‘‘నేనొకపాలి మేస్ర్టీటు బాబుని కలాలండి..’’అంది రావులమ్మ.ప్లీడరు గారికి ఆ ముక్క మొదట అర్థం కాలేదు.‘‘ఎవర్ని కలవాలి..?’’ అడిగేరు.‘‘మేస్ర్టీటు బాబునండి. అదేనండి ..నా పెనివిటికి శిచ్చేశారు గదండి. ఏడుసమచ్చరాల శిచ్చ. ఆర్నోపాలి కలాలండి’’మళ్ళీ వివరంగా చెప్పిందిరావులమ్మ.
ప్లీడరు సుందరంగారు ఓసారి కళ్ళజోడు సవరించుకున్నారు. బట్టతల తడువుకున్నారు. కోటు సర్దుకున్నారు. అన్నీ చేసేక కూడా ఆయనకి రావులమ్మ అనేదేంటో సవిస్తరంగా అర్థంకాలేదు.రావులమ్మ మొగుడు మూడేళ్ళక్రితం ఓ ఖూనీ కేసులో ఇరుక్కుని సాక్ష్యాధారాలు బలంగా వుండటం చేత ఏడు సంవత్సరాల శిక్షకి గురయ్యేడు. ఆ కేసు తనే వాదించేడు. రావులమ్మ మొగుడి తరపునే వాదించేడు. తన గుమస్తాకి ఈవిడ తెలుసట. ఆయన పట్టుకొచ్చేడు. డబ్బులు పెద్దగా రాలవని తెలిసినా ఏదో పాపం బీదరాలు, అడుగుతోంది కదాని జాలికొద్దీ వాదించేడు. కానీ ముందే చెప్పేశాడు.. సాక్ష్యాలు బలంగా వున్నాయి. శిక్ష తప్పించుకోడం కుదరని పని అని.‘‘పోన్నెండి బాబూ.. అదేదో ఆవేశంలోనో, కోపంలోనో సేసాడు తప్ప మనిసి మంచోడే అని తమరు వోదిత్తే శిచ్చయినా తగ్గుద్ది కదా. పోనీ అలాగైనా మంచిదే కదా. కాదనీవొద్దు బాబూ .. నాకింకెవరూ తెల్దు.
డబ్బులు కూడా ఎక్కువిచ్చుకోనేను. ఇప్పుడికే తల మీద అప్పుంది. అప్పులోన అప్పు.. అమ్మికొక కమ్మి అన్నట్టిగ తలతాకట్టు పెట్టైనా ఎంతోకొంత తెచ్చిచ్చుకుంతాను. తమరు కాదంటే నాకు యేరే గతి నేదు..’’ అని బతిమలాడింది రావులమ్మ.సరే.. పోనీ తన తెలివంతా ఉపయోగించి వీలైనంత తక్కువ శిక్షలో బైట పడేట్టు చేద్దాం అనుకున్నాడు. ఏదైనా ఏడు సంవత్సరాల శిక్ష తప్పలేదు.మేస్ర్టీటు బాబునంటే తన మొగుడికి శిక్ష వేసిన జడ్జిగారిని కలవాలని అడుగుతోందని అర్థమౌతూనే వుంది.
కానీ, ఇప్పుడెందుకు ఆయన్ని కలవాలంటుందో ప్లీడరు గారికి ఏమాత్రం అర్థంకాలేదు. మళ్ళీ ఆలోచించాక ఒకటనిపించింది. అమాయకత్వం .. అవును అమాయకత్వంతోనే కలవాలంటోంది. బహుశా శిక్ష తగ్గించమని అడుగుతుందేమో! ఒకసారి శిక్ష పడ్డాక చేసేదేమీలేదనీ, సత్ప్రవర్తన కారణంగా రిలీజు కావాలన్నా అది నేరస్థుడి తరపువాళ్ళు అర్థించడం వల్ల అయ్యే పని కాదనీ ఈవిడకు తెలియదు పాపం. అందుకే ఆయన్ని కలవాలనుకుంటోంది. అంతే.. అంతే అయుంటుందని అనుకున్నాడాయన.