రంగారావుగారింట్లో వంటపని పూర్తిచేసుకుంది జయమ్మ.ఇంటికివెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఏదో కవరు. చూసి ఆశ్చర్యపోయింది.‘తనకు ఉత్తరం రాసేదెవరు? ఎక్కడినుంచి వచ్చిందీ కవరు?’ ఆసక్తిగా తీసి చింపి చదివింది.‘‘జయక్కకు,కులాసా అని తలుస్తాను. మా అమ్మ రంగాయమ్మకు ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. విజయవాడలో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావుకదా! మొగల్తూరు మా దగ్గరకు వచ్చేస్తే అమ్మకు తోడుగా ఉంటావుకదా! నేను ఒక్కదాన్నీ అమ్మను కనిపెట్టుకుని ఉండలేకపోతున్నాను. నా మాట మన్నించి వెంటనే వస్తావని ఆశిస్తున్నాను’’.–నీ చెల్లి కమల.
జయమ్మకు ఒక్కసారిగా ఎంతో సంతోషం కలిగింది. చెల్లెలు కమల తనను రమ్మని ఆహ్వానించింది. ఇంతకాలంగా ఎవరికీ అక్కరలేని మనిషిగా జీవితం గడుపుతోంది తను. ‘తప్పకుండా వెళ్ళాలి’ అని నిర్ణయించుకుంది.తనకు తెలిసి తెల్లవారుజామున నాలుగుగంటలప్రాంతంలో హైదరాబాద్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ వస్తుంది. అది ఎక్కితే దాదాపు ఉదయం తొమ్మిదిగంటలకు నర్సాపురం చేరుకోవచ్చు. అక్కడినుంచి బస్సుమీద మొగల్తూరు వెళ్లవచ్చు.
రంగాయమ్మగారు సంపన్నురాలు. సులువుగా వారింటికి చేరుకోవచ్చు’’ అనుకుని మొగల్తూరుకు ప్రయాణమైంది జయమ్మ.రైలెక్కి సీట్లో కూర్చున్న జయమ్మకు అనేక సంగతులు గుర్తుకురావడం మొదలుపెట్టాయి.తనకు పద్దెనిమిదేళ్ళు నిండగానే పెళ్ళిచేశారు. రెండేళ్ల సంసార జీవితానికి ప్రతిఫలంగా ఏడాది కొడుకును చేతిలోపెట్టి భర్త కన్నుమూశాడు. తనను ఏవరూ జేరదీయలేదు. నానా కష్టాలూపడి కొడుకును చదివించింది. కొడుకు రవి చదువు పూర్తికాగానే ఉద్యోగం వచ్చింది. కలవారమ్మాయి కోడలిగా వచ్చింది. పెళ్ళైన మూడునెల్లకే వియ్యపురాలి కుటుంబం చులకనగా చూడ్డం మొదలెట్టింది. జయమ్మ తట్టుకోలేకపోయింది. కొడుకు కూడా తనకు పట్టనట్టు ప్రవర్తించాడు. ఆ తరువాత తల్లీకొడుకుల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.ఈ నలభైయేడేళ్ళ వయసులో ఇంతకాలానికి తననుగుర్తించి దూరపు బంధువు కమల చెల్లిగా తన ఉనికిని గుర్తించి రమ్మని ఆహ్వానించింది. నా అనేవాళ్ళ ఆత్మీయతకోసం తపించిపోతున్న జయమ్మకు చెల్లెలు కమల పిలుపు ఎంతో మానసిక బలాన్ని కలగజేసింది. రైలు దిగి, బస్సుమీద మొగల్తూరు చేరుకుంది. చాలా సులభంగానే ఇల్లు తెలిసింది.