేసి, వాళ్ళతోకలిసి ఓ గ్రూపు ఫొటో తీసుకుని, భోయినాల గదికి దారితీసినట్టు ఉండకూడదే.

ఇక, కడుపునిండా నవకాయ పిండి వంటలూ దట్టించి, అది అరగడంకోసం ఓ రెండు తాంబూలాలూ లాగించి, వాటిని నములుతూ, దారి పొడుగునా, వంటలగురించి వంకలు పెట్టుకుంటూ, ఏర్పాట్లుగురించి పెదవి విరుచుకుంటూ, ఇంటికిచేరి, కట్టుకున్న కంచిపట్టు చీరని విప్పి, మంచంమీద గిరాటేసి, ఓ వాయిల్‌ చీర చుట్టుకుని, భుక్తాయాశం తీర్చుకోడంలా ఉండకూడదే పెళ్ళికెళ్ళడం అంటే...!’’