చల్లని సాయంత్రం. పెద్ద ఇల్లు. ఇంటి చుట్టూ తోట. పెరట్లో ముచ్చటపడి వేయించుకున్న సిమెంటు చప్టా. పక్కనే గంటకిపైగా మౌనంగా కూర్చున్న భర్త. కాస్తంత దూరంలో మర్రి చెట్టు ఊడపట్టుకుని ఊయలూగుతున్న ఉడతపిల్ల. కొమ్మకొమ్మకీ పిట్టలు.. అవి చేసే కోలాహలం. ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆ వాతావరణం మధ్య సత్యమూర్తి గంభీర మౌనం...ఆ మౌనం వెనుక అంతరార్థం తెలిసిన ఇంటి ఇల్లాలు వసుధ భర్తవైపే చూస్తోంది. ఒకవైపు భర్త తీరని కోరిక, మరోవైపు కొడుకు దురాశ! ఈ ఇద్దరిమధ్యా ఆమె నలిగిపోతోంది.
కొడుకు కౌశిక్ తెగ చదివేవాడు. వాడినిచూసి మురిసిపోయేది వసుధ. కానీ ఎందుకో ఎంత చదివినా ఏవరేజ్ మార్కులే. చిన్న వయసులో, తక్కువ సమయంలో, ఎక్కువ కష్టపడకుండా కోట్లు ఆర్జించాలనే కొడుకు ఆశ! ఉన్న ఇంటినీ, ఆ ఇంటి పచ్చదనాన్నీ కాపాడుకోవాలనే భర్త ఉద్దేశానికి కొడుకు విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నాడు.‘ఉన్నత విద్య పూర్తయ్యేలోపే ఉన్న ఇంటిని కూల్చేసి ఆ స్థానంలో అపార్ట్‌మెంట్లు కట్టాలి, వాటిని మంచి ధరలకి అమ్మేసి ఒక్కసారిగా కోటీశ్వరుడైపోవాలి’ ఇదీ కౌశిక్ విపరీత కోరిక.సత్యమూర్తి దీర్ఘాలోచనలో ఉన్నాడు. ‘తన తండ్రి చిన్న ఉద్యోగస్తుడు. ఏమీ కూడబెట్టలేకపోయాననే దిగులుతోనే మరణించాడు. ఆ తర్వాత తల్లి మంచం పట్టింది. తల్లి జబ్బు నయం చేయించేందుకు ఐదేళ్ళపాటు ఖర్చులతో ఉక్కిరిబిక్కిరైపోయాడు సత్యమూర్తి.
తన కొడుకు కౌశిక్‌కి తనకంటే మంచి ఉద్యోగం దొరికిందని తెగ సంబరపడిపోయాడు. తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లు కట్టుకున్నాడు. రిటైరయ్యాక వచ్చిన బెనిఫిట్లతో ఉన్న అప్పులు, బ్యాంకు లోన్లు క్లియర్ చేశాడు. దాంతో ప్రహరిగోడ పెండింగ్‌లో పడిపోయింది. ఇంటికీ, ఇంటి చుట్టూ ఎంతో ప్రేమతో తను పెంచుకున్న పచ్చని తోటకీ రక్షణ కరువైంది. ప్రహరీగోడ కట్టించలేకపోయాడు. ఇంటిచుట్టూ రక్షణ లేకపోతే తోటంతా పాడయిపోతుందని, ఇంటికీ రక్షణ ఉండదనీ, కనక గోడ కట్టే బాధ్యత నీదేనని కొడుకుకి పదేపదే చెప్పాడు సత్యమూర్తి. కానీ కౌశిక్ ఆ మాటల్ని పెడచెవిన పెట్టాడు. అతడి ఆలోచన వేరు. అతడి దృష్టిలో తనది చాదస్తం, తనొక మనీ ప్లానింగ్ తెలియని మనిషి!’.