మిథిలానగరాన్ని బహుళాశ్వుడు పాలించేవాడు. అతని భార్య పేరు బహుళ. వారి ఏకైక కుమారుడు మదనుడు. యుక్తవయస్సు వచ్చింది అతనికి. ఆ వయస్సుకి తగ్గట్టుగా అతనికి వేటంటే ఇష్టం. పొద్దు పొడిచిందంటే చాలు, అరణ్యాలకు పరుగుదీసేవాడు మదనుడు. చీకటి పడితేనేగాని అంతఃపురానికి చేరుకునేవాడు కాదు. ఒకరోజు అతన్ని తల్లి పిలిచింది. చెప్పిందిలా.‘‘నాయనా! పడమర, ఉత్తర, దక్షిణదిక్కుల్లో ఏ దిక్కుకైనా నువ్వు వెళ్ళి వేటాడు. అభ్యంతరం లేదు. కాని, తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళకు.’’ఎందుకు వెళ్ళకూడదు? అని ఎదురు ప్రశ్నించ లేదు మదనుడు. తల్లి మాట కాదనక సరేనన్నా డప్పుడు.తూర్పుదిక్కుకు వేటకి వెళ్తే రాకుమారి ప్రభాత గురించి మదనుడు వింటాడేమోనని తల్లి భయం. వింటే తన కుమారుడు తనకు దక్కడు. ప్రభాతను వెదికే ప్రయత్నంలో దూరం అవుతాడని ఆమె ఆందోళన.తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తూర్పుదిక్కునకు చాలా రోజుల పాటు వేటకు వెళ్ళలేదు మదనుడు. అటు వెళ్ళక మిగిలిన మూడు దిక్కుల్లోనే వేటాడుతూ ఆనందించాడు. ఒకనాడు అటుగా ఎందుకు వెళ్ళకూడదు? అనిపించింది. తల్లి ఎందుకు వెళ్ళవద్దన్నదీ తెలుసుకోవాలనిపించింది. తూర్పుదిక్కునకు ప్రయాణించాడు.

అక్కడి అరణ్యం లోనికి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో జంతువులు లేవు. ఉన్నవన్నీ పక్షులే! ఆ పక్షుల్లోనూ చిలుకలే ఎక్కువగా ఉన్నాయి. చిలుకలు వాలి ఓ చెట్టంతా మరింత పచ్చగా కనిపించేసరికి, ఆ చెట్టుకి బాణాన్ని గురిపెట్టి వదిలాడు మదనుడు. బాణం వదిలిన శబ్దానికే చిలుకలన్నీ ఎగిరిపోయాయి. చెట్టంతా బోసి పోయింది. కొమ్మను గుచ్చుకుని నిలిచి పోయింది బాణం. ఆ బాణం మీదికి వచ్చి, వాలిందో చిలుక. ఎగిరి ఇంకో చెట్టును ఆశ్రయించుకుని ఉన్న చిలుకల్ని చూసింది. ఇలా అంది.‘‘రండి ఇక్కడికి. రాలేదో... రాకుమారి ప్రభాత గురించి ఈ రాకుమారుడికి చెబుతాను.’’‘‘చెప్పకే పాపం’’ అంటూ వచ్చి వాలాయి చిలుకలు.రాకుమారి ప్రభాత ఎవరు? ఆమె గురించి తనకు చెబుతానని చిలుక భయపెట్టడమేమిటి? చెప్పవద్దని మిగిలిన చిలుకలు ఎగిరి రావడం ఏమిటి? ఆలోచనలో పడ్డాడు మదనుడు. అడిగాడిలా.