మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ ‘‘ఇక్కడే ఉండిపోరా! పెద్దరైతువై దిట్టంగా పంటలు పండించాలి!’’ అన్నాడు కామయ్య మనవడితో.తలూపాడు యాష్‌... ఆ పేరేమిటో నోరు తిరగదు తాతకు.తాత చెప్పేది వాడికి అర్థమవుతుంది. వాడు మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు ‘‘వీడేమంటున్నాడూ?’’ అంటూ కొడుకును అడగాల్సిందే.

పల్లెటూరు యాష్‌కు నచ్చింది. ఎనిమిదేళ్ళుంటాయి వాడికి. పాలు తాగే వయస్సులో ఇండియా తీసుకువచ్చారు ఒకసారి తల్లిదండ్రులు. మళ్ళీ ఇండియాకు రావడానికి ఏడేళ్ళు పట్టింది కామయ్య కొడుక్కి.ఇంటి ఆవరణలోనే పశువుల సావిడి ఉంది. ఇంటి దగ్గరే పశువులు కన్పించడం యాష్‌కు ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో ఇళ్ళ దగ్గర, రోడ్ల మీద పశువులు కన్పించవు. తాత పాడిగేదె దగ్గర కూర్చుని పాలు పితకడం చూసి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో నుండి స్టీలుగిన్నె పట్టుకు వచ్చి తాత పక్కన చేరతాడు వాడూ పాలు పితకడానికి సిద్ధపడుతూ. ‘‘నీ వల్ల కాదురా బాబూ!’’ అంటే వినడు. తాత పక్కన చేరతాడు. తాత పొలం బయలుదేరితే వాడూ వెంట పడతాడు. ఆవుదూడ వెంట పరుగులు తియ్యడం, చెట్టుకొమ్మకు కట్టిన ఉయ్యాల మీద ఊగడం, పండిన బాదంకాయలు రాయితో పగులగొట్టి పప్పు తినడం, జామచెట్టు ఎక్కి కాయలు కొయ్యడం – అన్నీ వాడికి అమితానందాన్ని కల్గిస్తూ ఉన్నాయి.

‘‘వచ్చేవారం వాడి స్కూలు తెరుస్తారు. రేపే తిరుగు ప్రయాణం’’ అంది సుమిత్ర.కోడలు మాటలు విని దిగులుపడిపోయాడు కామయ్య.‘‘ఐదారేళ్ళకొక్కసారి వచ్చిపోతారు. అలా మొహం చూపించి వెళ్ళిపోతారు. చెప్పులో కాళ్ళు పెట్టుకొని వస్తే ఎలా తల్లీ?.... కనీసం నెల రోజులన్నా ఉండకపోతే ఎలా?’’వాళ్ళు అమెరికా నుంచి వచ్చి నెలా పదిహేను రోజులవుతుంది. కామయ్య వియ్యంకుడు హైద్రాబాద్‌లో ఉంటాడు. అక్కడ నెలరోజుల గడిపి మునిపల్లె వచ్చారు. ‘‘పట్టుమని పది హేను రోజులేనా ఇక్కడ ఉండేది’’ తనలో తాను గొణుక్కున్నాడు.భర్త దగ్గర్లో లేనప్పుడు ‘‘మీ అబ్బాయి, స్వరూప్‌గారు పొట్లాడుకుంటున్నారు మామయ్య గారూ!’’ అంది సుమిత్ర మామగారితో.‘‘ఎందుకు?’’ అడిగాడు మామయ్య ఆదుర్దానిండిన కంఠంతో.‘‘మూడెకరాల పొలం గురించి... ఆ పొలం తనకు అమ్మేయ్యమని స్వరూప్‌ అడుగుతున్నాడు. మీ అబ్బాయికి పొలం అమ్మడం ఇష్టం లేదు. ఇద్దరికి నచ్చచెప్పండి’’ అంది సుమిత్ర.