మిలట్రీలో రిటైరయ్యాకే వివాహం చేసుకున్నాడతను. ఇంటిని క్రమశిక్షణకు మారుపేరుగా తీర్చిదిద్దాడు. అతడి పిల్లలిద్దరూ కాలేజీ చదువులకు వచ్చారు. తోటిపిల్లలు సెల్‌ఫోన్లు, బైకులు, జల్సాలతో స్వేచ్ఛగా బతుకుతుంటే తమకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయిందని ఆ పిల్లలిద్దరూ బాధపడేవారు. తండ్రిమీద తీవ్ర అసంతృప్తి రేగింది. చివరకు వాళ్ళేంచేశారు? తండ్రిమీద తిరగబడ్డారా?

అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అరవింద మురిసిపోయింది. తన అందం తననే సమ్మోహపరుస్తోంది. కాలేజీలో కుర్రాళ్లు తన వెంట పడటంలో ఆశ్చర్యమేముంది? కాలేజీబ్యూటీ గా బిరుదు ఇవ్వటంలో వింత ఏముంది? వయస్సులో ఉన్నప్పుడు వైజయంతిమాల తనలాగే ఉండేదిట! అమ్మమ్మ చెబుతుటే ఎంత గర్వంగా ఉంటుందో.అందానికి పాత కొత్త ఏముంటుంది!అప్పటిరోజుల్లో ‘వైజయంతి’, ఆ వయసువాళ్ల మనసులను ఎంతగా గిలిగింతలు పెట్టిందో. అందం అంటే కేవలం తెలుపో, ఎరుపోకాదు. శరీరంలోని అణువణువూ అందమీనుతూ ఉండాలి.

ఆకర్షణ సూదంటురాయిలా ఉండాలి. చూసినవాళ్లు అవాక్కైపోవాలి.కళ్ళు విశాలంగా, నాసిక సంపెంగలా, కంఠం శంఖంలా, జుట్టు తుమ్మెదరెక్కల్లా, నడుము సన్నంగా, జఘనాలు ఘనంగా బరువుగా, పాదాలు ముద్దుగా, ముచ్చటగా, పెదవులు దొంగపళ్లలా తీర్చిదిద్దినట్టు...గొంతు కోకిలస్వరంలా..నడక రాయంచలా.ఇవన్నీ రాశీభూతంగా ఒక్కచోట ఏర్చికూర్చినట్టుంటే, అది అందంకాదు, సౌందర్యం! తనది అలాంటి సౌందర్యం. తనని చూసిఉంటే బాపుగారు ఎంత సంతోషించే వారో, ఎన్ని బొమ్మల్లో తన అందం చిత్రించే వారో.‘‘ఇకచాల్లే నీ సింగారం, కాలేజీ టైమయిపోతోంది’’ అంటూ వచ్చింది ఫ్రెండ్‌ విమల.

‘‘మరీ అంత అసూయపడకే..’’ మందహాసంతో అద్దంముందునుంచి కదలి కాలేజీకి బయలుదేరింది అరవింద. ‘‘అరవిందా! ప్లీజ్‌...నీ సెల్‌ నెంబరియ్యవూ?’’‘‘నాకు సెల్‌ ఉంటేగా ఇవ్వటానికి...’’‘‘అదేమిటి? నీకు సెల్‌ లేదా?! పోనీ నేను నీకు గిఫ్ట్‌గా ఇవ్వనా?’’‘‘సారీ...మా నాన్నగారు చూస్తే నేలకేసికొట్టి, తిట్లవర్షం కురిపిస్తారు’’‘‘బాబోయ్‌! మీ నాన్న అంతటి రాక్షసుడా?’’‘‘మిస్టర్‌! మైండ్‌ యువర్‌లాంగ్వేజ్‌. హౌ డేర్‌ యూ టాక్‌ లైక్‌ దట్‌’’ కోపంగా చూసింది క్లాసుమేట్‌ సుధాకర్‌కేసి.‘‘సారీసారీ..అలా కోపంగా చూడకు. మన్మథుడిలా మసైపోతాను’’ భయం నటించాడు సుధాకర్‌.ఈ సంభాషణ జరుగుతుండగానే స్నేహితురాళ్లు వచ్చి కలుసుకున్నారు. సుధాకర్‌ మెల్లిగా జారుకున్నాడు.