హైదరాబాదు నుండి ఖమ్మం జిల్లా. ఖమ్మం నుండి పాల్వంచ మండలం. పాల్వంచ నుండి ముతకపల్లి గ్రామం. ముతకపల్లి నుండి పన్నెండు కిలోమీటర్ల కాలినడక దమ్మాలగూడెం గ్రామం. బస్సు సౌకర్యం కూడా లేని కుగ్రామం అది. హైదరాబాదు నుండి రమారమి మూడువందల ఇరవై కిలోమీటర్ల దూరం.

ఆ కుగ్రామంలో ఉండే పంతంగి రాములు రోజుకూలి. అతనెప్పుడూ తలదించుకుని ఎందుకు నడుస్తాడో ఊరి జనానికి అక్కర్లేని విషయం. కారణం రాములు ఎప్పుడూ ఎవరినీ పలకరించడు. క్షణం నిలబడి ఎవరితోనూ ఒక్కమాట మాట్లాడడు. పొలంలోని పని పూర్తయ్యాక కూలిడబ్బులు తలకుచుట్టిన తువ్వాలలో దోపుకుని దించినతల పైకెత్తకుండా తన తాటాకుల పాకలాంటి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ తలుపంటూలేని గుమ్మంలో కూర్చుని ఉంటుంది మందారి. రాములుకి ఒక్కగా నొక్కకూతురు. వచ్చీరాని మాటలతో తనలో తనే నవ్వుకుంటూ సాయంకాలం మరలివచ్చే గేదెల్ని, ఆవుల్ని చూస్తూ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది. ఎనిమిదిన్నరేళ్లు దాటినా మాటలు సరిగ్గా రాలేదు.

ఆరోజూ అంతే ‘‘రండ్రి రండ్రి అమ్మలారా! పొండ్రి పొండ్రి తల్లులారా! ఏయ్‌ పో..పో...’’ అంటోంది ఆలమందతో. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ మాటకొస్తే పుట్టుకనుండే మందారి మెదడు ఎదగాల్సినంతగా ఎదగలేదు. మాట్లాడే పద్ధతులు అలవడలేదు.‘‘ఏంది తల్లీ! ఎవలితో మాట్లాడుతున్నావూ?’’ వచ్చి పక్కనే కూచుంటూ అడిగాడు రాములు.‘‘మా అమ్మతో మాటాడుతాను. మా అయ్యతో మాటాడుతాను’’ అంది. రాములను అదోలా చూస్తూ.‘‘మీ అయ్య ఎవరు తల్లీ?’’ కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ అడిగాడు.‘‘అదిగో ఆడ తోకవూపుతాండే. మా అయ్య’’ గేదెలవైపు చూపుతూ మందారి చెప్తుంటే ‘‘మరి మీ అమ్మ!’’ అన్నాడు నవ్వుతూ. లేవడానికి కాళ్లు లేని మందారి కొద్దిగా రాములువైపు తిరిగి అతడి మెడచుట్టూ చేతులువేస్తూ ‘‘నువ్వు మా అమ్మవు కాదా రాములూ?’’ అంది అమాయకంగా.