ఒక్క కుదుపుతో ట్రైన్‌ స్టేషన్‌లో ఆగింది. అది చాలా చిన్న స్టేషన్‌. ఎక్కువసేపు ట్రైన్‌ ఆగదని జనం తోసుకుంటూ క్రిందికి హడావిడిగా దిగుతున్నారు. బ్రీఫ్‌కేసు చేతిలోకి తీసుకుని ట్రైన్‌ దిగింది విజయ.తను ఇప్పుడు కలెక్టర్‌. వీరారెడ్డి ఉంచుకున్నదాని కూతురు కాదు. అందుకే దర్జాగా అడుగులు ముందుకు పడుతున్నాయి.‘‘మేడమ్‌... ఇటు ఇటు...’’ అంటూ ఎదురొచ్చి బ్రీఫ్‌కేస్‌ అందుకున్న అతన్ని పరీక్షగా చూసింది. తన చిన్నప్పటి స్నేహితుడు మురారి. నిట్టూర్చింది విజయ. ఇద్దరూ స్టేషన్‌ బైటికి వచ్చేసరికి జీప్‌ రెడీగా ఉంది. డ్రైవర్‌ మస్తాన్‌ గబగబా దగ్గరకొచ్చాడు.‘‘మస్తాన్‌ మామా! బాగున్నావా?’’ ఆత్మీయంగా అడిగింది విజయ.‘‘బాగున్నాను విజయమ్మా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి...’’ ప్రేమగా అన్నాడు మస్తాన్‌.

విజయ, మురారి జీప్‌ ఎక్కగానే డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నాడు మస్తాన్‌. నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సువర్ణపురం బోర్డు కనిపించింది. విజయ కళ్ళు అసహ్యంతో కుంచించుకు పోయాయి.ఈ ఊరు రాకూడదు అనుకుంది. ఈ ఊరివాళ్ళ మొహం కూడా తనకి చూడాలని లేదు. కానీ అధికారికంగా రాక తప్పలేదు.జీపు గవర్నమెంటు వసతి బంగ్లా ముందు ఆగింది. క్రిందికి దిగింది విజయ. మురారి తలుపుకు వేళ్ళాడుతున్న తాళం తీశాడు.‘‘మేడమ్‌! ఫ్రెష్‌ అవ్వండి. నేను వెళ్ళి టిఫిన్‌, కాఫీ తీసుకొస్తాను...’’ అంటూ అక్కడున్న ఫ్లాస్క్‌ తీసుకుని బయలుదేరాడు మురారి.‘‘అమ్మా! విశ్రాంతి తీసుకో. నేనా చెట్టుకింద ఉంటాను. అవసరం అయితే పిలువు బేటీ!’’ అని చెప్పి చెట్టుకిందకి వెళ్ళాడు మస్తాన్‌.

విజయ ఫ్రెష్షయ్యి బైటకి వచ్చింది.మురారి అరటి ఆకులో టిఫిన్‌ సర్ది అక్కడున్న టేబుల్‌ పైన ఉంచాడు. టిఫిన్‌ తిని కాఫీ తాగింది.‘‘ఇక్కడ కరువు తాండవిస్తుందన్నారు. చూస్తే అందరూ బాగానే ఉన్నారు’’ వ్యంగ్యంగా అన్నది విజయ.‘‘మొన్న వచ్చిన తుఫానుకు పంటలు నాశనం అయిపోయాయి. గొడ్డూ గోదా, కొన్ని ఇళ్ళు పాక్షికంగా పోయాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మేడమ్‌!’’ అన్నాడు మురారి.‘‘ఎందుకు మురారీ! నేనెవరో తెలీనట్టు ‘మేడమ్‌’ అని పిలుస్తున్నావు. నాకో హోదా వచ్చిందనా!’’ కవ్వింపుగా, కసిగా అడిగింది విజయ. తలవంచుకుని నిలబడ్డాడు మురారి.