పూర్వం రాజులు మారువేషాల్లో తిరిగి ప్రజాక్షేమం తెలుసుకునేవారు. ఆ దేశం రాజు కూడా అలాగే చేశాడు. ప్రజలు దారిద్ర్యాన్ని చూసి చలించిపోయాడు. వారి బతుకులు బాగుచెయ్యాలనుకున్నాడు. మంత్రులు చెప్పిన ఆచరణ సాధ్యంకాని సలహాలన్నింటినీ తోసిపుచ్చాడు. ఒక మహాజ్ఞాని తో భేటీ వేశాడు రాజు. చివరకు అతడిచ్చిన ఒక సలహాను అమలు చేశాడు. అనుకున్న ఫలితాలు కనిపించాయి. ప్రజలు జ్ఞానవంతులయ్యారు. దారిద్ర్యం తగ్గింది. కానీ రాజుకు మరో చింత మొదలైంది. ఏమిటది?
ఒకానొకప్పుడు స్వరూపదేశాన్ని ప్రతాపసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన పాలనలో ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో తెలుసుకునేందుకు అతడు కొంతకాలంపాటు రాజ్యం నలుమూలలా సంచారం చేశాడు. అలా అతడికి తనపాలనలో ఎందరో ప్రజలు దుర్భర దారిద్య్రంతో బాధపడుతున్నారని తెలిసింది. రాజధానికి తిరిగివెళ్లాక, రాజు మంత్రులందరినీ సమావేశపరిచి, ‘‘నా ప్రజలందరికీ తిండికీ,గుడ్డకీ లోటుండకూడదు. అప్పుడే నాకు మనసు స్థిమితపడుతుంది. అందుకేం చేయాలో చెప్పండి’’ అన్నాడు.అప్పుడు మంత్రులందరూ రాజుకు ఎన్నో సంక్షేమమార్గాలు సూచించారు. రాజు వెంటనే, వాటి అమలుకి ఎంత ఖర్చవుతుందా అని అంచనావేయించాడు.
ఖజానాలోని రొక్కం అంతా తీసినా కూడా, అందుకు చాలదని లెక్క తేలింది. ‘‘డబ్బు కోసం యుద్ధం ప్రకటిద్దాం. పొరుగు రాజ్యాలమీద దండెత్తి డబ్బు కొల్లగొట్టి తెద్దాం’’ అన్నాడు ఒక మంత్రి.ప్రతాపసేనుడు దీనికి ఒప్పుకోలేదు, ‘‘మనం పొరుగురాజ్యం మీద యుద్ధానికి వెడితే అందుకు సైన్యాన్ని సమాయత్తం చేయాలి. యుద్ధం అమిత వ్యయంతో కూడుకున్నది. అటుపైన జయాపజయాలు దైవాధీనాలు!’’ అన్నాడాయన. అప్పుడు మరో మంత్రి, ‘‘మహాప్రభూ, మనకు పొరుగున ఉన్న చిత్రసేనుడు సైనికపరంగా బలహీనుడు. ఆర్థికంగా బలవంతుడు. అతడిపై యుద్ధానికి వెడితే, మనకు విజయం తథ్యం’’ అన్నాడు.‘‘చిత్రసేనుడు ఓడిపోతే, అతడి రాజ్యం కూడా మనదే అవుతుంది. అతడి ప్రజలు మన ప్రజలు అవుతారు. వారిని దోచుకుని స్వరూపదేశ ప్రజలకు పంచిపెట్టటం న్యాయం అనిపించుకోదు’’ అని ఆ సలహానీ కొట్టిపారేశాడు ప్రతాపసేనుడు.
అలా మంత్రులు రాజుకు రకరకాల సలహాలు ఇచ్చారు. కానీ ప్రతిదానికీ ఆయన ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూ వచ్చాడు. చివరకు ప్రతాపసేనుడు మంత్రులను కోపంగా చూసి, ‘‘నా ప్రజల గురించి తక్షణం నేనేమైనా చేయాలి. ఇందుకు మీరెవ్వరూ మంచి సలహాలివ్వలేకపోతే, మీ మంత్రి పదవులే వ్యర్థం. మీకు వారంరోజులు గడువు ఇస్తున్నాను. నాకు నచ్చే సలహా చెప్పలేకపోతే, మీ పదవులకు స్వస్తి అని గుర్తుంచుకోండి’’ అన్నాడు. మంత్రులకు ఏమీ పాలుపోలేదు. తాము పదవుల్లోంచి తొలగక తప్పదని అనుకుని రోజులు లెక్క పెట్టుకోవడం మొదలెట్టారు.