విరాట దేశ రాజు శ్రీముఖుడు.అతడు విలాసాల్లో మునిగితేలుతూ ప్రజల కష్టసుఖాలు పట్టించుకోవడం మానేశాడు. దాంతో రాజోద్యోగులు అవినీతికి పాల్పడ్డారు. సైనికులు దోపిడీలకు అలవాటుపడ్డారు. ప్రజలు ఈ కష్టాలు భరించలేకపోయారు. కొందరు యువకులు రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ ఆయుధ సేకరణ చేసి తిరుగుబాటు సన్నాహాలు ప్రారంభించారు.
విరాటదేశంలో ప్రజావిప్లవం బలపడుతోందన్న విషయం గ్రహించిన పొరుగురాజు చతురసేనుడు విప్లవకారులకు సాయపడతానని కబురంపాడు. వాళ్లు సరేనన్నారు. చతురసేనుడి సాయంతో బలపడిన ప్రజావిప్లవం శ్రీముఖుడి సైనికబలాన్ని ఓడించింది. చేసేదిలేక శ్రీముఖుడు రహస్యమార్గాన అడవులకు పారిపోయాడు. చతురసేనుడు తన ప్రతినిధిని విరాటదేశపు రాజుగా ప్రకటించి ప్రజలకు మేలుజరిగేలా కొత్త శాసనాలు ప్రకటించి వెంటనే అమలు చేశాడు.అడవిపాలైన శ్రీముఖుడు తన దుస్థితికి కారణమేమిటా అని కొన్నాళ్లపాటు ఆలోచించాడు. అయితే ఆయనకి తన తప్పు తెలియలేదు. ‘నేనెప్పుడూ చతురసేనుడికి ఎటువంటి అపకారం చేయలేదు. అయినా రాజ్యకాంక్షతో ఆయన నాకు ద్రోహంచేసి నాకీ దుస్థితి కల్పించాడు’ అనుకున్నాడు. దాంతో ఆయనకు చతురసేనుడిపై కోపం పుట్టింది. అది క్రమంగా పెరగసాగింది.
చతురసేనుడిపై పగ తీర్చుకోవాలని గట్టిగా సంకల్పించాడు.ఏకాకిగా అడవిలోవున్న శ్రీముఖుడు పగ ఎలా తీర్చుకోగలడు? ఏదో రూపంలో అదృష్టం కలిసిరాదా అనుకుంటూ ఆయన - అడవిలో లభించిన ఫలాల్ని తింటూ, క్రూరమృగాల బారినుంచి తనను తాను రక్షించుకుంటూ అక్కడే తిరుగుతున్నాడు. అలా రెండువారాలు గడిచాక ఒకరోజున శ్రీముఖుడికి చెట్టుక్రింద తపస్సు చేస్తున్న ఒక ఋషి కనిపించాడు.దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఆయన ముఖాన్ని చూసి శ్రీముఖుడు అబ్బురపడుతూండగా , అంతలో చప్పున ఆ ఋషి కళ్ళు తెరచి ఎదురుగా కనిపించిన మనిషినిచూసి, ‘‘ఎవరు నీవు?’’ అనడిగాడు. శ్రీముఖుడు ఆయనకు వినయంగా నమస్కరించి తన కథ చెప్పుకున్నాడు.